Dowry Case 2025: కట్నం అంటే ఇప్పటికీ వివాహం తర్వాత కూడా కొందరి జీవితాల్లో పీడకలలా మారింది. అయితే బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన మాత్రం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. బైకు, నగదు, నగలు ఇవ్వలేదని కోడలిని హింసించడం, చివరికి ఆమె భర్తకు కిడ్నీని కట్నంగా ఇవ్వమని అడగడం లాంటి వింత కథను మనం ఇప్పటి వరకు సినిమాల్లో చూసుంటే చూసి ఉండవచ్చు. కానీ ఇది నిజంగా జరిగింది. ఇది మన సమాజంలో ఇంకా ఎంత లోతుగా కట్నం అనే శాపం నిలిచిపోతోందో చెప్పే దారుణ ఉదాహరణగా మారింది.
ముజఫర్‌పూర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు
దీప్తి అనే మహిళ తనపై జరుగుతున్న దాడులు, ఒత్తిడిని తట్టుకోలేక చివరకు ముజఫర్‌పూర్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. 2021లో వివాహం అయిన ఆమె, మొదట మామూలుగా గడిపినా.. కాలక్రమేణా తన అత్తమామలు బైక్, నగదు, బంగారు ఆభరణాలు కోసం ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. ఇవన్నీ సమకూర్చలేనని స్పష్టంగా చెప్పిన తరువాత, ఆమెకు ఎదురైన అవమానాలు మాత్రం దారుణంగా మారిపోయాయి. ఆమె ఆరోపణల ప్రకారం, తమ కుమారుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి ఆమె ఒక కిడ్నీని దానం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
కిడ్నీ ఇవ్వలేదని కొట్టేసారు.. బాధితురాలి వేదన
దీప్తి తన ఫిర్యాదులో పేర్కొన్నవాటిని చదివితే ఏ మనసైనా కదలాల్సిందే. నా భర్తకు పెళ్లి సమయంలోనే కిడ్నీ సమస్య ఉందని తనకు పెళ్లైన రెండేళ్ల తర్వాత తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి సమయంలో ఆ విషయాన్ని ఎవరూ చెప్పలేదని, తర్వాత వారు కిడ్నీ అవసరమని చెప్పారు. మొదట్లో తేలికగా తీసుకున్నా.. తను నిరాకరించడంతో తర్వాత పిడికిడిలతో కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఇంటి నుంచి బయటకు గెంటి వేశారని ఆమె తన వేదనను తెలిపింది.
పోలీసులకు సవాలుగా మారిన వివాదం
ఈ వ్యవహారంపై మహిళా పోలీస్ స్టేషన్‌కి వచ్చిన తర్వాత, పోలీసులు మొదట ఇద్దరు వర్గాల మధ్య సామరస్యం కోసం ప్రయత్నించారు. కానీ, ఒత్తిడి, వేధింపులు, ఆరోపణలు పెరిగిపోతుండడంతో ఎట్టకేలకు దీప్తి తన భర్తతో విడాకుల కోరికను వ్యక్తం చేసింది. కానీ, భర్త ఆమెకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించాడట. ఇక పూర్తి విచారణలోకి వెళ్లిన పోలీసులు, ఆమె భర్తతో పాటు అతని తల్లి, తండ్రి, మరికొంత కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. మొత్తం నలుగురిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
సంప్రదాయాల పేరుతో విడ్డూరాలెందుకు?
ఇదంతా వింటే మనకు మన దేశంలో ఉన్న వరకట్న వ్యవస్థ ఇంకా ఎలా బలంగా పాతుకుపోయిందో అర్థమవుతుంది. చట్టపరంగా నిషేధించినా కూడా, కట్నం కోసం అడిగే దురాచారాలు కొత్త కొత్త రూపాల్లో బయటికొస్తున్నాయి. బైక్‌లు, నగదు మాత్రమే కాదు.. ఇప్పుడు శరీర భాగాల వరకు కోరికలు పెరిగినట్టు ఈ ఘటన చెబుతోంది. ఇది కేవలం విడ్డూరమే కాదు.. మన దేశంలో మహిళల భద్రతకి సంబంధించిన అంశంగా మహిళా సంఘాలు తమ వాణి వినిపిస్తున్నాయి.
Also Read: Nature Tourism: 164 ఏళ్ల జీవం.. నేటికీ ఏపీలో.. ఈ అద్భుతం మీరు చూశారా?
బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేసిన మాటలు గుర్తొస్తున్నాయా?
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవలి కాలంలో ఓ వ్యాఖ్య చేశారు. వరకట్నం అడిగే కుటుంబాల పెళ్లిళ్లకు నేను వెళ్లనని చెప్పిన ఆయన మాటలు ఈ సందర్భంలో మరింత బలంగా వినిపిస్తున్నాయి. కానీ మాట్లాడే స్థాయికి మాత్రమే పరిమితమవుతుందా? సమాజంలో ఉండే వ్యక్తుల మనస్తత్వం మారకపోతే, ఎంత చట్టాలున్నా, ఎంత నాయకుల వ్యాఖ్యలున్నా పనికిరావు.
ఇలాంటి ఘటనలకు ముగింపు ఎప్పుడు?
ఈ ఘటనపై ముజఫర్‌పూర్ ఎస్పీ విద్యాసాగర్ మాట్లాడుతూ.. తాము ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. అసలు విషయాన్ని తెలుసుకొని భాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామిని కాపాడటానికి స్వచ్ఛందంగా ఏదైనా చేయడం ఒక విషయం. కానీ బలవంతంగా, కట్నంగా కిడ్నీ అడగడం అంటే అది మానవత్వానికే చెయ్యి ఎత్తడం లాంటిదని కొందరు అభివర్ణిస్తున్నారు.
ఇది వింత ఘటన కాదు. ఇది వరకట్నం పేరుతో మహిళలపై జరుగుతున్న శారీరక, మానసిక దాడుల తీవ్ర రూపం. ఇది కేవలం ఒక కథే కాదు, ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకూడదంటే, మహిళా సమాజం మేల్కోవాలన్నది మరికొందరి అభిప్రాయం. కట్నం అనే సంస్కృతి మన సమాజంలో మారాల్సిందే. లేకపోతే ఇలాంటి ఘటనలు ఎన్నైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.