Boss BreaksIn Employee Home| ఒంటరిగా నివసిస్తున్న ఒక మహిళ ఉద్యోగి ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఇంట్లో షాకింగ్ దృశ్యం చూసింది. ఆమె ఆఫీసులో పనిచేసే బాస్ తన ముందు నిలబడి ఉన్నాడు. పైగా తన బెడ్ పై అండర్ వేర్ లో ఉన్నాడు. అది చూసి ఆమె భయపడిపోయింది. ఆ తరువాత అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ ఘటన జపాన్ దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని ఫుకువోకా ప్రాంతంలో ఒక 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి తన ఉద్యోగిని ఇంట్లో, కేవలం అండర్‌వేర్‌లో ఆమె మంచం మీద పడుకుని ఉన్నాడు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుగల ఆ యువతి ఆఫీసు నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయంలో కొన్ని వస్తువులు తీసుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయింది. అది చూసి భయపడిపోయిన ఆమె తన ఇంటి నుండి బయటకు వచ్చి, అతడిని లోపలే లాక్ చేసింది. ఆ తరువాత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. పోలీసులు ఆమె ఇంటి సమీపంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో ఆ బాస్ తన తప్పు ఒప్పుకున్నాడు. అంతేకాదు ఇంకా షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆఫీసులో కొత్తగా వచ్చిన ఆ యువతిని తాను ఇష్టపడ్డానని.. ఇంతకుముందు కూడా ఆమె ఇంట్లోకి ఆమెకు తెలియకుండానే వెళ్లానని చెప్పాడు. పోలీసుల విచారణలో ఆ మహిళా ఉద్యోగిని ఇంటి పరిసరాల్లో కూడా ఆమె బాస్ సిసిటీవి కెమెరాలు పెట్టాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అతను ఆమె ఇంట్లో ఎలా ప్రవేశించాడు. లాక్ ఎలా ఓపెన్ చేశాడు అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు. ఈ సంఘటన జపాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజెన్లు ఈ బాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒక సోషల్ మీడియా యూజర్ అయితే.. ఇటువంటి వారిని ఎక్కడా ఉద్యోగం ఇవ్వకూడదని.. అతను ఆఫీసుకు తిరిగి వెళితే.. ఆ యువతిని హింసిస్తాడని రాశాడు. మరొకరు.. “ఆమె ఇంటికి ఆ సమయంలో వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో ఒకసారి అతను ఆమెపై అతను దాడి చేసేవాడేమో.. ఇలా జరగడం కూడా మంచిదైంది. ఆ బాస్ అసభ్యకర ప్రవర్తన గురించి ముందుగానే తెలిసిపోయింది. అతను ఒక ప్రమాదకర మనిషి. ఒక సైకో” అని కామెంట్ చేశాడు.
జపాన్‌లో ఇటీవల కాలంలో వర్క్‌ప్లేస్ హరాస్‌మెంట్ ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. జపనీస్ మహిళలు తాము పనిచేస్తున్న ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న వేధింపులను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించారు. ఈ చర్చలు మసాహిరో నకై, ఒకప్పటి ప్రముఖ బాయ్ బ్యాండ్ SMAP సభ్యుడు, లైంగిక వేధింపుల కేసును సెటిల్ చేసిన తర్వాత మొదలయ్యాయి.
నకై ఒక ప్రైవేట్ డిన్నర్‌లో ఒక మహిళపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ డిన్నర్‌ను జపాన్ యొక్క పెద్ద బ్రాడ్‌కాస్టర్ ఫుజి టీవీలోని సీనియర్ సిబ్బంది సభ్యుడు ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన తర్వాత, ఫుజి టీవీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ప్రముఖ పురుష సెలెబ్రిటీలకు సుఖపెట్టేందుకు యజమాన్యం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
Also Read: ప్రేయసితో గొడవ పడ్డ యువకుడు.. కట్ చేస్తే ఫ్రీజర్‌లో శవం.. అసలు కిల్లర్ వేరే
ఈ సంఘటనల నేపథ్యంలో.. జపాన్‌లో #MeToo ఉద్యమానికి సమానమైన “వతాషి గా తైషోకు షిత హోంటౌ నో రియూ” (నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేయడానికి నిజమైన కారణం) అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అయింది. ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా మహిళలు తమ భయంకరమైన వర్క్‌ప్లేస్ అనుభవాలను పంచుకున్నారు.