గతంలో పెళ్లి చూపుల్లో అబ్బాయి గుణగణాలను అమ్మాయి పూర్తిగా తెలుసుకోడానికి వీలుండేది కాదు, ఆస్తిపాస్తుల విషయాలు కూడా ఎవరో చెబితే గుడ్డిగా నమ్మేయాల్సిందే. అయితే ఆధునిక కాలంలో అమ్మాయిలు డేటింగ్, లివ్ ఇ్ రిలేషన్ అంటూ అబ్బాయిల్ని పూర్తిగా స్టడీ చేస్తున్నారు. ఆ తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ల సంగతి సరే, మరి ఇంట్లో తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే అప్పుడు ఆ అమ్మాయికి ఉన్న ఆప్షన్ ఏంటి? పెళ్లి కొడుకు ఎలాంటివాడో తెలుసుకోవడం ఎలా? దానికీ ఓ సొల్యూషన్ ఉంది అి నిరూపించింది పుణెకి చెందిన ఓ యువతి. ఆమె ఐడియాకి అబ్బాయి తల్లిదండ్రులే కాదు, ఆమె తల్లిదండ్రులు కూడా షాకయ్యారు.
సిబిల్ స్కోర్ చెప్పే జాతకం..
అబ్బాయి సంపాదన ఎంత? ఖర్చు ఎంత? లోన్లు ఏవైనా ఉన్నాయా? ఉంటే సమయానికి ఈఎంఐలు చెల్లిస్తున్నాడా? చెక్ బౌన్స్ లు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఒక్క సిబిల్ స్కోర్ తో అంచనా వేయొచ్చు. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే సదరు వ్యక్తి అంత ఆర్థిక క్రమశిక్షణ కలవాడనమాట. ఈరోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ ఉంది అంటే ఫ్యూచర్ పై వారికి సరైన అంచనా ఉన్నట్టే లెక్క. ఆ కిటుకుతోనే పెళ్లి కొడుకు జాతకం మొత్తం రాబట్టింది పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ చెక్ చేసి ఆ తర్వాతే పెళ్లికి ఓకే చెప్పింది. దీంతో ఆ అమ్మాయి చేసిన పనికి పెళ్లి కొడుకు షాకయ్యారు. తనకు కాబోయే శ్రీమతికి ఆ మాత్రం తెలివితేటలు ఉంటే చాలనుకున్నాడో ఏమో, ఎగిరి గంతేసి మరీ పెళ్లికి ఒప్పుకున్నాడు.
ఇదో కొత్త ట్రెండ్..
బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే ముందు చెక్ చేసేది సిబిల్ స్కోర్. కొత్తగా ఇల్లు కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా, పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా.. ఇలాంటివి తప్పనిసరి. బ్యాంకులే సిబిల్ స్కోర్ చూస్తుంటే, ఇక జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకునేవారు ఎందుకు ఆ పని చేయకూడదు. అందుకే సిబిల్ స్కోర్ చూసి ఆ అబ్బాయికి స్కోర్ వేసింది పుణె యువతి. సిబిల్ స్కోర్ 750కంటే ఎక్కువగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకి తెగేసి చెప్పింది. అలాగే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి ముందుగా సిబిల్ స్కోర్ చెక్ చేసింది. తాను అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువగానే ఉండటంతో ఆ అబ్బాయి నచ్చాడని చెప్పింది. అందరూ ఆ యువతి తెలివి తేటల్ని మెచ్చుకుంటున్నారు.
సోషల్ మీడియా చెప్పేస్తుంది
ప్రస్తుతం పెళ్లి చూపులకు వెళ్లే ముందే అబ్బాయి, అమ్మాయి సమాచారాన్ని రెండు కుటుంబాలు పూర్తిగా తెలుసుకుంటున్నాయి. వారి పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయితే చాలు వారు ఎలాంటివారో చెప్పేయొచ్చు. రోజూ ఏదో ఒక పోస్ట్ లు పెడితే యాక్టివ్ అనుకోవచ్చు, అసలు పోస్ట్ లే లేకుండా ఉంటే ముభావంగా ఉండే మనిషి అని తేలిపోతుంది. రీల్స్ చేస్తూ కొత్త కొత్త ప్లేస్ లను ఎస్టాబ్లిష్ చేస్తే.. టూర్ లంటే ఆసక్తి ఉంది అని అంచనా వేయొచ్చు. కొత్త కొత్త డ్రస్సులు వేసుకుని ఫొటోలు అప్ లోడ్ చేస్తే బట్టలపై మక్కువ ఎక్కువ అనే అంచనాకి రావొచ్చు. ఇలా సోషల్ మీడియానే సగం వివరాలు బయటపెడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ విషయానికొచ్చే సరికి సిబిల్ స్కోర్ కచ్చితంగా సరైన అంచనాని మన ముందు పెడుతుంది. అందుకే అమ్మాయిలు ఎవరో చెబితే, అబ్బాయి గుణగణాలపై అంచనాకు రావట్లేదు. నేరుగా అతడి సిబిల్ స్కోర్ చెక్ చేసి ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకుంటున్నారు. ఆ తర్వాతే పెళ్లికి ఓకే చెబుతున్నారు.