Wedding Called Off Groom Dance| ఒక పెళ్లి కార్యక్రమంలో వధూ వరులు కూర్చొని ఉండగా.. వారి స్నేహితులందరూ పాటలకు డాన్స్ వేశారు. ముఖ్యంగా పెళ్లికొడుకు ఫ్రెండ్స్ ఒక హిందీ పాటకు చిందులు వేశారు. ఆ ఆనందోత్సాహంలో వారంతా పెళ్లి కొడుకుని కూడా డాన్స్ చేయాలని బలవంతం చేశారు. వారి ఉత్సాహం చూసి ఆ వరుడు కూడా వారితో కలిసి స్టెప్పులేశాడు. కానీ ఆ డాన్స్ స్టెప్పులే ఆ పెళ్లి కార్యక్రమంలో పెద్ద సమస్యగా మారాయి. ఆ డాన్స్ అసభ్యంగా ఉందని పెళ్లికూతరు తరపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇదే కారణం చూపుతూ పెళ్లి రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో జనవరి 18, 2025న ఒక పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఇరు వర్గాల వారి బంధువులు, స్నేహితుల అందరూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఒకరిని మించి మరొకరు డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ క్రమంలో వరుడి స్నేహితులు కొందరు హుషారుగా బాలీవుడ్ సినిమా ఖల్నాయక్ లో ప్రముఖ ఐటెం సాంగ్ ‘చోలీ పీఛే క్యాహై’ కు స్టెప్పులేశారు. ఈ క్రమంలోనే కొందరు స్నేహితులు పెళ్లికొడుకుని కూడా తమతో పాటు డాన్స్ చేయాలని ఒత్తడి చేశారు. అయితే ముందు అతను నిరాకరించినా వారు వినలేదు. దీంతో వారిని ఎక్కువ సేపు కాదనలేక పెళ్లి కొడుకు సంగీత్ స్టేజీపై ఎక్కాడు. పాట మొదట్నుంచి పెట్టించి మరీ చోలీ పీఛే క్యా హై పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ వేశాడు. అతని డాన్స్ చూసిన వారంతా వరుడు ఇంతబాగా డాన్స్ చేయగలడా? అని ఆశ్చర్య పోయారు. కానీ ఆ పెళ్లిలో ఓ పెద్ద మనిషికి మాత్రం ఇదంతా నచ్చలేదు.
Also Read: టేబుల్ మీద 70 కోట్లు కావలసినంత తీసుకోండి.. కానీ ఓ కండీషన్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన బాస్
పాట మధ్యలోనే లేచి కోపంగా ఇదంతా ఆపేయాలని అభ్యంతరం వ్యక్తం చేశాడు. పరువుగల కుటుంబాలకు చెందిన వారు.. ఇలాంటి అసభ్యకర భంగిమలతో డాన్సులు, చిందులు వేయడమేంటని ప్రశ్నించాడు. ఆయన మరెవరో కాదు. పెళ్లికూతరు తండ్రి. పెళ్లి కొడుకు వేసిన వెకిలి డాన్సులు తమ కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయని చెప్పి ఆయన పెళ్లి రద్దు చేస్తున్నానని ప్రకటించాడు. ఆయన కోపాన్ని శాంతపరిచేందుకు వరుడు ఎంత ప్రయత్నించినా ఆయన మాత్రం తగ్గలేదు. తాను ఏదో స్నేహితులు కోరిక మేరకు డాన్స్ చేశాని వరుడు బతిమాలుకున్నా ఆ పెద్ద మనిషి వినిపించుకోలేదు. చివరికి పెళ్లి కూతరు ఏడుస్తున్నా ఆయన వినకుండా తన కుటుంబాన్ని తీసుకొని వెళ్లిపోయాడు. పైగా తన కూతురితో ఏ విధంగా సంప్రదింపులు చేయకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడట.
ఈ మొత్తం కథనాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో @xavierunclelite అనే యూజర్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. చాలా నెటిజెన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ అయితే.. “ఆయన మంచి నిర్ణయమే తీసుకున్నాడు. లేకుంటే ఆయన జీవితాంతం ఆ డాన్స్ చూడాల్సి వచ్చేదేమో” అని కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్ కామెంట్ చేస్తూ.. “అది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. అది ఒక ఎలిమినేషన్ రౌండ్” అంటూ టివి రియాల్టీ షోని తలపించేవిధంగా రాశాడు.
ఒక మూడో యూజర్ అయితే “చోలీ కే పీఛే పాట ప్లే చేస్తే నేను కూడా నా పెళ్లిలో డాన్స్ చేస్తా ” అని ఫన్నీగా రాసుకొచ్చాడు. పెళ్లిళ్లలో ఈ రోజుల్లో గానా బజానా కార్యక్రమాల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డాన్స్‌లు చేయడం చాలా సాధారణం అయిపోయింది. కానీ డాన్స్ పై అభ్యంతరముంటే ముందే నిశ్చయించుకోవాల్సిందని ఒక యూజర్ కామెంట్ లో ఉచిత సలహా ఇచ్చాడు.
గత డిసెంబర్ లో కూడా ఇలాగే చాలా చిన్న కారణంగా ఒక పెళ్లి కొడుకు భోజనం లేటైందని పెళ్లి రద్దు చేసుకున్నాడు. పెళ్లిలో భోజనం అయిపోతే వధువు తండ్రి మళ్లీ భోజనాలు ఏర్పాటు చేయడానికి సమయం పట్టింది. అయితే అప్పటికే వరుడి స్నేహితులు భోజనం కోసం చాలాసేపు ఎదురుచూసి వరుడిని ఎగతాళి చేశారు. దీంతో పెళ్లికొడుకు కోపంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వెళ్లిపోయాడు. అంతటితో ఆగలేదు అదే రోజు తన మరదలిని వివాహం చేసుకొని పెళ్లికూతురికి మెసేజ్ చేశాడు. దీంతో పెళ్లికూతరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి రద్దు కావడంతో తమకు నష్టం జరిగిందని.. రూ.7 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కేసు పెట్టింది.