Bus Accident Video: రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఓ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు ప్రమాదంలో బస్సు పైకప్పు లేచిపోయినా, డ్రైవర్ ఆపకుండా దూసుకెళ్లాడు. కొద్ది కిలో మీటర్ల తర్వాత, రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. హాలీవుడ్ మూవీని తలపించిన ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కాగా, రోడ్డు మీద ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు రిజిస్ట్రేషన్ ను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఇటీవల శ్రీనగర్ ఉప జిల్లాలోని మున్షిగంజ్ సమష్ పూర్ ప్రాంతంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో బస్సు పైకప్పు లేచిపోయినా డ్రైవర్ ఆపకుండా వేగంగా అలాగే తీసుకెళ్లాడు. ఈ ఘటనపై రవాణాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో బస్సు రిజిస్ట్రేషన్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ రోడ్డు రవాణా అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఎండీ సనాల్ హక్ లైసెన్స్ రద్దు లేఖను విడుదల చేశారు.
రోడ్డు మీద బస్సు బీభత్సం
ఆర్టీఏ అధికారుల లేఖ ప్రకారం.. ఏప్రిల్ 17న బారిసల్ ఎక్స్ ప్రెస్ బస్సు ఢాకా-మావా ఎక్స్ ప్రెస్ వే మీదుగా వేగంగా దూసుకెళ్తూ శ్రీనగర్‌లోని కమర్‌ఖోలా రైల్ ఫ్లై ఓవర్ మీద కారును ఢీకొట్టింది. ఆ కారు ముందున్న కవర్ వ్యాన్ కు తగిలింది. ఈ ఘటనలో బస్సు పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నది. బస్సు వెనుక పోలీసులు, సైనిక వాహనాలు ఉండటతో డ్రైవర్, పైకప్పు లేకపోయినా వేగంతా ముందుకు డ్రైవ్ చేశాడు. చివరికి, సమష్పూర్ దగ్గర రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని బస్సు ఆగింది. ఈ ప్రమాదంలో బస్సు పైకప్పు మొత్తం ఎగిరిపోయి రోడ్డు మీద పడింది. ఈ ఘటనలో మొత్తంగా 8 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. బస్సు ఆగిపోవడంతో డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పారిపోయారు.
బస్సు రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా రద్దు
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రవాణా అధికారులు ఈ ఘటపై చర్యలకు దిగారు. బస్సు యజమానికి ట్రాన్స్ పోర్టు అధికారులు రాసిన లేఖలో, రోడ్డు రవాణా చట్టం 2022లోని రూల్ 46 ప్రకారం, బస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసినట్లు వెల్లడించారు. బస్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ట్యాక్స్ టోకెన్, ఫిట్ నెస్ సర్టిఫికేట్, రూట్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ తో సహా అన్ని సంబంధిత పత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని యజమానికి సూచించారు. హాజరు కాకపోతే రోడ్డు రవాణా చట్టం, 2018లోని సెక్షన్ 24 ప్రకారం బస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: రైలు నడిపే లోకో పైలట్లకు టాయిలెట్స్ ఉండవా? మరెలా?