ChatGpt Solves| టెక్నాలజీ రంగంలో కృతిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ) అద్భుత ఫలితాలనిస్తోంది. పెద్ద పెద్ద సమస్యలను సునాయాసంగా పరిష్కారాలు చూపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా స్పందిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అలాంటి ఒక ఘటన గురించి ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్‌లో ఒక యూజర్ ఈ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఆ యూజర్ తనకు 10 సంవత్సరాల నుండి వేధిస్తున్న ఆరోగ్య సమస్యకు చాట్‌జీపీటీ ద్వారా సమాధానం దొరికిందని చెప్పాడు. ఈ సమస్యను ఎందరో వైద్యులు, నిపుణులు, న్యూరాలజిస్ట్‌లు కూడా కనుగొనలేకపోయారని తెలిపాడు.
రెడ్డిట్ లో ‘@Adventurous-Gold6935’ అనే యూజర్.. “చాట్‌జీపీటీ 10+ సంవత్సరాల సమస్యను నిమిషాల్లోనే పరిష్కరించింది, వైద్యులు దీన్ని కనుగొనలేకపోయారు” అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. గత 10 సంవత్సరాలుగా తనకు వివరించలేని అనేక లక్షణాలు ఉన్నాయని, అనేక వైద్య పరీక్షలు చేయించినప్పటికీ ఎటువంటి ఫలితం రాలేదని వారు తెలిపాడు. “నేను స్పైనల్ MRI, CT స్కాన్, రక్త పరీక్షలు, లైమ్ వ్యాధి కోసం కూడా పరీక్షలు చేయించాను,” అని ఆయన రాశాడు.
దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా, న్యూరాలజిస్ట్‌తో సహా అనేక నిపుణులను సంప్రదించినా, నా సమస్యకు సరైన నిర్ధారణ జరగలేదు. “నేను ఫంక్షనల్ హెల్త్ పరీక్ష చేయించాను, అప్పుడు నాకు హోమోజైగస్ A1298C MTHFR మ్యూటేషన్ ఉన్నట్లు తెలిసింది. ఈ సమస్య 7–12 శాతం మందిలో మాత్రమే ఉంటుంది,” అని ఆయన వివరాలు వెల్లడించాడు.
ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ
తన ఆరోగ్య లక్షణాలు.. ల్యాబ్ రిపోర్టులను చాట్‌జీపీటీలో ఎంటర్ చేసినప్పుడు ఈ మ్యూటేషన్ గురించి తెలిసింది. “నా ల్యాబ్ ఫలితాలు, లక్షణాలను చాట్‌జీపీటీ విశ్లేషించి, ఈ సమస్య MTHFR మ్యూటేషన్‌తో సంబంధం ఉందని చెప్పింది. నా శరీరంలో B12 లెవెల్స్ సాధారణంగా కనిపించినా, ఈ మ్యూటేషన్ వల్ల శరీరం B12ని సరిగ్గా ఉపయోగించలేకపోతోంది. అందుకే సప్లిమెంట్లు తీసుకోవాలి,” అని చాట్‌జీపీటీ సూచించింది.
ఈ సమాచారాన్ని ఆయన తన వైద్యుడికి చూపించారు. “వైద్యుడు ఆశ్చర్యపోయి, తన సమస్యకు ఏఐ చేసిన విశ్లేషణ సరైనదేనని అన్నాడు. MTHFR మ్యూటేషన్ కోసం పరీక్ష చేయడం ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు,” అని యూజర్ రాశాడు. కొన్ని నెలల తర్వాత, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. “ఇదంతా ఎలా జరిగిందో నమ్మశక్యం కావడం లేదు, అదే సమయంలో ఉత్సాహంగా ఉంది,” అని ఆయన పోస్ట్‌లో తెలిపాడు.
Also Read: ఇండియాలో గూగుల్ వియో 3 లాంచ్.. అద్భుతమైన ఏఐ వీడియోలు క్రియేట్ చేయడం మరింత ఈజీ
సోషల్ మీడియా రియాక్షన్
ఈ పోస్ట్‌కు 6,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. రెడ్డిట్‌లో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. “ఇది అద్భుతమైనది, అదే సమయంలో నిరాశపరిచింది,” అని ఒక వ్యాఖ్యాత చెప్పారు. “AI మళ్లీ మనుషులు చేయలేనిది చేసింది,” అని మరొకరు అన్నారు. “వైద్య రంగం సాంకేతికతతో వేగంగా అడుగులు వేయాలి,” అని ఒకరు వ్యాఖ్యానించారు. “జన్యు పరీక్షల గురించి ఎవరూ ఆలోచించకపోవడం ఆశ్చర్యం,” అని మరొకరు రాశారు. “చాట్‌జీపీటీ నీ సంవత్సరాల కష్టాన్ని తగ్గించింది,” అని ఒకరు, “చాట్‌జీపీటీకి కన్సల్టేషన్ ఫీజు బిల్ చేయాలి,” అని మరొకరు సరదాగా అన్నారు.