ఆఫ్రికాలో ఎన్నో ఖనిజ నిల్వలు, అరుదైన ప్రకృతి సంపదలు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడమే వారికి చేతకాలేదు. కానీ చైనా అలా కాదు. ఎక్కడైనా తమకు ఉపయోగపడే ఉత్పత్తులు ఉంటే వాటిని చాకచక్యంగా తమ దేశానికి తీసుకెళ్లి వినియోగించుకుంటోంది. అలాగే ఇప్పుడు ఆఫ్రికా నుంచి మట్టిని తమ దేశానికి తీసుకెళ్తోంది. ఆఫ్రికాలో ఈ ఎర్ర మట్టి చాలా ఎక్కువ ఉంది. చైనా దానిని తీసుకొని అల్యూమినియంగా మారుస్తోంది. తిరిగి ప్రపంచానికి అమ్ముతోంది. ఈ అల్యూమినియం కార్లు, విమానాలు, ఫోన్ల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు.
ఎర్ర మట్టి అంటే ఏమిటి?
ఎర్ర మట్టిని బాక్సైట్ అని కూడా పిలుస్తారు. ఇది భూమి కింద కనిపించే ఎర్రటి రాతి దూళి. ఇది ఎంతో ముఖ్యమైనది కూడా. ఈ బాక్సైట్ ని అల్యూమినియంగా మార్చుకోవచ్చు. అల్యూమినియాన్ని సైకిళ్ళు, సోడా డబ్బాలు, అంతరిక్షనౌకలు ఇలా ఎన్నో చోట్ల వినియోగిస్తూనే ఉంటారు. ఆఫ్రికా దేశాలలో అతిపెద్ద బాక్సైటు నిల్వలు ఉన్నాయి. కానీ ఆఫ్రికా దేశాలన్నీ పేదరికంలోనే ఉంటాయి. ఆ నిధిని వినియోగించడం కోవడం ఆ దేశాలకు తెలియడం లేదు.
బాక్సైట్ తో అల్యూమినియం తయారవుతుంది. కాబట్టి చైనా ఆఫ్రికా దేశాలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచానికి కావలసిన అల్యూమినియం ఉత్పత్తి చేయడానికి ఆఫ్రికా నుంచి ఎర్రమట్టిని కొని తెచ్చుకుంటుంది. దాన్ని మెరిసే లోహంగా మార్చి ఫోన్లు, కార్లు వంటి వస్తువులను తయారు చేయడానికి అమ్ముతుంది. దీనివల్ల చైనాకు ఎంతో సంపద వస్తోంది.
ఆఫ్రికాలో కార్మికులు కూడా అధికంగా ఉంటారు. తక్కువ డబ్బులు ఇచ్చి వారి చేత భూమి నుండి బాక్సైట్ ను తగ్గిస్తున్నారు. ఆ ఎర్ర మట్టిని పెద్ద ఓడలపై వేసి చైనాకు పంపిస్తారు. చైనాలో ఈ ఎర్రమట్టిని అల్యూమినియం గా మార్చేందుకు ఎన్నో రకాల కర్మాగారాలు ఉన్నాయి. అలా అల్యూమినియంగా మార్చాక చైనా తిరిగి దాన్ని ప్రపంచ దేశాలకు అమ్ముతుంది.
ఆఫ్రికా దేశాలు అల్యూమినియం తయారుచేయవా?
ఆఫ్రికాలో ఇంత బాక్సైట్ లభిస్తున్నప్పుడు వారే దాన్ని అల్యూమినియంగా మార్చి ప్రపంచానికి అమ్మొచ్చు కదా.. అనే సందేహం ఎంతో మందికి వస్తుంది. కానీ ఆఫ్రికా ఎంతో వెనుకబడిన ఖండం. అల్యూమినియం తయారీకి కావలసిన ప్రత్యేక కర్మాగారాలు అక్కడ లేవు. రోడ్లు, ఓడరేవులు కూడా సరిగా ఉండవు. అక్కడ ఫ్యాక్టరీలు నిర్మించుకోవడం కంటే ఇసుకను తరలించడమే సులభంగా భావిస్తారు. ఇసుకను అందించే ఆఫ్రికా దేశాలకు పెద్దగా డబ్బు రాదు. తవ్వే కార్మికులకు కూడా లాభం ఉండదు. కానీ దాన్ని అల్యూమినియంగా మార్చి ఆ అల్యూమినియాన్ని వస్తువుల రూపంలో అమ్ముతున్న దేశాలకు మాత్రం విపరీతమైన లాభం వస్తుంది.
చాలామంది పేద ఆఫ్రికా దేశాల నుంచి చైనా ఇలా మట్టి తీసుకెళ్లడం అన్యాయం అని వాదిస్తూ ఉంటారు. నిజానికి దీన్ని ఒక వ్యాపారంగానే చూడాలి. ఆఫ్రికా దేశాలు తమ ఎర్ర ఇసుకను అమ్ముకుంటున్నాయి, చైనా కొనుక్కుని అల్యూమినియం తయారు చేసి తిరిగి అమ్ముతోంది. ఇందులో అన్యాయం ఏముందని వ్యాపారవేత్తలు ప్రశ్నిస్తారు. నిజమే… ఎర్ర మట్టి తీసుకొని అమ్ముకునే కన్నా దాని అల్యూమినియంగా మార్చే పద్ధతులను, ఫ్యాక్టరీలను ఆఫ్రికా దేశాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఇప్పటికీ ఆఫ్రికా దేశాలు ఎర్రమట్టిని అమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాయి.