Restaurant: దేనికైనా హద్దంటూ ఉంటుంది. అది శృతి మించితే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అలాంటి ఘటన జరిగింది. ఓ రెస్టారెంటులో పుత్ర రత్నాలు చేసిన పనికి ఆ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పేరెంట్స్‌కు భారీగా జరిమానా విధించింది న్యాయస్థానం. అసలు మేటరేంటి? అన్నవిషయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్తే..
చైనాలోని షాంఘై సిటీలో హైదిలావ్ హాట్‌పాట్ రెస్టారెంట్ ఉంది. సిటీలో బాగా ఫేమస్సయిన రెస్టారెంట్. వీకెండ్ వచ్చిందంటే ఆ రెస్టారెంట్‌కి వెళ్లేందుకు మధ్య తరగతి సైతం తహతహలాడుతారు. అయితే ఫిబ్రవరి 24న ఓ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు మైనర్లు బాలురులు ఆ రెస్టారెంట్‌కి వెళ్లారు. వారిలో 17 ఏళ్ల వూ ఒకడు, మరొకడు టాంగ్.
భోజనం చేస్తున్న డైనింగ్ టేబుల్‌పైకి ఎక్కి అందరూ కలిసి తినే సూప్‌లో మూత్ర విసర్జన చేశారు. ఆ ఘటన హాట్ హాట్‌గా మారిపోయింది. ఫలితంగా ఆ టీనేజర్లు చేసిన పనికి రెస్టారెంట్ యాజమాన్యం బాగానే నష్టపోయింది. ఆ ఘటన తర్వాత రెస్టారెంటుకి వెళ్లే కస్టమర్ల సంఖ్య అమాంతంగా తగ్గిపోయింది. దీనిపై కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.
ఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8 వరకు సుమారు 4 వేల మందికి పైగా కస్టమర్లకు డబ్బు వాపసు ఇచ్చింది. బిల్లుకు పది రెట్ల నగదు పరిహారంగా ఇచ్చింది. రెస్టారెంట్‌లో వంట చేసే పాత్రలను ధ్వంసం చేసి కొత్తవి కొనుగోలు చేసింది. రెస్టారెంట్ పూర్తిగా శుభ్రం చేసింది.
ALSO READ: పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ చోరీ, పర్సులో దాచిన అతిథి
ఈ వ్యవహారంపై రెస్టారెంట్ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు టీనేజర్ల చర్యలను తప్పుబట్టింది. వారి ప్రవర్తన కారణంగా రెస్టారెంట్ హక్కు, ప్రతిష్ఠను దెబ్బ తీసినట్టు భావించింది. పిల్లలు ఆ విధంగా తయారు కావడానికి తల్లిదండ్రులు కారణమని భావించింది. కంపెనీకి జరిగిన నష్టానికి అన్నిరకాల ఫీజులు కలిపి 2.2 మిలియన్ యువాన్లు చెల్లించాలని ఆదేశించింది.
భారత్ కరెన్సీలో సుమారు రూ. 2.71 కోట్లన్నమాట. అంతేకాదు పత్రికల్లో రెస్టారెంట్‌కి బహిరంగ క్షమాపణ చెప్పాలని తీర్పులో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా 1,000కి పైగా బ్రాంచ్ లు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్‌కు, ఫ్యామిలీకి మంచి వాతావరణానికి ప్రసిద్ధి చెందింది ఆ రెస్టారెంట్. పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
1994లో సిచువాన్ ప్రాంతంలో ప్రారంభమైంది హైడిలావ్ రెస్టారెంట్. చైనా వ్యాప్తంగా 1,360 అవుట్‌లెట్‌లతో కొనసాగుతోంది. అమెరికా, యూకె, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా 1,400 కంటే ఎక్కువ అవుట్ లెట్స్ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనీస్ రెస్టారెంట్ బ్రాండ్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది కూడా.