ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అలాంటి వింతే తాజాగా చైనాలో జరిగింది. సాధారణంగా ఓ మహిళ తన బిడ్డకు జన్మనివ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయ్యాక, 9 నెలలకు డెలివరీ అవుతుంది. కానీ, ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన నాలుగు గంటలకే బిడ్డకు జన్మనిస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, పొరుగు దేశం చైనాలో ఈ ఘటన జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందటే?
చైనాలోని హాంగ్ జౌలో ఓ 36 ఏండ్ల మహిళ.. తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న 4 గంటల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పిల్లలే పుట్టరని వైద్యులు చెప్పడం, అయినప్పటికీ తను గర్భవతి కావడం, వైద్యులు కన్ఫార్మ్ చేయడం, బిడ్డకు జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. అసలు ఏం జరిగిందంటే.. సదరు 36 ఏండ్ల మహిళ చాలా కాలంగా అధిక బరువుతో బాధపడుతున్నది. చిరుతిండి బాగా తినే అలవాటు ఉన్న ఆమె బరువు బాగా పెరిగింది. ఈ కారణంగానే ఆమెకు పిల్లలు పుట్టరని వైద్యులు తెలిపారు. కనీసం IVF పద్దతి ద్వారా అయిన తమకు పిల్లలు కలిగేలా చూడాలని ఈ దంపతులు డాక్టర్లను కోరారు. ముందుగా బరువు తగ్గితేనే IVF ప్రక్రియ సాధ్యం అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఆమె బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది సదరు మహిళ.
బీపీ చికిత్స కోసం వెళ్లి బిడ్డకు జననం
కొద్ది రోజుల క్రితం సదరు మహిళ చేతులకు తిమ్మిరి రావడం మొదలయ్యింది. వెంటనే ఆమె ఓ చిన్న క్లినిక్ లో పరీక్షలు చేయించుకుంది. బీపీ ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. వెంటనే పెద్ద హాస్పిటల్ లో చూపించుకోవాలని ఆమెకు సదరు క్లినిక్ నిర్వాహకులు చెప్పారు. తాజాగా ఆమె బీపీ చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లింది. డాక్టర్ కు తన ఆరోగ్య సమస్యల గురించి చెప్తూ, చాలా నెలలుగా నెలసరి రావడం లేదని వివరించింది. వెంటనే వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించారు. రిపోర్టులను చూసి ఆమెకు షాకింగ్ విషయాన్ని చెప్పారు. పిల్లలే పుట్టరని చెప్పిన డాక్టర్లు ఆమెకు 8 నెలల గర్భం అని తేల్చారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
Read Also: తొక్కిసలాటలు ఎలా జరుగుతాయి? ఆ టైమ్‌లో మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?
నాలుగు గంటల్లో బిడ్డకు జననం
డాక్టర్లు చెప్పిన మాట విని సదరు మహిళ సంతోషం పట్టలేకపోయింది. అయితే, ఆమె గర్భ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సిజేరియన్ చేయకపోతే, బిడ్డతో పాటు తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కొద్ది సేపట్లోనే ఆమెకు ఆపరేషన్ చేశారు. 2 కిలోల బరువున్నన మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. “నేను గర్భవతి అని తెలిసి నాలుగు గంటల్లోనే బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉంది” అని సదరు మహిళ వెల్లడించింది.
Read Also:పంచదార శాకాహారమా? మాంసాహారమా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!