Customers Cons Rapido Driver| ఈ రోజుల్లో రాకపోకల కోసం అందరూ ఊబర్, ఓలా లేదా ర్యాపిడో లాంటి ఆన్ లైన్ ట్యాక్సీలు బుక్ చేస్తుంటారు. అందుకోసం ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక ర్యాపిడో డ్రైవర్ డబ్బులు ఒక కస్టమర్ దోచుకున్నాడని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్న ఒక యూజర్ తన రెడ్డిట్ ఖాతాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, మోసాన్ని తెలియజేశాడు. ఒక కస్టమర్ తన వద్ద నుంచి మోసపూరితంగా రూ.4000 తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. చండీగడ్ నగరానికి చెందిన ఈ ర్యాపిడో డ్రైవర్ తన నాలుగు రోజుల సంపాదనను ఓ కస్టమర్ తెలివిగా దోచుకున్నాడని రాశాడు.
ఎలా జరిగిందంటే?
నాలుగు రోజుల క్రితం ఈ ర్యాపిడో డ్రైవర్ కు ఒక కస్టమర్ ఒక రైడ్ బుక్ చేసుకున్నాడు. అతడి రైడ్ కోసం ఆన్ లైన్ లో రూ.200 పేమెంట్ చూపించింది. అయితే కస్టమర్ ని పికప్ చేసుకునేందుకు ర్యాపిడో డ్రైవర్ వెళ్లినప్పుడు.. ఆ కస్టమర్ తనకు ఒక కట్టుకథ చెప్పాడని రాశాడు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని.. వెంటనే ఆస్పత్రిలో పేమెంట్ చేసేది ఉందని చెప్పాడు. అందుకోసం తనకు రూ.4000 అవసరమని తెలిపాడు. అయితే ఆ ఆస్పత్రి చాలా దూర ప్రాంతంలో ఉందని.. తాను కూడా అక్కడికి వెళ్లేందుకే రైల్వే స్టేషన్ వెళుతున్నానని.. రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లేందుకే రైడ్ బుక్ చేశానని అన్నాడు. ఇదంతా మార్గమధ్యలో ర్యాపిడో డ్రైవర్ కు వివరించాడు. కానీ రైల్వే స్టేషన్ చేరుకున్నాక.. రూ.200 పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు.. ఆ కస్టమర్ మరో ఎత్తు వేశాడు. తన యుపిఐ పేమెంట్ ద్వారా కేవలం ఒకే లావాదేవీ చేయగలమని, లిమిట్ అయిపోయిందని చెప్పాడు. కానీ తన డబ్బులు మాత్రం మొత్తం బ్యాంకు అకౌంట్ లోనే ఉన్నాయని చెప్పాడు.
ఇప్పుడు ర్యాపిడో పేమెంట్ చేస్తే.. తన భార్యకు డబ్బులు పంపలేనని.. తన సమస్యకు సాయం చేయమని ఆ ర్యాపిడో డ్రైవర్ ను అడిగాడు. తన అకౌంట్ లోని మొత్తం రూ.4000 యుపిఐ ద్వారా పంపిస్తానని.. రైడ్ పేమెంట్ రూ.200 మినహా మిగతా రూ.3800 తన వాట్సాప్ లోని క్యు ఆర్ కోడ్ కు పంపాలని చెప్పాడు. కస్టమర్ సమస్య చూసి ఆ ర్యాపిడో డ్రైవర్ సరే నని ఒప్పుకున్నాడు. అందుకోసం తన ఫోన్ లో చూడగా.. అందులో రూ.4009 లు వచ్చినట్లు చూపించాయని అన్నాడు. ఆ తరువాత తాను కూడా కస్టమర్ చూపించిన క్యుఆర్ కోడ్ కు రూ.3800 పంపించేశాడు. ఆ తరువాత ఆ కస్టమర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ తరువాత ఒక షాకింగ్ విషయం జరిగింది. తన ఫోన్ లో చూపించిన రూ.4009 అతను పంపించిన డబ్బులు కాదని తెలిసింది. ఇది చూసి షాకైన ఆ ర్యాపిడో డ్రైవర్ తాను తన నాలుగు రోజుల సంపాదన మొత్తం ఒక్క నిమిషంలో పోయిందని బాధపడుతూ పోస్ట్ చేశాడు.
Also Read: 1990లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన తండ్రి.. కొడుకుకు వారసత్వంగా కోట్ల ఆస్తి
ఈ పోస్ట్ చదివిని నెటిజెన్లు సోషల్ మీడియాలో డిబేట్ చేస్తున్నారు. ఇది చదివిన ఒక యూజర్.. “ఇలాంటి మోసం నా స్నేహితుడైన రాపిడో డ్రైవర్‌కు కూడా జరిగింది. అదే ఆసుపత్రి కథతో మోసం చేశారు. అతను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు, నంబర్ రాజస్థాన్ నుండి వచ్చినట్లు తెలిసింది, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు” అని రాశాడు. మరొకరు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తూ.. ఎలా చేయాలో కూడా వివరించాడు.
నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగల సైబర్ నేరాలు
ఈ పోర్టల్‌లో మహిళలు, పిల్లలకు సంబంధించిన నేరాలను నమోదు చేయవచ్చు. ఫిర్యాదుదారు తన పేరును వెల్లడించి లేదా అనామకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇతర సైబర్ నేరాలైన మొబైల్ నేరాలు, సోషల్ మీడియా నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, రాన్సమ్‌వేర్, హ్యాకింగ్, క్రిప్టోకరెన్సీ నేరాలు, ఆన్‌లైన్ సైబర్ ట్రాఫికింగ్ వంటివి కూడా నమోదు చేయవచ్చు.