IPS lover real story: ప్రేమ అంటే ఒక్కోసారి ఓదార్పు, మరోసారి తపస్సు కూడా అవుతుంది. ప్రేమికురాలి కలను దేవుడి పాదాల వద్ద ఉంచి, తన ప్రేమను ఆ పరమాత్ముని చేతుల్లో పెట్టిన ఓ యువకుడి కథ ఇది. ఇది చదివి ఇదేదో సినిమా స్టోరీ అనుకోవద్దు. ఓ యువకుడు నిజ జీవితంలో తన ప్రేయసి కోసం చేస్తున్న అలుపెరగని భక్తి పోరాటం ఇది. ఇంతకు ఇతను ఎవరు? ఇతడేం చేస్తున్నాడో తెలుసుకుంటే ఔరా అనేస్తారు.
ఢిల్లీకి చెందిన రాహుల్ అనే యువకుడు తన ప్రేయసి ఐపీఎస్ అధికారిణి కావాలని కోరుకుంటున్నాడు. ఆమె కల నెరవేరాలని, తన ప్రేమతో అది సాధించాలని ప్రతిజ్ఞ పూనాడు. ఆ భగవంతుడే ఆశీర్వదించాలని భావించి, హరిద్వార్‌లో గంగా నదినుండి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోస్తూ ముజఫర్‌నగర్ జిల్లా దాకా పాదయాత్ర చేస్తున్నాడు. ఇది కేవలం ఓ భక్తుని ప్రయాణం కాదు, ఓ ప్రేమికుడి తపస్సు కూడా.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రౌత్ – ముజఫర్‌నగర్ రూట్ అంతా రాహుల్ పేరు చెబుతోంది. ఎందుకంటే ఇతను మిగతా భక్తుల్లా కేవలం శివుడికి గంగాజలాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో కాదు, తన ప్రేయసి కోసం దేవుడిని ప్రార్థిస్తూ ఈ కావడి మోస్తున్నాడు. ఆమె ఐపీఎస్ కావాలని, ఈ ఇంటర్ పూర్తి చేసిన ప్రేమికుడు ఈ యాత్ర సాగిస్తున్నాడు. తన స్థాయికి అందని కల అయినా, ఆమె కల నెరవేరాలనే ఆశతో ఈ కఠినమైన ప్రయాణాన్ని చేస్తూ మానసికంగా ఎంతో ధైర్యంగా నిలబడుతున్నాడు.
రాహుల్ తన భుజాలపై 121 లీటర్ల గంగాజలంతో కూడిన కావడి మోస్తూ వెళ్లే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమంటే మాటల కాదురా బాబు.. ఇది తపస్సు అంటుంటారు చాలామంది. ఆ మాట నిజమేనని రుజువు చేస్తున్నాడు ఈ యువకుడు. దేవుడి పట్ల ఉన్న భక్తితో పాటు, ప్రేమ పట్ల ఉన్న నిబద్ధత అందరినీ నివ్వెర పరుస్తోంది.
ఇతడు చెబుతున్న ప్రకారం, తన ప్రేయసి ఒక లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఆమె లక్ష్యం IPS కావడం. అది సాధించేంతవరకూ తాను ప్రతీ ఏడూ గంగాజలాన్ని శివుడికి సమర్పిస్తానని ప్రమాణం చేశాడు. ఇలా చేయడం ద్వారా తన ప్రేమను పవిత్రంగా ఉంచుకుంటానని చెప్పాడు. ఇది విన్నవారికి ఒక ఆధ్యాత్మిక ప్రేమకథలా అనిపిస్తుంది. నిజంగా ఇది ప్రేమ పట్ల ఉన్న విలువలకి అద్దం పడుతోందని నెటిజన్స్ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు.
ఈ తపస్సు ఎక్కడో ఆగిపోదు. రాహుల్ మాటల ప్రకారం, ఆమె ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని సంకల్పం చేశాడు. అప్పటి వరకు తాను గంగా జలాన్ని శివునికి సమర్పిస్తూ దేవుడిని తానే తాను ఒప్పించుకుంటానంటున్నాడు. ఇది వినడానికే కొత్తగా అనిపించవచ్చు కానీ, ఒకటే కోరిక కోసం దేవుడిని ప్రార్థిస్తూ, కాళ్లకు మోకాళ్ళు నల్లబారేలా నడవడమే నిజమైన ప్రేమకు అర్థం చెప్పే ప్రయత్నం.
ఈ కథలో ప్రేమికురాలిని ఏవో బహుమతులు ఇవ్వడం, ఖరీదైన గిఫ్టులు పంపించడం లేదు. కానీ ఆమె కలను నెరవేర్చేందుకు తాను చేయగలిగినది చేస్తూ, తాను ఉన్న స్థాయిలో దేవుడిని ఆశ్రయిస్తూ, తన హృదయాన్ని గంగాజలంతో కలిపి మోస్తున్నాడు. ఈ ప్రయాణం ఓ ప్రేమ కథగా మాత్రమే కాదు, సమాజంలో ప్రేమ ఎలా ఉండాలన్న దానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
ఈ ఘటనను చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇలాంటిదే ప్రేమ అయితే, తప్పకుండా దేవుడే దీవిస్తాడు, ఆమెకు ఇలాంటి అబ్బాయి లభించడం గొప్ప అదృష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఇది సెంటిమెంట్ అని కొందరు విమర్శించినా.. రాహుల్ నడక మాత్రం ఆపడం లేదు. ఎందుకంటే అతనికి తన ప్రేమ పట్ల, శివుని పట్ల ఉన్న భక్తి అసలైన మార్గదర్శి.
ఇది కేవలం ఓ యువకుడి ప్రేమ కథ కాదు. ఇది ప్రేమ, భక్తి, తపస్సు, ఆశయంతో కూడిన ఓ ఆధ్యాత్మిక ప్రయాణం. ఓసారి దేవుడిని ఆశ్రయించి, ప్రేయసి కలను నెరవేర్చేందుకు జీవితమే పెట్టిన తపస్సు. ఇటువంటి కథలు యువతకు ప్రేమంటే నిజంగా ఏంటో గుర్తు చేస్తున్నాయన్నది ప్రేమికుల మాట.