Python Video: కొండచిలువలు మనుషులను మింగడం మనం సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఎక్కడో ఓ చోట మాత్రం మనుషులను కొండచిలువ మింగిందనే వార్తలు వింటుంటాం. అది కూడా వేరే దేశాల్లో ఇలా ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఇండోనేషియా దేశంలో చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన 63 ఏళ్ల రైతు సాయంకాలం అయినా ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోనేసియాలోని సులవేసీ దీవిలోని మజాపహిత్ గ్రామంలో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రైతు తన పొలంలో పని చేస్తుండగా ఘటన జరిగినట్టు తెలుస్తోంది. రైతు కోసం గాలిస్తుండగా.. గ్రామస్తులు పొలంలో ఒక భారీ కొండచిలువను గమనించారు. 26 అడుగుల పొడవైన భారీ కొండచిలువ కదలలేని స్థితిలో ఉన్నట్టు వారు గుర్తించారు. దాని కడుపు ఉబ్బి, ముందుకు వెళ్లలేని స్థితిలో ఉంది. అనుమానం వచ్చిన స్థానికులు కొండచిలువను చంపేసి.. దాని కడుపును చీల్చగా.. లోపల రైతు మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు.
ALSO READ: HYDRA: అది 25వేల మంది సమస్య.. హైడ్రా ఎలా చెక్ పెట్టిందో చూడండి..
రైతు బైక్ పొలం సమీపంలో పార్క్ చేసి ఉండటం, అతని వస్తువులు దగ్గరలోనే కనిపించడం వంటి ఆధారాలతో అతను కొండచిలువ దాడికి గురైనట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో 20 అడుగులకు మించిన కొండచిలువలు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే, మనుషులపై కొండచిలువ దాడి చేయడం లాంటి సంఘటనలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయి. 2017లో సులవేసీలోని సలుబిరో గ్రామంలో 25 ఏళ్ల యువకుడిని 23 అడుగుల కొండచిలువ మింగింది. గతేడాది కూడా ఒక మహిళను 16 అడుగుల కొండచిలువ మింగింది. కొండ చిలువను చంపి మనుషుల మృతదేహాలను బయటకు తీశారు.
ఇండోనేషియాలో స్థానిక అధికారులు కొండచిలువల సంఖ్యను లెక్కించేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా జరిగిన ఈ ఘటన గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. పొలాల్లో ఒంటరిగా వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అడవులు, పొలాల వద్దకు పని కోసం వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.