ప్రపంచ వ్యాప్తంగా వేలాది భాషలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడుతారు. కొన్ని భాషలకు లిపి ఉంటే, మరికొన్ని భాషలకు లిపి ఉండదు. కొన్ని భాషలు కాల గర్భంలో కలిసిపోతుంటే, మరికొన్ని భాషలను కాపాడుకుంటున్నారు ప్రజలు. ఇప్పటి వరకు సాధారణం, ఓ ప్రాంతం లేదంటే ఓ సమూహం ప్రజలకు ఓ భాష ఉండటం గమనించాం. కానీ, ఒకే గ్రామంలో స్త్రీ, పురుషులు వేర్వేరు భాషలను మాట్లాడుకోవడం చూశారా? ఒకే ఊరిలో రెండు భాషలా? అదీ.. స్త్రీ, పురుషులు వేర్వేరుగానా? వినడానికి ఆశ్చర్యంగా ఉందా? కానీ, ఇది నిజం.
నైజీరియాలో స్త్రీ, పురుషులు వేర్వేరు భాషలు మాట్లాడే గ్రామం
ఆగ్నేయ నైజీరియాలోని క్రాస్ రివర్ స్టేట్ లో పచ్చని కొండల మధ్య దాగి ఉన్న గ్రామం ఉబాంగ్. ఇక్కడ అసాధారణమైన భాష వినియోగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు వేర్వేరు పదజాలాలను మాట్లాడుకుంటూ పెరుగుతారు. యుక్తవయస్సు వచ్చేసరికి ప్రతి పురుషుడు, స్త్రీ పూర్తిగా వేర్వేరు భాషలు మాట్లాడుతారు. రోజు వారీ వస్తువులను మొదలుకొని, అన్ని విషయాలకు వేర్వేరు పదాలను వాడుతారు. ఒకే పదాలను అత్యంత అరుదుగా ఉపయోగిస్తారు. ఉదాహారణకు స్త్రీ దుస్తులను ‘కాకెట్’ అని పిలిస్తే, పురుషుడికి ‘న్కి’ అని పిలుస్తాడు.
5 ఏళ్ల నుంచి పిల్లల మధ్య భాష విభజన
ఉబాంగ్ లో చిన్నటి నుంచే పిల్లల మధ్య భాష విభజన అనేది ఏర్పడుతుంది. పిల్లలు మొదట కొన్ని సంవత్సరాలు తమ తల్లులతో గడుపుతారు. అప్పుడు లింగంతో సంబంధం లేకుండా స్త్రీ పద సమితిని నేర్చుకుంటారు. ఐదు ఏళ్ల వయసులో అబ్బాయిలు పురుషుల భాష వైపు మొగ్గు చూపుతారు. తాతలు, తండ్రులు, మామలు, అన్నయ్యలు అబ్బాయిలకు మగ పదజాలాన్ని నేర్పిస్తారు. ఒకవేళ పిల్లలు ఏదైన స్త్రీలు మాట్లాడే పదాలను ఉపయోగిస్తే వాటిని సరి చేస్తారు. కొద్ది నెలల్లోనే అబ్బాయిలు పూర్తిగా మగ భాషలో మాట్లాడుతారు. అదే సమయంలో అమ్మాయిలు అప్పటికే తమ తల్లుల దగ్గర నేర్చుకున్న ఆడ పదజాలాన్ని ఉపయోగిస్తారు. యుక్తవయస్సు నాటికి, యువతీ, యువకులు పూర్తిగా వేర్వేరు భాషలు మాట్లాడుతారు. ఒకే ఇంట్లో రెండు భాషలు తయారవుతాయి.
భాష విభజన ఎందుకు?
ఒకే వస్తువు, రెండు భాషలుగా విడిపోతాయి. స్త్రీలు చెట్టును ‘ఒంగిమ్’ అంటే, పురుషులు ‘ఓకిన్’ అంటారు. మహిళలు బావిని ‘లిలి’ అంటే, పురుషులు ‘బాలా’ అంటారు. ఇక్కడి ప్రజలు దేవుడు తమకు మూడు భాషలను ఇచ్చాడని నమ్ముతారు. వాటిలో ఒకటి పురుషులకు, మరొకటి స్త్రీలకు, అందరికీ కలిపి ఓ భాష ఇచ్చినట్లు భావిస్తారు. స్త్రీ, పురుషుల మధ్య గొడవలు రాకుండా, యుద్ధ సమయంలో శత్రు సమూహాలకు అర్థం కాకుండా ఈ రకమైన భాషా విభజన ఉపయోగపడిందని ఇక్కడి ప్రజలు భావిస్తారు.
రెండు పదజాలాలతో మరింత ఉల్లాసం
ఉబాంగ్ ప్రజల మధ్య రెండు పదజాలు మరింత ఉల్లాసాన్ని కలిగిస్తాయి. భర్తలు తమ భార్యలను చిన్నపిల్లల పదాలు ఉపయోగిస్తున్నందుకు ఆటపట్టిస్తారు. భార్యలు పురుషుల మాటలు చాలా కఠినంగా ఉంటాయని ఎదురుదాడి చేస్తారు. సాయంత్రం పూట అందరూ ఒకచోటుకు చేరి ఉల్లాసకరమైన చర్చల్లో పాల్గొంటారు. ఇక్కడి ప్రజలు రెండు పదజాలాలను ఉపయోగిస్తున్నప్పటికీ, అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషలు అందరించిపోతున్నప్పటికీ, ఉబాంగ్ భాషలు మాత్రం రోజు రోజు మరింత బలోపేతం అవుతోంది.
Read Also: ఊళ్లోకి వచ్చిన సింహాన్ని పట్టుకొని కట్టేసిన గ్రామస్తులు, నెట్టింట వీడియో వైరల్!