భారతదేశం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే అంవుతుంది. కష్టాల్లో ఉంటూ ఆపన్నహస్తం కోసం చేతి చాచితే, కచ్చితంగా సాయం అందిస్తుంది. చివరకు మన శత్రుదేశం అయినా, ఆపదలో ఆదుకుంటుంది. అలా వచ్చిన వ్యక్తే దబాయ రామ్(Dabaya Ram). పాకిస్తాన్ మాజీ ఎంపీగా పని చేసిన ఆయన.. అక్కడ అరిగోసపడి భారత్ కు వచ్చాడు. బతుకుబండి లాగించేందుకు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. ఇంతకీ ఎవరీ దబాయ రామ్? ఎందుకు ఆయన ఇండియాకు వచ్చి ఐస్ క్రీమ్ లు అమ్ముతున్నాడు?
1988లో పాక్ ఎంపీగా ఎన్నికైన దబాయ రామ్
దబాయ రామ్ పాకిస్తాన్‌లో 1988లో ఎంపీగా ఎన్నికయ్యాడు. కానీ, ఇప్పుడు హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో ఐస్ క్రీమ్ అమ్ముతూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. 1945లో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించిన ఆయన, 1947 తర్వాత కూడా అక్కడే నివసించాడు. 1988లో బెనజీర్ భుట్టో ప్రధానిగా ఉన్నప్పుడు, లోహియా- బఖర్ జిల్లాల నుంచి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. మైనారిటీ కోటా ద్వారా ఎంపీ అయ్యాడు. కానీ, ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేని ముస్లీం తీవ్రవాదులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఆయన కుటుంబానికి చెందిన మహిళలను అపహరించి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటనపై ఆయన పాకిస్తాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా న్యాయం దక్కలేదు. బతికి ఉంటే బలుసాకు తిని ఉండొచ్చని భావించి.. ఆయన తన కుటుంబంతో కలిసి 2000లో ఇండియాలో అడుగు పెట్టాడు.
రతన్ గఢ లో నివాసం
దబాయ రామ్ రోహ్ తక్ లో తన బంధువు అంత్యక్రియల కోసం ఒక నెల వీసాతో వచ్చాడు. ఆ తర్వాత ఫతేహాబాద్ జిల్లాలోని రతన్‌గఢ్ గ్రామంలో స్థిరపడ్డాడు. అప్పటి నుంచి, 80 ఏళ్ల దబాయ రామ్ సైకిల్ రిక్షా మీద కుల్ఫీ, ఐస్ క్రీమ్ అమ్ముతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి ఏడుగురు పిల్లలు.. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. దబాయ రామ్ కుటుంబం గత 20 సంవత్సరాలుగా భారతీయ పౌరసత్వం కోసం పోరాడుతోంది. 2025 ఏప్రిల్ 30 నాటికి అతడి కుటుంబంలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు భారతీయ పౌరసత్వం పొందారు. మిగిలిన 28 మంది దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. 2000 నుంచి వారు వీసాలను పొడిగించుకుంటూ వస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరోసారి వార్తల్లోకి
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత ప్రభుత్వం వీసాలపై ఉన్న పాకిస్తానీ పౌరులను తిరిగి వెళ్లమని ఆదేశించింది. ఏప్రిల్ 24 నుంచి నాలుగు రోజుల్లో 537 మంది పాకిస్తానీలు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాక్ కు పంపించారు. ఇదే సమయంలో దబాయ రామ్ కుటుంబాన్ని స్థానిక పోలీసులు ప్రశ్నించారు. కానీ, వారిని మానవతా దృక్పథంతో వారిని దేశంలోనే ఉండేందుకు అనుమతించారు.
దబాయ రామ్ గురించి ఆసక్తికర విషయాలు
దబాయ రామ్ పుట్టినప్పుడు అతని పేరు దేశ్ రాజ్. కానీ, పాకిస్తాన్‌లో ఓటరు కార్డులు చేసే అధికారులు బలవంతంగా దబాయ రామ్ గా మార్చారు. 1988 పాకిస్తాన్ పార్లమెంటు జాబితాలో అతని పేరు అల్లా దబాయగా మార్చారు. పాకిస్తాన్‌లోని భక్కర్ జిల్లా దరియాఖాన్ తహసీల్ లోని పంజ్‌గిరైన్ ప్రాంతంలో అతని కుటుంబానికి 25 ఎకరాల భూమిని ఇప్పటికీ కలిగి ఉంది. దబాయ రామ్, పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే, తాను మొదట ఆయుధాలు తీసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. భారతదేశంలో భద్రత, సోదరభావం లభిస్తున్నందుకు కృతజ్ఞత చెప్పాడు.
Read Also: చనిపోయాక కూడా గోల్ వేశాడు.. అదిరా ఆట మీద ప్రేమంటే!