HBD Singer Usha:తమ అద్భుతమైన మధుర గానంతో శ్రోతలను అలరిస్తూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సింగర్స్ లలో సింగర్ ఉషా (Singer Usha)కూడా ఒకరు. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మైమరిపింప చేసి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇకపోతే ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగర్ ఉషా గురించి తెలియని విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సింగిల్ షో లతో భారీ ప్రాధాన్యత
సింగర్ ఉష.. 1980 మే 29న ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ లో జన్మించింది. దివంగత సంగీత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్థాపించిన ‘పాడుతా తీయగా’ అనే టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా కెరియర్ ప్రారంభించిన ఈమె, ఈ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ‘నవరాగం’ అనే మరో కార్యక్రమంలో కూడా పాల్గొని అక్కడ కూడా విజేతగా నిలిచింది. 1996 నుండి 2000 మధ్య అనేక సంగీత షోలలో పాల్గొన్న ఈమె శ్రోతలు , వీక్షకుల అభిమానాన్ని కూడా చూరగొంది. అంతేకాదు ‘మేరీ ఆవాజ్ సునో’ కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా ఫైనల్స్ కి ఎంపికైన ఈమె ఆ తర్వాత హిందీ టెలివిజన్ కార్యక్రమాలలో కూడా పాల్గొని విశేష ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఇకపోతే సింగర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ దగ్గర తొలి అవకాశాన్ని అందుకుంది సింగర్ ఉష.
సింగర్ ఉష.. సినిమాలో తొలి అవకాశం..
సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ‘ఇల్లాలు’ అనే చిత్రం ద్వారా మొదటి పాట పాడి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక 2000 సంవత్సరం నుండి దాదాపు పది సంవత్సరాలపాటు తెలుగు చిత్ర సీమలో నేపథ్య గాయకురాలిగా అనేక పాటలు పాడింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంద్ర, అతిధి, చిరుత, పౌరుడు, వర్షం, భద్ర , చిత్రం, నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే, సంతోషం, జయం, అవునన్నా కాదన్నా, నీ స్నేహం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాలలో తన నేపథ్య గానంతో శ్రోతలను మైమరిపింపచేసింది . ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా 150 కచేరీ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమె ప్రతిభ పాటవాలతో అందరినీ మెప్పించింది. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం, శంకర్ మహదేవన్, మణిశర్మ, పి సుశీల, మనో , హరిహరన్ వంటి వారితో కలిసి వివిధ కార్యక్రమాలలో కూడా పాల్గొనింది. శ్రోతలను తన పాటలతో అలరించడమే కాదు ఎన్నో గౌరవ అవార్డులు కూడా అందుకుంది. 2008లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవార్డు అందుకున్న ఈమె.. 2005లోనే మద్రాస్ తెలుగు అకాడమీ వారిచ్చే ఉగాది పురస్కారాన్ని అందుకుంది. అంతేకాదు ప్రముఖ గాయని ఆశాభోంస్లే సన్మాన కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ఆనర్ బహుమతి కూడా సొంతం చేసుకుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు తన కెరియర్లో ఎన్నో అవార్డులు, మరెన్నో గౌరవాలు అందుకుంది సింగర్ ఉష.
ALSO READ:Tollywood: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని బలవంత పెట్టారు.. ఎన్టీఆర్ బ్యూటీ ఎమోషనల్..!