Santa Dress Delivery Man: విభిన్న మతాల సమైక్యతకు నిదర్శనం భారత దేశం. కానీ గత దశాబ్దకాలానికి పైగా దేశంలో మతోన్మాదం పెరిగిపోతోంది. ప్రతి చిన్న విషయంలో మతం పేరుతో అభ్యంతరాలు చేయడం.. వాటికి రాజకీయ రంగు పులమడం వరకు విషయాన్ని తీవ్రం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలు ఉత్తర్ భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. తాజాగా క్రైస్తవుల ప్రధాన పండుగ క్రిస్మస్ వేళ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ డ్రెస్‌ని నడిరోడ్డుపై విప్పదీశారు కొందరు మతోన్మాదులు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్ నగరంలోనిది.
వివరాల్లోకి వెళితే.. ఇందోర్ నగరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక డెలివరీ బాయ్ శాంతా క్లాస్ డ్రెస్ ధరించి విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆ డెలివరీ బాయ్ శాంతా క్లాస్ డ్రెస్ ధరించడంపై ఒక వ్యక్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగలేదు అతడి డ్రెస్ రోడ్డుపైనే విప్పేయాలని బెదిరించాడు. ఆ వ్యక్తి ఇందోర్ హిందూ జాగ్రన్ మంచ్ జిల్లా కన్వీనర్ సుమీత్ హార్దియా అని తెలిసింది.
1 నిమిషం 22 సెకన్ల పాటు నిడివి ఉన్న వీడియోలో ఒక జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ తన బైక్ పై కూర్చొని చిరునవ్వుతూ కనిపిస్తున్నాడు.
అతని వద్దకు సుమీత్ హార్దియా వెళ్లి: “ఏంటి బాబు?.. ఈ డ్రెస్ ఏంటి? క్రిస్మస్ కాబట్టి శాంతా క్లాజ్ వేషం వేశావా?” అన్ని ప్రశ్నించాడు.
జోమాటో డెలివరి బాయ్: అవునండి..
సుమీత్ హార్దియా : మరి ఎప్పుడైనా దీపావళికి లేదా ఇతర హిందూ పండుగల సమయంలో కూడా భగవాన్ శ్రీరామ్ లాగ వేషం వేసి ప్రజల ఇళ్లకు వెళ్లి డెలివరీ చేశావా?
జోమాటో డెలివరి బాయ్: నేను అలా చేయను. కానీ కంపెనీ ఈ డ్రెస్ వేసుకొని డెలివరీ చేయమని చెప్పింది. అందుకే చేస్తున్నా
సుమీత్ హార్దియా : ఏంటి జొమాటో చెప్పిందా? శాంతా వేషంలో డెలివరీ చేయమని.
జోమాటో డెలివరి బాయ్: అవును
సుమీత్ హార్దియా : మరి మిగతా డెలివరి బాయ్స్ ఈ శాంతా డ్రెస్ వేసుకోలేదే?
జోమాటో డెలివరి బాయ్: కొంతమందికే ఇచ్చారండి
సుమీత్ హార్దియా : కొంతమందికే ఇచ్చారా? అయినా సరే. ఈ ఫుడ్ డెలివరీ అర్డర్ మీరు ఎక్కువ శాతం హిందువుల ఇంటికే తీసుకొని వెళతారు కదా?.. ఎందుకంటే మిగతా మతాల వారి జనాభా పెద్ద సంఖ్యలో లేదు. మరి అలాంటప్పుడు హిందూ పండుగల వేళ కాశాయ వస్త్రాలు ధరించి, క్రిష్ణుడు వేషం వేసి డెలివరి చేయాలి మరి? చేస్తున్నారా మీరు? లేదు కదా? ఇదేంటి మరి శాంతా క్లాజ్ వేషం. ఈ డ్రెస్ విప్పు ముందు.
సుమీత్ మాటలకు డెలివరీ బాయ్ భయపడి పోయాడు. ఎందుకంటే సుమీత్ తో పాటు మరికొందరు అతడిని కోపంగా చూస్తూ నిలబడ్డారు. అందుకే ఇష్టం లేకపోయినా ఆ డెలివరీ బాయ్ శాంతా డ్రెస్ విప్పడం ప్రారంభించాడు.
జోమాటో డెలివరి బాయ్: కంపెనీకి తెలిస్తే.. నా డెలివరి ఐడి ఆపేస్తారండి. నాకు పని ఉండదు.
సుమీత్ హార్దియా : పర్లేదు. ముందు నువ్వు డ్రెస్ విప్పు. ఈ పని నువ్వు చేసుకో.. కానీ ముందు ఈ డ్రెస్ విప్పు.
డెలివరీ బాయ్ తన డ్రెస్ పై భాగాన్ని (స్వెటర్ షర్టుని, తలపై శాంతా టోపీ) తీసి తన జొమాటో బ్యాగులో పెట్టాడు. అయినా సుమీత్ హార్దియా ఆగలేదు. నీ ప్యాంటు కూడా విప్పు అని చెప్పి అతని చేత అది కూడా విప్పించాడు. ఆ తరువాత అతని పేరు ఏంటి? అని అడిగాడు. ఆ డెలివరి బాయ్ తన పేరు అర్జున్ అని చెప్పాడు. దీంతో.. “సోదర అర్జున్ భారత్ ఒక హిందూ దేశం .. ఇలాంటివి చేయకూడదు.. ఇక నువ్వు జై శ్రీ రామ్ అంటూ చెబుతూ ముందుకు వెళ్లిపో” అని సుమీత్ హార్దియా అన్నాడు. అంతటితో ఆ వీడియో అయిపోయింది.
ఈ వీడియోకు ఎక్స్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. చాలామంది నెటిజెన్లు జొమాటోకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ కు మద్దతుగా ఎందుకు నిలబడలేదు? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరి కొందరు జొమాటో బలవంతంగా డెలివరీ బాయ్స్ చేత ఇలాంటి డ్రెస్ లు వేయిస్తూ వేధిస్తోందని రాశాడు.
Madhya Pradesh, Indore.
On Christmas, @Zomato dressed its delivery boys as Santa Claus. During deliveries, members of the "Hindu Jagran Manch" forced them to remove the Santa costumes and chanted "Jai Shri Ram" slogans.#MerryChristmas pic.twitter.com/DwzFlDFWbo
— هارون خان (@iamharunkhan) December 25, 2024