Financial Assistance: ఈరోజుల్లో మనం ఒక బిడ్డను పెంచాలంటే ఊహించని ఖర్చులు వస్తున్నాయి. పాలు, డైపర్లు, వైద్యం, స్కూల్ ఫీజులు, తదితర అవసరాలు చూస్తే నెలకి వేలల్లో ఖర్చవుతుంది. ఇదంతా మధ్య తరగతి కుటుంబాలపై గట్టిగా భారం వేసినట్టే. ముఖ్యంగా మెట్రో సిటీల్లో అయితే నివాస ఖర్చు, ట్రాన్స్పోర్ట్, పిల్లలకి అవసరమైన అవసరాలన్నీ చూస్తే జీతం అంతా ఒక్క నెలలో ఖర్చైపోతుంది.
ఇటీవల చెన్నైకి చెందిన ఒక జంట రేడిట్లో ఒక పోస్ట్ పెట్టింది. వాళ్ల జీతం కలిపితే నెలకి ₹78,000. కానీ నెలకి ₹8,000 కూడా సేవ్ చేయలేక పోతున్నామని, బిడ్డను పెంచడం చాలా కష్టంగా మారిందని చెప్పారు. వాళ్ల సమస్య ఒకటే కాదు. మనదేశంలో చాలా మంది తల్లిదండ్రులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కానీ మనం ఇప్పుడు మాట్లాడబోయేది – ఒక అద్భుతమైన విధానం గల దేశం గురించి. ఆ దేశం పేరే… జర్మనీ. ఇక్కడి ప్రభుత్వ పాలసీలు వినగానే ఆశ్చర్యం కలిగించకమానదు. జర్మనీలో ఉన్న Kindergeld అనే చైల్డ్ బెనిఫిట్ పాలసీ ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగాంచింది.
Kindergeld అంటే – పిల్లల పెంపకానికి ప్రభుత్వం నెలనెలకి ఇచ్చే ఆర్థిక సాయం. ఇది పిల్లల తల్లిదండ్రులకు లేదా గార్డియన్లకు ఇచ్చే డైరెక్ట్ మనీ. ఎవరి ఆదాయం ఎంత ఉన్నా సంబంధం లేదు. పేదవారైనా, మధ్యతరగతి కుటుంబాలైనా, అంతా సమానమే. జర్మన్ పౌరులకే కాదు, అక్కడ లీగల్ రెసిడెన్సీ ఉన్న విదేశీయులకూ ఇది వర్తిస్తుంది. అంటే విద్యార్ధులు, ఉద్యోగులుగా అక్కడ ఉండే భారతీయులకు కూడా ఇది దక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం, మొదటి బిడ్డ, రెండో బిడ్డకి నెలకి €250 చొప్పున ఇవ్వబడుతుంది. అంటే మన రూపాయలలో చూసుకుంటే సుమారు ₹25,000 ఒక్క బిడ్డకి. మూడవ బిడ్డకి ఇది €270 అవుతుంది – అంటే ₹27,000కి పైగా. నాల్గవ బిడ్డ నుంచి మరింత ఎక్కువగా, నెలకి దాదాపు ₹29,000 వరకూ ఇస్తారు. ఈ మొత్తం నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ అవుతుంది.
ఈ విధానం వల్ల కలిగే లాభాలేంటంటే – తల్లిదండ్రులు పిల్లల అవసరాలు తీర్చడానికి, చదువులు, ఆరోగ్య ఖర్చులు, దుస్తులు, భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయడానికి సాయం పొందగలుగుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లో పిల్లలకి కూడా సమాన అవకాశాలు రావడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశ్యం.
Kindergeld ద్వారా పిల్లలకి ప్రాథమిక అవసరాలు సులభంగా అందుతున్నాయి. దీని వల్ల వర్కింగ్ పేరెంట్స్ ఉద్యోగం, కుటుంబం రెండింటినీ సమానంగా నిర్వహించగలుగుతున్నారు. అలాగే, ఇది జనాభా తగ్గుతున్న జర్మనీలో పిల్లలు పుట్టేందుకు ప్రోత్సాహంగా మారుతోంది. చాలా మంది యువజనులు పిల్లల్ని పెంచడంలో ఆర్ధికంగా ధైర్యంగా ముందుకు వస్తున్నారు.
ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే – ఇది ఒక సింగిల్ టైం గిఫ్ట్ కాదు. పిల్లలు పెద్దయ్యే వరకు, వారి వయసు 18 ఏళ్ళ వరకు లేదా వాళ్లు చదువు లేదా vocational training చేస్తున్నంతవరకూ ఈ సాయం అందుతుంది. అంటే దీన్ని పిల్లల చదువుల కాలానికి లింక్ చేశారు. ఇది వారు విద్య పూర్తయ్యే వరకు సపోర్ట్ చేస్తుంది.
జర్మనీలో ఇది చాలా సులభంగా దరఖాస్తు చేయవచ్చు. పిల్లల పుట్టిన వెంటనే Familienkasse అనే అధికార సంస్థకు అప్లై చేస్తే చాలు. వారి ఆధారాలు, నివాస ప్రమాణాలు ఇచ్చిన తర్వాత నెలవారీగా ఈ సాయం ప్రారంభమవుతుంది. దీనికి ఎటువంటి పొలిటికల్ లింకులు, పదవి, ఆధారాల భారాలు ఉండవు.
ఇలా చూస్తే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి – ప్రభుత్వ పాలసీలతో సామాన్య ప్రజలకు నిజంగా మేలు చేకూర్చవచ్చు. మనదేశంలో ఇలాంటి విధానాలు ప్రారంభమైతే – తల్లిదండ్రులపై ఉన్న ఆర్థిక భారం కొంతవరకైనా తగ్గుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.