యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఇది.
బాంబులు జనావాసాలపై పడితే ఎలా ఉంటుందో తెలిపే వీడియో ఇది.
రోడ్డుపై అతిపెద్ద బాంబు పడితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే వీడియో ఇది.
అయితే ఈ వీడియో కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది. జూన్ 13న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలు కాగా.. జూన్ 22న కాల్పుల విరమణపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులపాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇదంతా జరిగిన కొన్నిరోజులకు తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తెలియజేస్తోంది.
ఎగిరిపడ్డ కార్లు..
యుద్ధం జరిగే సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఒక ప్రభుత్వ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసింది. వరుసగా బాంబులు జారవిడిచింది. ఆ దాడులు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే అప్పట్లో ఈ వీడియోలు బయటకు రాలేదు. తాజాగా ఆ దాడి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒక బాంబు ప్రభుత్వ భవనంపై పడగా, మరో బాంబు పక్కనే ఉన్న కార్ పార్కింగ్ ఏరియాలో పడింది. భవనం కుప్పకూలింది, పార్కింగ్ ఏరియాలో పడిన బాంబు ధాటికి కొన్నికార్లు ఎగిరి పడ్డాయి. ఇజ్రాయెల్ దాడి తీవ్రతను ఈ వీడియో స్పష్టంగా తెలియజేస్తోంది.
CCTV footage has now been released showing a series of airstrikes carried out by the Israeli Air Force against a government building in the Iranian capital of Tehran during the closing days of Operation “Rising Lion”, which are now under investigation by the Israel Defense… pic.twitter.com/upm9RRoQMQ
— OSINTdefender (@sentdefender) July 3, 2025
ఆపరేషన్ రైజింగ్ లయన్..
ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమంటూ జూన్ 13న ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ మొదలు పెట్టింది. ఇరాన్ పై వరుస దాడులు చేసింది. ఇరాన్ కూడా ప్రతిదాడులతో రెచ్చిపోయింది. అయితే ఇజ్రాయెల్ ధాటికి ఇరాన్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఓ దశలో ఇరాన్ బ్లాక్ మెయిలింగ్ కి కూడా దిగింది. అత్యంత కీలకమైన అరేబియా సముద్రంలోని రవాణా మార్గాన్ని నిలిపివేస్తామని ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్ నే కాదు, ఇతర ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరికలాంటిది. అయితే అమెరికా కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది. ఇరాన్ పై దాడులకు రంగం సిద్ధం చేసుకుంది. అణు స్థావరాలను టార్గెట్ చేస్తూ అమెరికా కూడా దాడులు చేసింది. అమెరికా ఎంట్రీ తర్వాత ఈ యుద్ధం పెనుముప్పుగా మారే అవకాశముందని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఆ తర్వాతే యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణ ప్రకటనలు విడుదలయ్యాయి.
యుద్ధం మొదలైన ఐదు రోజుల్లోనే అది పీక్ స్టేజ్ కి చేరింది. ఇరాన్‌లోని 100కుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకు క్షిపణులను ప్రయోగించింది ఇజ్రాయెల్. ఆ దాడుల తీవ్రతను తెలిపే వీడియోలు ఇప్పుడు బయటకు రావడం విశేషం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఏ స్థాయిలో నష్టపోయిందో ఈ వీడియో వల్ల స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఈ యుద్ధంలో విజేత ఎవరు అనేది స్పష్టంగా తెలియడంలేదు. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు అనే లక్ష్యాలతో ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టినా ఆ ఫలితాలు సాధ్యం కాలేదు. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని ఇరాన్ స్పష్టం చేసింది కూడా. అమెరికా వార్నింగ్ ఇచ్చినా కూడా ఇరాన్ వెనక్కు తగ్గలేదు. ఈలోగా కాల్పుల విరమణ ప్రకటన రావడంతో బాంబుల మోత ఆగింది.
అయితే కొంతమంది దీన్ని ఏఐ వీడియోగా అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అందుకే ఇలాంటి వీడియోలు వెంటనే బయటకు రాలేదు. వచ్చినా ఇప్పుడు వీటిని ఏఐ సృష్టి అంటూ కొట్టిపారేయడం విశేషం.