Kashmiri Teen NEET| వీధి లైటు కింద కూర్చొని చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరిన బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వారు మన సమాజానికి ఎప్పటికీ ఆదర్శం. తాజాగా అలాంటి ఒక వ్యక్తి గురించి జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కటిక పేదరికంలో చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఎంత హేళన చేసినా విద్య కోసం అతను పడిన కష్టాల గురించి ఆ కథనాలు చదివితే ఆశ్చర్యమేస్తుంది. పేదరికం, తండ్రి అనారోగ్యం.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లాంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూనే అతను ఉదయమంతా కష్టపడి కూలి పనిచేసి రాత్రంతా చదువుకునే వాడు. అలా చదువుకుంటూ తాజాగా నీట్ పరీక్ష లో టాప్ ర్యాంక్ సాధించాడు. ఈ డాక్టర్ కావడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతనే కశ్మీర్ కు చెందిన 17 ఏళ్ల సాజద్ మెహ్రాజ్ (Sajad Mehraj).
వివరాల్లోకి వెళితే.. కశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాకు చెందిన సాజద్ మెహ్రాజ్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రికి చదువు లేకపోవడంతో చేతికి అందిన పని చేసేవాడు. సాజద్ ఒక అన్న, అక్క కూడా ఉన్నారు. చిన్నప్పుడు అతను స్కూల్ కు వెళ్లినా తన బంధవులు, స్నేహితులంతా కలిసి చదువు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేవారు. అయినా సాజద్ తండ్రి మాత్రం తన బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పేవారు. అందుకని ఒక మంచి స్కూల్ లో సాజద్, అతని అక్క చదువుకునేందకు వెళ్లారు. సాజద్ తండ్రికి ఒక నాన్ (బ్రెడ్) షాపు ఉండేది. దీంతో సాజద్ చదువుకుంటున్న స్కూల్ లో కొందరు పిల్లలు సాజద్ ఆ స్కూల్ లో చదువుకోవడాన్ని వ్యతిరేకించారు. వీధిలో బ్రెడ్ అమ్ముకునే వారి పిల్లలు పెద్ద స్కూల్ లో చదువుకోవడాన్ని ఎలా అనుమతిస్తారని? వారు సాధించేది ఏంటన్ని ప్రశ్నించేవారు? కానీ స్కూల్ ప్రిన్సిపాల్ సాజద్ కు అనుమతి ఇవ్వడంతో అతను స్కూల్ లో చదువు కొనసాగించాడు.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
స్కూల్ లో ఎనిమిదో తరగతిలో సాజద్ టాప్ ర్యాంక్ సాధించడంతో కశ్మీర్ ప్రభుత్వం అతనికి స్కాలర్‌షిప్ అందించింది. చదువు పట్ల సాజద్ ఆసక్తిని గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్ అతనికి ఫిజిక్స్ వాలా ఆన్ లైన్ కోర్సు కొనిచ్చాడు. అయితే సాజద్ అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఇంట్లో అతని తండ్రి అనారోగ్యం పాలు కావడంతో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఈ కారణంగా అతని అన్న మార్కెట్ లో చెప్పులు విక్రయించేవాడు. సాజద్ కూడా అతని అన్నకు సాయం చేయడానికి ప్రతి రోజు స్కూల్ తరువాత మార్కెట్ వెళ్లేవాడు.
కానీ ఆ వ్యాపారం పెద్దగా కలిసిరాలేదు. దీంతో 9వ తరగతి చదువుకుంటున్న సాజద్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి బ్రెడ్ తయారీ షాపుని మళ్లీ తెరవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం బ్రెడ్ షాపులో రోజు ఉదయం 4 గంటలకు వెళ్లేవాడు. నిత్యం 300 నాన్ బ్రెడ్ తయారు చేసి విక్రయించేవాడు. సాయంత్రం 7 గంటల వరకు కఠినంగా శ్రమించేవాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చి అర్ధరాత్రి వరకు చదువుకునేవాడు. సాజద్ ఎప్పుడూ డాక్టర్ కావాలని కలలు కనేవాడు. అతని జీవితంలో తన అక్కను ఆదర్శంగా భావించేవాడు. ఆమె వైద్య పోటీ పరీక్షలో అర్హత సాధించి ఎంబిబిఎస్ చదువుకుంటోంది. ఆమె లాగే తాను కూడా నీట్ పరీక్షలో అర్హత సాధించాలని ఫిజిక్స్ వాలా కోర్సు చదువుకున్నాడు.
అలా పగలంతా బ్రెడ్ ముక్కలు తయారు చేసి విక్రియించడం. ఆ తరువాత అర్ధరాత్రి వరకు ఆన్ లైన్ లో నీట్ పరీక్ష కోసం శిక్షణ తీసుకోవడం. చివరికి సాజద్ పడిన శ్రమ ఫలించింది. నీట్ పరీక్షలో సాజద్ కు 650 మార్కెుల వచ్చాయి. ఇప్పుడు సాజద్ మెహ్రాజ్ కు కుప్వారా జిల్లా లోని హంద్వారా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ కోర్సులో అడ్మిషన్ లభించింది. సాజద్ కు గురించి తెలుసుకొని స్వయంగా ఫిజిక్స్ వాలా ఆన్ లైన్ శిక్షణ అందించే అలక్ పాండే అనే ట్యూటర్, యూట్యూబర్ అతడిని కలిశాడు. అతనితో తన ఛానెల్ లో ఇంటర్‌వ్యూ కూడా చేశాడు.
సాజద్ మెహ్రాజ్ లాంటి కష్టజీవులు మన సామాజానికి ఆదర్శం. కష్టాలు ఎదురైతే శ్రమతో, ఓర్పుతో, పట్టుదలతో ముందుకు సాగాలని సాజద్ జీవితం గురించే తెలుసుకుంటే అర్ధమవుతుంది.