Laddu theft video in Ganapathi mandapam at Keesara: గణపతి నవరాత్రులు ఏటా హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రతి గల్లీలోనూ మండపాలు ఎంతో ఆకర్షణీయంగా అలంకరించి..అందులో అత్యంత భారీ వినాయకులు, చేతిలో లడ్డూ పెట్టి మరీ మొక్కుకుంటారు. ఈ పది రోజులూ నిత్యం వినాయకుడికి పూజలు చేసి ప్రసాదాలు చేసి నలుగురికీ పంచుతుంటారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చివరి రోజు అన్నదానంలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత దేవుడి కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. ఈ పది రోజులు పూజిస్తే సంవత్సరానికి సరిపడా శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక చివరి రోజు లడ్డూ వేలం పాట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపిస్తారు.
పల్లెలలో పొలాలలో చల్లుకుని..
పల్లె ప్రాంతాలలో అయితే ఈ లడ్డూను మోతుబరులు లక్షల్లో పాడుకుని తమ సొంతం చేసుకునేవారు. ఈ లడ్డూని పొడిగా చేసి తమ పొలాలలో చల్లుకుంటే సిరులు తమ ఇంట పండుతాయని నమ్మకం. అలాగే సిటీ వాసులు కూడా ఈ లడ్డూ వేలం పాటను దక్కించుకోవడం ఓ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. ప్రతి ఏటా బాలాపూర్, ఖైరతా బాద్ వినాయక మండపాలలో జరిగే వేలంపాటలో లక్షల సంఖ్యలో వేలంపాడి లడ్డూను దక్కించుకుంటారు. చిన్న చిన్న మండపాలలో సైతం లడ్డూ వేలంపాటలు జోరుగా సాగుతాయి. ఎవరి స్థాయిని బట్టి లడ్డూల వేలం పాట జరుగుతుంది. చిన్న మండపాలలో సైతం ముప్పై వేల నుంచి రూ.70 వేల దాకా లడ్డూల వేలం పాట జరుగుతుంది. అయితే కొందరు చిలిపి దొంగలు ఈ లడ్డూలను అర్థరాత్రి అంతా పడుకున్నాక దొంగతనాలకు పాల్పడుతుంటారు. అప్పటికీ మండపాలకు కాపలాగా కాలనీ యువకులు పడుకుంటారు.
వైరల్ వీడియో
మేడ్చల్ జిల్లాలోని కీసర సిద్ధార్థ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఓ ఐదుగురు లడ్డూను చోరి చేసి పారిపోయారు. అయితే అక్కడ సీసీ కెమెరా ఉన్నదన్న సంగతి తెలియక తమని ఎవరూ గమనించడం లేదని లడ్డూను తీసుకుని పారిపోయారు. మర్నాడు పొద్దున్నే లడ్డూ లేకపోవడంతో కాలనీ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాలలో వైరల్ గా మారింది.
వినాయకుల వద్ద లడ్డూలు దొంగిలిస్తున్న చిలిపి దొంగలు
మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు చోరీ చేసిన ఐదుగురు దుండగులు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు నమోదు. pic.twitter.com/1DVWVPl0rj
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2024