Liver Transplant Patient Dead | దగ్గు, జలుబు లేదా ఇతర జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. క్యాన్సర్ వ్యాధి ఇలా వ్యాపించడం చాలా అరుదు. అయితే, అవయవ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఓ వ్యక్తిని దాత నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకడమే కాకుండా కేవలం ఆరు నెలల వ్యవధిలో శరీరమంతా వ్యాపించి అతడి ప్రాణం తీసింది. అత్యంత అరుదైన ఘటనగా వైద్యులు పేర్కొంటున్న ఈ ఉదంతం అమెరికాలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అరిజోనా రాష్ట్రానికి చెందిన 69 ఏళ్ల పేషెంట్ ఒకరు లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాక ఉపిరి తిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తరువాత ఆరు నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. మద్యం పానం అలవాటున్న సదరు పేషెంట్ లివర్ సిర్రోసిస్ బారిన పడ్డారు. దీంతో, వైద్యులు దాత నుంచి లివర్ భాగాన్ని సేకరించి రోగికి అమర్చారు. ఆపరేషన్‌కు ముందు రోగిలో క్యాన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఆ తరువాత ఆరు నెలల కల్లా పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
ఆపరేషన్ తరువాత కొన్ని వారాలకు రోగిని పరీక్షించిన డాక్టర్లకు ఆయన కడుపులో కొన్ని కణుతులు కనిపించాయి. అవి వేటి వల్ల వచ్చాయనేది స్పష్టంగా నిర్ధారించే వీలులేకపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకు ఆ కణుతులు క్యాన్సర్‌గా మారాయి. దీంతో, పరిస్థితి చూస్తుండగానే చేయిదాటి పోయింది. వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ‘‘మాకు తెలిసి ఇది చాలా అరుదైన కేసు. దాతకు చెందిన లివర్ గ్రాఫ్ట్ నుంచి రోగికి లివర్ క్యా్న్సర్ సోకిన ఘటనలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. పీసీఆర్ టెస్టు చేయిస్తే ఈ కణుతులు దాత నుంచి వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది’’ అని వైద్యుల్లో ఒకరు చెప్పుకొచ్చారు. దాతకు అంతకుముందు క్యాన్సర్ ఉన్న వైనం మెడికల్ టెస్టుల్లో ఎక్కడగా బయటపడలేదని కూడా పేర్కొన్నారు.
Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు
ఇక రోగిని కాపాడేందుకు అతడికి మరో లిమర్ మార్పిడి ఆపరేషన్ చేయించే అవకాశం కూడా వైద్యులకు లేకపోయింది. అప్పటికే అది బాగా వ్యాపించి ఉండటంతో రోగి మరో అవయవమార్పిడి చికిత్సకు అర్హత లేదని నిర్ధారించారు. అతడిని కాపాడేందుకు వైద్యులు తొలుత అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో క్యాన్సర్ అదుపులోకి వచ్చినట్టే అనిపించినా ఆ తరువాత వేగంగా వ్యాపించింది. దీంతో బాధితుడికి మృత్యువు తప్పలేదు.
కాగా, బ్రిటన్‌లో 2018లో కూడా దాదాపు ఇదే ఘటన చోటుచేసుకుంది. ఒకే దాత నుంచి సేకరించిన అవయవాలను నలుగురు పేషెంట్లకు అపరేషన్ ద్వారా అమర్చగా వారిలో ముగ్గురికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకి కన్నుమూశారు. దాతలో కనబడని బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ ద్వారా రోగులకు సోకని తొలి కేసుగా దీన్ని వైద్యులు అప్పట్లో అభివర్ణించారు. నిపుణులు చెప్పేదాని ప్రకారం, చర్మ, మెదడు సంబంధిత క్యాన్సర్లు మినహా ఇతరు క్యాన్సర్లు ఉన్న వారు అవయవదానం చేయచ్చు. ఇలాంటి సందర్భాల్లో దాతల ద్వారా క్యాన్సర్ వ్యాపించే అవకాశం 0.1 శాతమేనని వైద్యులు పేర్కొన్నారు. ఇక క్యాన్సర్ సోకితే గనక దాత నుంచి సేకరించిన భాగాన్ని వెంటనే రోగి శరీరం నుంచి తొలగించడం శ్రేయస్కరమని చెబుతున్నారు.