Sankranti festival: ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, బొబ్బర్లంక గ్రామం… సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందాలకు సర్వం సిద్ధం అంటున్నాయి ఇక్కడి కోడిపందేల బరులు. సంక్రాంతి, కనుమ రోజుల్లో ఖచ్చితంగా కోడి పందేలు జరిగి తీరుతాయని.. ఆ మాటకొస్తే అందుకంటూ ఒక చట్టం తేవాలని తెగేసి చెబుతున్నారు నిర్వాహకులు. పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు తమకు పుష్కలంగా అందాలని కోరుకుంటున్నామనీ అన్నారు.
ఇదిలా ఉంటే కోడిపందాలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సర్వం సిద్ధమైంది.. వెంప కాశీ రాజు ఆధ్వర్యంలో గొల్లవాని గ్రామంలో మినీ స్టేడియం తలపించేలా పందెం బరిని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. భీమవరం చుట్టపక్కల పందేలంటేనే వెంపకాశీ రాజు. వెంపకాశీరాజంటేనే కోడి పందేలన్న పేరుంది. పలు రాష్ట్రాల నుంచి వచ్చే అతిధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కారావాన్లు సైతం బరుల దగ్గర ఏర్పాటు చేశారు వెంప కాశీ రాజు.. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలు.. పందెం జరిగేటప్పుడు ఏ తప్పు జరగకుండా మంది మార్బలంతో సకలం సిద్ధం చేశారు కాశీరాజు.. పండగ నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయన్నది తాము ఒప్పుకోమనీ. అదసలు తమ అభిమతం కానే కాదనీ.. తమ స్కూల్లో రెవెన్యూ ప్రస్తావన పెద్దగా ఉండదనీ.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడ్డం.. వచ్చిన వారికి గౌరవ మర్యాదలు విశేషంగా అందివ్వడం మాత్రమే ఉంటుందని అంటారాయన.
ఇక ఉండి నియోజకవర్గంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా.. బరులను సిద్ధం చేశారు అధికారులు. ఇంటిల్ల పాది కుటుంబ సభ్యులతో సహా ఈ పందేలను తిలకించే ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం స్పెషల్ సీటింగ్ సైతం సెట్ చేశారు. ఒకే సారి 7 వేల మంది కూర్చుని చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశౄరు. కోడి పందెం జరుగుతుంటే అటు వైపు మరెవరూ దూసుకురాకుండా.. ఎక్కడివారు అక్కడే కూర్చుని చూసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ ఈ డీ స్క్రీన్లు, ఫుడ్ స్టాళ్లతో.. ఇంచు మించు ఒక పెద్దింటి పెళ్లి వేడుకలా ఇక్కడి ఏర్పాట్లు చేయడం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా లో పెద్ద ఎత్తున కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు.. ఏలూరు జిల్లా చేబ్రోలు పోలీసులు. 1300 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కోడి పందేల నిర్వహణ చట్ట రీత్యా నేరమనీ.. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ అంటున్నారు. సంప్రదాయ క్రీడల్లో భాగంగా కోడి పందేలు నిర్వహించొద్దనీ.. కోడిపందేల్లో అత్యంత కీలకమైన కోడికత్తి తయారీ సైతం తాము అడ్డుకుంటున్నామనీ అంటున్నారు స్థానిక పోలీసులు.
Also Read: Dharani Portal: సీఎం నియోజకవర్గంలో ఎంత దగా.. పాపం వీరి పరిస్థితి..?
ఇప్పటికే 2500 మందిపై బైండోవర్ కేసులు పెట్టామనీ.. కోడిపందేలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్న బరులను సైతం ధ్వంసం చేస్తున్నామనీ కోడిపందేలకు సహకరించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా తాము అడ్డుకుని తమ డ్యూటీ తాము చేస్తున్నామని.. బరులు సిద్ధం చేసే స్థల యజమానులకు నోటీసులు సైతం ఇస్తున్నామని అంటున్నారు పోలీసులు. ఏపీలో, మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో.. ఇటు పోలీసులు అటు బరుల నిర్వాహకులు ఎవరి ప్రయత్నం వారు చేసే దృశ్యం కనిపిస్తోంది. పోలీసులు ఎంత వ్యతిరేకించినా తమను ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టినా.. రాజకీయ నాయకుల సహకారంతో… మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమంటూ.. బరుల నిర్వాహకులు యధేచ్చగా ఈ కోడి పందేల నిర్వహణ చేస్తుండటం షరా మామూలుగా మారింది. అంతే కాదు.. తమిళనాట సంక్రాంతి సమయంలో జల్లికట్టు తప్పు కానప్పుడు ఆంధ్రనాట కోడిపందేలు కూడా అంతే తప్పు కావని. అవసరమైతే ఒక చట్టం తీసుకురావల్సింది ఉందని కూడా వీరు అనడం కనిపిస్తోంది