గూగుల్ కంపెనీలో ఉద్యోగం వస్తే ఎవరైనా వదిలి పెడతారా?
కానీ చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్ ఏ మాత్రం ఆలోచించకుండా గూగుల్ కే గుడ్ బై చెప్పేశారు.
గూగుల్ ఉద్యోగాన్నే వదులుకున్నాడంటే అతడు ఇంకెంత మేథావో అర్థం చేసుకోవచ్చు, మేథావే కాదు, అంతకంటే గొప్ప ముందు చూపు ఉన్న వ్యక్తి. ఆ ముందుచూపుకి కారణం అతడి తల్లి. చిన్నప్పట్నుంచి తన తల్లి చెప్పిన జీవిత పాఠాలే తన విజయానికి బాటలు వేశాయంటారు అరవింద్ శ్రీనివాస్. ఆమె ప్రోత్సాహం లేకపోతే అతనిప్పుడు ఏపై కంపెనీ వ్యవస్థాపకుడు అయిఉండేవాడు కాదు. అవును, పర్ ప్లెక్సిటీ అనే ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడు కమ్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్. ప్రస్తుతం చాట్ జీపీటీకి ఈ పర్ ప్లెక్సిటీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఓపెన్ ఏఐకి సవాల్ విసురుతోంది.
తల్లి కల..
1994లో చెన్నైలో జన్మించారు అరవింద్ శ్రీనివాస్. కుటుంబంతో పాటు చెన్నైలో నివశించే సమయంలో తల్లితో కలసి కొన్ని సందర్భాల్లో ఐఐటీ మద్రాస్ మీదుగా వారు వెళ్లేవారు. అలా వెళ్లే సమయంలో నువ్వు ఇక్కడ కచ్చితంగా చదువుతావు బాబూ అంటూ తల్లి చెబుతుండేది. ఆ మాటలే తర్వాత నిజమయ్యాయి. 2017లో ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ సాధించాడు అరవింద్ శ్రీనివాస్. తర్వాత ఉన్నత చదువులకోసం కాలిఫోర్నియాక వెళ్లాడు. బర్కిలీ యూనివర్శిటీలో చేరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పిహెచ్‌డి చేశాడు. అక్కడే అతని భవిష్యత్ డిసైడ్ అయింది. తర్వాత గూగుల్ లో చేరాడు. గూగుల్ చేరినా కూడా తల్లి మాటలే గుర్తొచ్చేయి. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తల్లి చిన్నప్పట్నుంచి చెబుతుండేది. అందుకే అతడు గూగుల్ ని వదిలిపెట్టాడు. తనకంటూ కొత్త ఐడెంటిటీని సృష్టించుకున్నాడు. పెర్ప్లెక్సిటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని స్థాపించాడు. దానికి ఆయనే సీఈఓగా వ్యవహరిస్తున్నాడు.
చాట్ జీపీటీకి పోటీగా..
ప్రస్తుతం పర్ప్లెక్సిటీ చాట్ జీపీటీకి పోటీగా ఎదుగుతోంది. భారత సంసతి వ్యక్తి తయారు చేసిన ఈ ఏఐ టూల్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. భారత ప్రధాని మోదీ కూడా పర్ప్లెక్సిటీని మెచ్చుకున్నారు. అరవింద్ శ్రీనివాస్ ని అభినందించారు. గూగుల్ నుంచి బయటకొచ్చిన మూడేళ్లలోనే ఆయన పర్ప్లెక్సిటీని తెరపైకి తెచ్చారు. 2022లో శాన్ ఫ్రాన్సిస్కోలో మరో ముగ్గురితో కలసి ఈ కంపెనీ స్థాపించాడు శ్రీనివాస్. 2024 నాటికి, కంపెనీ విలువ 1 బిలియన్‌గా డాలర్లకు పెరిగింది. ఏడాది తర్వాత అది 14 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2025 జులై నాటికి ఈ కంపెనీ 18 బిలియన్ డాలర్ల విలువైన స్టార్టప్‌గా మారింది.
ఎయిర్‌టెల్ భాగస్వామ్యం
ఈ ఏడాది మే నెలలో ఎయిర్ టెల్ కంపెనీకి పర్ప్లెక్సిటీ ఏఐ భాగస్వామిగా మారింది. ఈ ఒప్పందం ద్వారా 360 మిలియన్ల ఎయిర్ టెల్ వినియోగదారులు పర్ప్లెక్సిటీ ప్రో యాప్ ని ఉచితంగా వాడుకునే అర్హత సాధించారు. ప్రస్తుతం 30 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా 780 మిలియన్ల ప్రశ్నలకు పర్ప్లెక్సిటీ సమాధానాలు చెబుతోంది. ఆపిల్, మెటా సహా ఇతర బడా కంపెనీలు ఈ పర్ప్లెక్సిటీని టేకోవర్ చేసుకోడానికి ఆసక్తి చూపించాయి. కానీ వారి భారీ ఆఫర్లను అరవింద్ శ్రీనివాస్ తిరస్కరించారు. 2028 తర్వాత ఈ సంస్థ IPO కు వెళ్లాలనుకుంటోంది.