Nazi Treasure Czech| కొందరు జీవితమంతా శ్రమించినా వారు కష్టపడుతూనే ఉంటారు. కానీ మరికొందరికి మాత్రం ఉన్నపళంగా అదృష్టం వరిస్తుంది. దాంతో వారి జీవితాలే మారిపోతాయి. సినిమా స్టోరీని తలపించే ఒక ఘటన జరిగింది. సరదాగా షికారు కోసం బయలు దేరిన ఇద్దరు స్నేహితులకు వంద సంవత్సరాల క్రితం దాచి పెట్టిన నిధి లభించింది. దాని విలువ రూ.కోట్లలో ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. ఈ ఘటన చెక్ రిపబ్లిక్ (Czech Republic) దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చెక్ రిపబ్లిక్‌లో ఇద్దరు వ్యక్తులు ఈశాన్య పోడ్‌క్ర్కోనోసి పర్వత ప్రాంతంలోని అడవిలో హైకింగ్ చేస్తూ ఉండగా, వారు కొంత దూరం నడిచిన తర్వాత తమ అడుగుల కింద ఏదో ఉన్నట్లు అనిపించింది. గట్టిగా అడుగులు వేస్తే శబ్దం వచ్చింది. దీంతో, అక్కడ భూమి పొరను తొలగించి చూడగా, వారికి ఒక నిధి కనిపించింది. ఆ నిధిలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు ఉండటంతో ఆ పర్యాటకులు ఆశ్చర్యపోయారు. తర్వాత, ఈ నిధిని ఈస్ట్ బోహేమియా మ్యూజియం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధి ఫిబ్రవరిలోనే లభించినప్పటికీ, మ్యూజియం అధికారులు ఈ విషయాన్ని ఇటీవలే బహిర్గతం చేశారు.
మ్యూజియం అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, నిధిలో లభించిన వస్తువుల విలువ సుమారు రూ.2.87 కోట్లు ($340,000)గా అంచనా వేశారు. ఈ వస్తువుల బరువు దాదాపు 15 పౌండ్లుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. నిధిలో దొరికిన బంగారపు నాణేలు 1808 కాలం నాటివి అంటే 19వ శతాబ్దం ప్రారంభానికి చెందినవిగా తెలిపారు. అవి కనీసం 100 సంవత్సరాల క్రితం నాటివని వెల్లడించారు. ఈ నిధిని 1921 సమయంలో దాచి ఉంటారని అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా, ఈ ఖజానాలో ఒట్టోమన్ సామ్రాజ్యం, ఫ్రాన్స్, పాత ఆస్ట్రియా-హంగేరీ, బెల్జియంల నుంచి వచ్చిన కరెన్సీలు కూడా ఉన్నాయని తెలిపారు.
Also Read: స్విగ్గీలో బంగారం డెలివరీ.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్‌తో.. నిజమా?
ఇదిలా ఉండగా.. నాణేలపై ఉన్న చిన్న గుర్తులు 1918-1992 మధ్య కాలంలో ఉన్న పూర్వ యుగోస్లావియాలో ముద్రించినవై ఉండవచ్చని స్థానిక మీడియా వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో నాజీలు రష్యన్ దళాల నుంచి వెనక్కి తగ్గుతూ, ముందుకు వస్తున్న రష్యన్ సైన్యం నుంచి తప్పించుకోవడానికి ఈ నిధిని దాచి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ నిధి పర్వత ప్రాంతంలో ఎలా పాతిపెట్టబడిందనే విషయాన్ని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో, చెక్ రిపబ్లిక్ చట్టం ప్రకారం, నిధిని కనుగొన్న ఇద్దరు పర్యాటకులకు నిధి విలువలో సుమారు 10 శాతం బహుమతిగా లభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, విలువైన వస్తువులను భూమిలో నిధుల రూపంలో దాచడం అనే ఆచారాన్ని పూర్వకాలంలో స్థానికంగా ‘డిపోలు’ అని పిలిచేవారని ప్రజలు చెబుతున్నారు.