Ola furious Customer| ఓలా కంపెనీ ఈ స్కూటర్ల రిపేర్లతో భారీగా పరువు పోగొట్టుకుంటోంది. ఈ ఎలెక్ట్రిక్ స్కూటీలకు రిపేర్లు వస్తే.. కంపెనీ సరైన సర్వీస్ అందించడం లేదని చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఘటన ఓలా కంపెనీపై పిడుగులా పడింది. సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి ఓటా స్కూటర్‌ను కిందపడేసి పెద్ద సుత్తితో దాన్ని ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలో స్కూటీ పై సుత్తితో దాడి చేసే వ్యక్తి కొంత కాలం క్రితం ఓలా స్కూటర్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు అది రిపేరుకి వచ్చింది. షోరూమ్ లో రిపేర్ కోసం తీసుకెళ్లగా అందుకోసం రూ.90000 రిపేర్ బిల్లు వేశారు. ఆ బిల్లు చూసి కస్టమర్ షాకయ్యాడు. స్కూటీ ధర రూ.1,00,000 అయితే రిపేరు బిల్లు రూ.90,000 ఏంటని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో షోరూమ్ లో గొడవకూడా జరిగినట్లు తెలిసింది.
అయితే కంపెనీపైన కోపం అంతా ఆ కస్టమర్ తన స్కూటీపై చూపించాడు. షో రూమ్ బయట తన స్కూటీని తీసుకెళ్లి రోడ్డుపై బండిని కింద పడేసి.. పెద్ద సుత్తితో దాని పలుమార్లు దాడి చేశాడు. దీంతో ఆ స్కూటీ ధ్వంసమైంది. ఇదంతా చూడడానికి చుట్టూ భారీగా జనం గుమిగూడారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. చాలా మంది నెటిజెన్లు ఓలా కంపెనీ పనితీరుని విమర్శిస్తుండగా.. కొంతమంది వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: వారికి ఎన్నికలు కాదు విలాసాలే ముఖ్యం.. ఓటు వేయని సంపన్నులపై మండిపడిన పారిశ్రామికవేత్త..
కొందరైతే ఏకంగా ఓలా కస్టమర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇదే అదునుగా ఒక ఓలా ట్యాక్సీ డ్రైవర్.. తమకు కూడా ఓలా కంపెనీ అన్యాయం చేస్తోందని రాశాడు. గతంలో ఇలాంటి సమస్యలపై హిందీ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా ఓలా కంపెనీ యజమాన్యంపై విపరీతంగా జోకులు వేసేసరికి కంపెనీ సిఈఓ భవిశ్ అగర్వాల్ ఫైర్ అయ్యారు.
కస్టమర్లకు తమ కంపెనీ అద్భుతంగా సర్వీస్ ఇస్తోందని.. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అయితే కునాల్ కామ్రా లాంటి కొందరు తమ కంపెనీ పరువు తీయడానికి రైవల్ కంపెనీల నుంచి డబ్బులు తీసుకొని విమర్శలు చేస్తున్నారని సోషల్ మీడియాలో రాశారు. ఒకవేళ సమస్యకు అతని వద్ద పరిష్కారం ఉంటే తమతో వచ్చి పనిచేయాలని చెప్పాడు.
ఆ తరువాత కునాల్ కామ్రా భవిష్ అగర్వాల్ కు కౌంటర్ కూడా ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఓలా కస్టమర్లకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి టాగ్ చేస్తూ పోస్ట్ కూడా చేశాడు.
కొన్ని నెలల క్రితం ఓలా స్కూటీ కొన్న కస్టమర్.. అది రిపేరు వచ్చేసరికి షో రూమ్ తీసుకెళ్లగా.. నెల రోజులైనా దాని సర్వీస్ చేయలేదు. దీంతో షోరూం, సర్వీస్ సెంటర్ల యజమాన్యంతో ఆ కస్టమర్ గొడవపడ్డాడు. చివరికి షోరూం ఓనర్లపై పగబట్టి.. షోరూంపై పెట్రోల్ పోసి అంటించాడు. మరో కస్టమర్ అయితే ఓలా స్కూటీని గాడిదకు కట్టి ఊరేగింపు చేశాడు. ఇలా ఓలా స్కూటీ కొని భంగపడిన కస్టమర్లు వినూత్న రీతిలో తమ కోపాన్ని చూపిస్తున్నారు.
OLA with Hatoda 🔥😅🤣😂@kunalkamra88 pic.twitter.com/mLRbXXFL4G
— Anil MS Gautam (@realgautam13) November 23, 2024