Harsh Goenka Voting Post| దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలోని మొత్తం 288 సీట్లకు గాను ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి చాలా మంది సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు షారుఖ్ ఖాన్ కుటుంబం, అక్షయ్ కుమార్, సోనూ సూద్ తదితరులు ఓటు వేసి.. ప్రజలందరూ తప్పకుండా ఓటు వేయాలని మీడియా ముందు కోరారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే కొందరు సంపన్నులు మాత్రం తమ ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యం తరువాత చూసుకోవచ్చు
ఆపిజి గ్రూప్ కంపెనీల చైర్మన్ అయిన బిజినెస్ హర్ష్ గోయెంకా (66) చేసిన పోస్ట్.. సోషల్ మీడియాలో ఈ రోజు బాగా వైరల్ అవుతోంది. “ముంబై నగరంలో హై సొసైటీలోని ఒక వర్గం ఓటు వేయడాన్ని భారగా ఫీలవుతోంది. ఓటు వేయడం మనందరి డ్యూటీ. కానీ వాళ్లకు డ్యూటీ కంటే విలాసాలే ముఖ్యం.” అని గోయెంకా పోస్ట్ చేశారు.
ఓటు వేయని ఆ సంపన్న కుటుంబాలను గోయెంకా ఎద్దేవా చేస్తూ.. తన పోస్ట్ ద్వారా చురకలు అంటించారు. “ఈ రోజు మలబార్ హిల్ ప్రాంతంలో నివసించే మహిళలు, పురుషులు (సంపన్న వర్గం) ఓటు వేయరేమో. పోలింగ్ బూత్ వెళ్లడానికి బహుశా వారి డ్రైవర్ ఏ కారులో తీసుకెళ్లాడు.. మర్సిడీస్ బెంజుకారులోనా.. లేక బిఎండబ్లూలోనా అని చర్చించకోవటానికి వాళ్లకు సరిపోతుంది. ఈ చర్చల్లో వాళ్లు చాలా బిజీగా ఉంటారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడితే వారి బ్రాండెడ్ చెప్పులకు మురికి అంటు కుంటుదని వారికి భయం. లేకపోతే వాళ్లు వేసుకునే డిజైనర్ బట్టలకు మ్యాచింగ్ సన్ గ్లాసెస్ లభించడం లేదేమో?!.. అదీకాక పోతే మధ్యాహ్నం వరకు భోజనంలో సలాడ్ తింటూ వాట్సాప్ లో ఏ అభ్యర్థి సరైన వాడు ఎవరు అని డిబేట్ చేసుకుంటూ ఉండిపోతారు.
Also Read: లక్షల కోట్ల ఆస్తిని వదిలేసిన ఇన్పోసిస్ వారసుడు.. ఎందుకో తెలుసా.?
నవంబర్ లో ఎండకు పోలింగ్ బూత్ వద్ద సామాన్యుల పక్కన ఎలా నిలబడాలి, పైగా పోలింగ్ బూత్ వద్ద కారు పార్కింగ్ ఉంటుందా? లేదా?.. వాళ్లకు ఉండే షుగర్ వ్యాధికి ఏ కంపెనీ ఇంజెక్షన్ వేసుకోవాలా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఈ రోజే సమాధానం వెత్తుకోవాలి? ఇవన్నీ ముఖ్యం కదా!.. ప్రజాస్వామ్యం గురించి తరువాత చూసుకోవచ్చు.” అని హర్ష్ గోయెంకా ఓటు వేయని సంపన్నులకు పరోక్షంగా చురకలు అంటించారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంతకాలం కెనడా దేశ పౌరసత్వం ఉండడంతో ఆయన ఓటు వేయలేదు. కానీ ఇటీవలే ఆయన ఆ దేశ పౌరసత్వాన్ని వదిలేసి తిరిగి భారత పౌరసత్వం తీసుకున్నారు. అందుకే ఉదయాన్నే ఓటు వేసి.. ప్రజలందరూ ఓటు వేయడం చాలా ముఖ్యమని చెప్పారు. పోలింగ్ సందర్భంగా ముంబై నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. హింస చెలరేగే అవకాశమున్న ధారావి, గురు తేజ్ బహదూర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు అన్ని వాహనాలకు తనిఖీలు చేస్తున్నారు.