Parrot Dentist| చిలుక అందమైన పక్షి. దాన్ని ఇంట్లో పెంచుకుంటే చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే అది తొందరగా మానవుల భాష నేర్చుకుంటుంది. మనిషి భాష చిలుక పలుకుతుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇంట్లో చిలుకలు పెంచుకుంటూ ఉంటారు. ఇదంతా చిలుక ఎలా చేయగలుగుతుందంటే చిలుకలకు జ్ఞాపకశక్తి బాగా ఎక్కువగా ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలింది. అయితే చిలుకలు.. మాట్లాడే టాలెంట్ తో పాటు ఇతర నైపుణ్యాలు కూడా కలిగి ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక చిలుక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే అందరూ షాకవ్వాల్సిందే.. ఎందుకంటే ఒక చిలుక దంత వైద్యుడి అవతారమెత్తింది.
వీడియోలో ఏముందంటే..
చైనాలోని గుయాంగ్ డోంగ్ రాష్ట్రం షోషాన్ అనే నగరంలో ఒక టీనేజ్ కుర్రాడు.. పంటినొప్పితో బాధపడుతుండగా.. అతని నోట్లో ఒక పుచ్చిపోయిన పంటిని ఒక చిలుక కచ్చితత్వంతో బయటికి తీసింది. ఇదంతా ఒక వీడియోలో రికార్డ్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒక 15 ఏళ్ల అబ్బాయి ఒక చేత్తో చిలుకను పట్టుకొని.. తన నోటిలో చిలుక తలను పెట్టాడు.. అప్పుడా చిలుక కచ్చితంగా సమస్య ఉన్న పంటిని మాత్రమే తన ముక్కుతో పట్టుకొని బయటకు తీసింది. ఇది చూసిన వారంతా షాకయ్యారు. అంతే కాదు ఆ చిలుక బయటికి తీసిన పంటిని పక్కనే నిలబడి ఉన్న మరొక వ్యక్తి చేతిలో పెట్టి తన పని ముగించింది.
ఇది చూసి చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ నిజానికి చిలుకలకు ఈ నైపుణ్యం ఉంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చిలుకలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ చిలుకలు తమ బలమైన ముక్కుతో పిల్లల్లోని బేబీ టీత్ (పాల దంతాలు) ని చాలా కచ్చితంగా పీకేస్తుంది.
Also Read: 60వ గుడ్డు పెట్టిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పక్షి.. వయసు 74 ఏళ్లు!
కొన్ని దేశాల్లో అయితే చిలుకలతో కాకుండా ఇతర పక్షులను కూడా ఈ వైద్యం కోసం ఉపయోగిస్తున్నారు. అలాగే అడవుల్లో కొన్ని పక్షులు మొసలి దంతాలను శుభ్రం చేసే పనిచేస్తాయి. వాటిలో ఈజిప్షియన్ ప్లోవర్ అనే పక్షి ఒకటి. ఈ పక్షి మొసళ్లకు నేస్తం లాంటిది. మొసలి ఏదైనా జంతువుని వేటాడి తన పళ్లతో బాగా కొరికి నమిలి తింటుంది. దీంతో మొసలి పళ్లలో మాంసం లేదా జంతువు శరీర భాగాల వ్యర్థాలు ఉండిపోతాయి. అలాంటి సమయంలో మొసలి నీటి బయటకు వచ్చి తన నోరు తెరిచి అలా చాలా సేపు కూర్చుంటుంది. అప్పుడు ఈ పక్షుల మొసలి నోట్లోకి ప్రవేశించి క్రమంగా దాని దంతాలను శుభ్రం చేస్తాయి. ఈజిప్ట్ దేశంలోని నైల్ నది వద్ద ఉండే మొసళ్లు ఇలా చేస్తూ ఉంటాయి.
పక్షులకు ప్రమాదకరం..
మనిషి నోట్లో నుంచి దంతాలను పీకేయడం లాంటి చికిత్స కోసం పక్షులను ఉపయోగించడం సరికాదని చికాగో ఎగ్జాటిక్స్ అనిమల్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే మనిసి నోట్లో ఉండే లాలాజలం (ఎంగిలి)లో కొన్ని విషపూరితమైన పాథోజెన్స్ ఉంటాయి. ఈ పాథోజెన్స్ మానవులకు ప్రమాదకరం కాకపోయినా.. పక్షులకు చాలా ప్రమాదకరమని జంతు వైద్యులు హెచ్చరిస్తున్నారు.