Seat 11A Plane Crash| అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమానం ప్రమాదంలో ప్రయాణికులందరూ చనిపోయారు. కానీ ఒక్క ప్రత్యేక సీటులో కూర్చున్న వ్యక్తి మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. వినడానికి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే ఇంత కంటే షాకింగ్ విషయం మరొకటి ఉంది. ఎందుకంటే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. 27 ఏళ్ల క్రితం కూడా ఒక విమానంలో ఇదే నెంబరు గల సీటులో కూర్చున్న వ్యక్తికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆ విమానం కూడా ప్రమాదానికి గురై 100కు పైగా ప్రయాణికులు చనిపోయారు. ఈ విషయాన్ని తాజాగా ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన నటుడు, గాయకుడు రుంగ్‌సాక్ లాయ్‌చుసాక్. 27 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డాడు. ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కూడా అందరూ చనిపోగా ఒకే ఒక్కడు వ్యక్తి బతికాడని.. అతను కూడా సీటు 11Aలో కూర్చున్నాడని తెలిసినప్పుడు.. రుంగ్‌సాక్‌కు ఒళ్ళు జలదరించింది. ఆశ్చర్యకరంగా.. రుంగ్‌సాక్ కూడా 1998లో జరిగిన ప్రమాదంలో అదే సీటు 11Aలో కూర్చుని బతికాడు.
1998లో జరిగిన విమాన ప్రమాదం
1998 డిసెంబర్ 11న, థాయ్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ TG261 దక్షిణ థాయ్‌లాండ్‌లో ల్యాండింగ్ సమయంలో స్టాల్ అయి.. చిత్తడి నేలలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 146 మందిలో 101 మంది మరణించారు. అప్పటికి 20 ఏళ్ల రుంగ్‌సాక్ మాత్రం అనూహ్యంగా బతికి బయటపడ్డాడు. ఇప్పుడు 47 ఏళ్ల వయసు గల రుంగ్‌సాక్.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ప్రమాదం గురించి తెలుసుకున్నాడు. తాజా విమాన ప్రమాదంలో బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ సీటు 11Aలో కూర్చొని బతికి ఉన్న విషయం తెలిసినప్పుడు అతను షాకై పోయాడు.
రుంగ్‌సాక్ ఫేస్‌బుక్‌లో థాయ్ భాషలో సీట్ 11A గురంచి ఓ పోస్ట్ చేశాడు. “ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో బతికిన వ్యక్తి నా సీటు 11Aలోనే కూర్చున్నాడు.” ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మందిలో రమేష్ మాత్రమే బతికాడు.
రుంగ్‌సాక్ తన 1998 విమాన ప్రమాదం గురించి రాస్తూ.. అప్పటి విమానబోర్డింగ్ పాస్ ఇప్పుడు తన దగ్గర లేదని.. కానీ వార్తాపత్రికలు తన సీటు నంబర్ గురించి రాశాయని తెలిపాడు. ఆ ప్రమాదం తర్వాత, అతను సంవత్సరాల పాటు ట్రామా సర్వైవర్ గిల్ట్‌తో బాధపడ్డాడు. దాదాపు పదేళ్ల పాటు అతను మళ్లీ విమానంలో ప్రయాణించలేదు. తన జీవితాన్ని “రెండో జీవితం”గా వర్ణిస్తూ.. ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపాడు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రమేష్ ఒక్కడే సురక్షితంగా బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా అతను ఎలా బతికాడని అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు 11Aలో కూర్చున్నాడు. ప్రమాద సమయంలో అతని సీటు మొత్తం ఊడిపోయింది. అతను ఆ సీటుకే బెల్టు వేసుకొని ఉండడంతో కదల్లేకపోయాడు. కానీ విమానం కూలిపోయే సమయంలో విమానం రెండుగా ముక్కలై అతను కూర్చున్న భాగం నుంచి బయటకు విసిరివేయబడ్డాడు. గాయాలతో ఉన్నప్పటికీ.. అతను శిథిలాల నుంచి నడిచి బయటకు వచ్చి, ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి చేరాడు.
ఆసుపత్రి నుంచి రమేష్ మాట్లాడుతూ.. “నేను కూడా చనిపోతానని కొంత సమయం అనుకున్నాను. కానీ కళ్ళు తెరిచినప్పుడు, నేను బతికి ఉన్నానని గుర్తించాను. సీటు బెల్ట్ తీసి, అక్కడి నుంచి అయినా బయటకు రావడానికి ప్రయత్నించాను,” అని డీడీ న్యూస్‌తో చెప్పాడు.
Also Read: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. 10 నిమిషాలు లేటు కావడంతో లండన్ ఫ్లైట్ మిస్
సీటు 11A గురించి ఈ అద్భుత కథ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. చాలా మంది తమ తదుపరి విమాన ప్రయాణంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లు.. ముఖ్యంగా 11A సీటును బుక్ చేయాలని చూస్తున్నారు.