Language Row: ముంబై లోకల్ రైళ్లలో సీట్ల విషయంలో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మహిళల మధ్య సీట్ల కోసం ఘర్షణలు జరగడం చూస్తుంటాము. సోషల్ మీడియాలో ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. లోకల్ రైళ్లలో సీట్ల కోసం జరిగే గొడవలు కొన్నిసార్లు తీవ్రంగా మారుతాయి. జట్లు పట్టుకుని కొట్లాడే వరకు వెళ్తాయి. తాజాగా ఇద్దరు మహిళల మధ్య సీట్ల వివాదం కాస్తా.. కొత్త మలుపు తీసుకుంది. ఈ గొడవను చూసి అందరూ షాకయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సీట్ల వివాదం భాష వివాదంగా మారి..
తాజాగా రద్దీగా ఉన్న ముంబై లోకల్ రైలులో ఇద్దరు మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మొదట్లో మామూలు వివాదంగా మొదలై.. చివరకు కొత్త మలుపు తీసుకుంది. మరాఠీ వర్సెస్ హిందీ వివాదంగా మారింది. సెంట్రల్ లైన్‌లో నడుస్తున్న రైలులో శుక్రవారం(జూలై 18న) సాయంత్రం ఈ సంఘటన జరిగింది. “మీరు మా ముంబైలో ఉండాలనుకుంటే, మరాఠీ మాట్లాడండి, లేకపోతే బయటకు వెళ్లండి” హిందీ మాట్లాడే మహిళపై లోకల్ మహిళ తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడింది. రెండు గ్రూపులుగా మహిళా ప్రయాణికులు విడిపోయి ఒకరిపై మరొకరు తిట్టుకున్నారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
మహిళల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్ది సేపట్లోనే నెట్టింట హల్ చల్ చేసింది. ఈ ఫుటేజ్ లో, ఆరు నుంచి ఏడుగురు మహిళలు ఒకరితో మరొకరు వాదించుకోవడం కనిపిస్తుంది. రద్దీ రైళ్లలో ఇలాంటి గొడవలు కామన్ అయినప్పటికీ, భాష రంగు పూసుకోవడం ఆందోళనకు గురి చేసింది. ముంబైలో ఉండాలంటే మరాఠీ నేర్చుకోవాలనే వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత తీవ్రం అయ్యింది. ఈ మాట తర్వాత చుట్టుపక్కల మహిళలకు కూడా తీవ్రంగా స్పందించారు. చివరకు ఆ కోచ్ లో ‘మరాఠీ vs హిందీ’ రచ్చగా మారింది.
#Mumbai में मराठी vs हिंदी का लेकर अब लोकल ट्रेन में पंहुचा..ट्रेन के ladies बोगी में शुक्रवार शाम महिलाओं में मराठी बोलने को लेकर हुआ विवाद..वायरल वीडियों आया सामने..सीट पर बैठने को लेकर हुआ विवाद.."हमारे मुम्बई में रहना है तो मराठी बोलो नही तो निकलो बाहर" #Marathi@TNNavbharat pic.twitter.com/9ePQHruJ6I
— Atul singh (@atuljmd123) July 20, 2025
భాష వివాదంపై రైల్వే పోలీసులు విచారణ
అటు భాష వివాదంపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. “ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. వీడియోను పరిశీలిస్తున్నాం. సాక్షులతో మాట్లాడుతున్నాం. రైల్వే చట్టాలను ఉల్లంఘిన ప్రవర్తించినట్లైతే అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది” అని GRP అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ, భారత శిక్షాస్మృతి, రైల్వే చట్టాల ప్రకారం ఏదైనా మతపరమైన, రెచ్చగొట్టే ప్రకటనలను చేస్తే, తీవ్రంగా పరిగణిస్తామని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో కొనసాగుతున్న భాష రచ్చ
మరాఠీ భాష ప్రచారంపై మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) మరాఠీ మాట్లాడని వారిని లక్ష్యంగా చేసుకుని భాష విభజన పెంచే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదం ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో జరగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వివాదం ముంబై విశ్వనగర గుర్తింపును దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read Also: విశాఖకు మెట్రో రైల్ వస్తే ఇలా ఉంటుంది.. ఈ వీడియో చూస్తే వావ్ అంటారు!