Ramzan Haleem Mohammed Furqaan Qawwali controversy | రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరుల ప్రార్థనలు, ఉపవాసాలు చేసుకుంటూ ఉంటారు. ఈ నెలలో మసీదులు, పరిసర ప్రాంతాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. దీంతో పాటు ఈ నెలకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. నెల ప్రారంభం కాగానే.. ఎక్కడ చూసినా, హలీం అమ్మకాలు పెద్దఎత్తున జరుగుతుంటాయి. రోడ్లపై జనం ఎగబడి మరీ హలీం లొట్టలేసుకుంటూ తింటూ ఆనందిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో హలీం సందడి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈంత పేరు ప్రఖ్యాతలున్న హలీం విషయంలో ఇప్పుడు ఓ వివాదం ప్రారంభమైంది. మరీ ఎక్కువగా, ఇది లక్షలాది మంది ముస్లిం సోదరుల మతపరమైన భావాలను కించపరచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ వివాదం మొదలైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న సందర్భంలో హలీం తయారు చేయడం సాధారణమే. కానీ, ఇలాంటి పవిత్ర మాసంలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లున్సర్ మహమ్మద్ ఫుర్ఖాన్ అలియాస్ ఫుర్ఖాన్ కిక్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఒక రీల్‌ను పోస్ట్ చేశాడు. ఆ వీడియోను హైదరాబాద్‌లోని షాలిబండలోని యాసీన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని హలీమ్ స్టాల్ వద్ద తీసినట్లు తెలుస్తోంది. అమ్మకాలు పెద్దఎత్తున పెరిగిపోవాలనే ఉద్దేశ్యంతో హలీమ్ సిద్ధం చేస్తున్న సమయంలో ఆ యువకుడు ఖవ్వాలీ పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియో రికార్డు చేశాడు. ఇప్పుడు ఇది ముస్లిం సమాజంలోని చాలా మంది సభ్యుల మతపరమైన భావాలను తీవ్రంగా గాయపరిచిందని చెబుతున్నారు.
Also Read: ఇంటర్వ్యూలో 5వ తరగతి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన అభ్యర్థులు.. జెన్ z ఇంతేనా?
ఇందుకు సంబంధించిన రీల్స్ కంటెంట్ పవిత్ర మాసంలో ఉండే నమ్మకాలను అగౌరవపరిచే అవకాశం ఉందని మత పెద్దలు, పలు ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నారు.రంజాన్ పవిత్ర మాసాన్ని ముస్లింలు భక్తికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ నెల మొత్తం ప్రాపంచిక సుఖాలును పక్కన పెట్టి ఉపవాసం, నమాజులు చేసుకుంటూ దైవారాధనలో గడుపుతుంటారు. ఇస్లాం మతంలో సంగీతం, పాటలు నిషేధం. అలాంటిది ఉపవాసం సమయంలో ఇలా రొమాంటిక్ పాటలు పెట్టి హలీంని చూపిస్తూ నృత్యాలు చేయడం, వెకిలి చేష్టలు చేయడం ఇస్లాం మత ఆచారాలను అగౌరవపరచడమేనని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, ఈ ఘటనపై నగరంలోని బహదూర్‌పురాకు చెందిన మొహమ్మద్ అహ్మద్ జలీల్ అనే వ్యక్తి శాలిబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి మతపరమైన విశ్వాసాలను కించపరిచే వ్యక్తులకు తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి కంటెంట్ సృష్టికర్తలు వాళ్లు రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో చేసే పోస్టుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సోషల్ మీడియా పోస్టులు వల్ల ఎంతో మంది ప్రభావితం అవుతారని.. అందుకే రీల్స్ రికార్డు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరారు.
ముఖ్యంగా ఇలాంటి మతపరమైన, సున్నితమైన అంశాల్లో ఎదుటివాళ్ల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వివాదం రేపిన వీడియోలో వ్యక్తి ఫుర్ఖాన్ ముస్లిం సమాజం క్వాద్రీ శాఖను ఉద్దేశపూర్వకంగా అవమానించే పాటతో రీల్‌ను చిత్రీకరించాడని గుర్తించామన్నారు. ఇది క్వాద్రీ శాఖ, దర్గా కార్యకలాపాల విశ్వాసాలను అవమానించేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు ఈ చర్యకు పాల్పడిన యువకుడిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.