Strange Incident: తెలంగాణలో వర్షాలు, వరదల మధ్య… మరోవైపు ఆశ్చర్యం కలిగించే ఒక వింత సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేస్తోంది. “చింత చెట్టు కదులుతోంది” — ఈ మాట విన్నా మొదట నమ్మశక్యం కాకపోయినా, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో నిజంగానే ప్రజలు కళ్లారా చూశారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని ముదిరాజ్ కాలనీలో ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య ఇంటి ఆవరణలో ఈ వింత జరిగింది. అక్కడ మొలిచిన చింత చెట్టు మొక్క, ఒక్కసారిగా అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. గాలి కూడా లేకుండా ఆ మొక్క కదలడం చూసి, స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
మొదటిసారి ఈ ఘటన రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. అలా కదులుతున్న చింత మొక్కను చూసి, కొందరు వీడియోలు తీశారు. ఈ సంఘటనతో గ్రామంలో చర్చలు మొదలయ్యాయి. అంతే కాదు, “ఇది దేవుడి మహిమే” అని కొందరు భావించగా, మరికొందరు దీని వెనుక శాస్త్రీయ కారణం ఉండొచ్చని అనుకున్నారు. ఆశ్చర్యకరమేమిటంటే… ఇదొకసారి జరిగిన వింత కాదు. ఆగస్టు 12న కూడా అదే రీతిలో ఆ మొక్క కదలడం పునరావృతమైంది. ఈ రెండుసార్లు జరిగిన ఘటనతో ముదిరాజ్ కాలనీలోని ప్రజలు ఇంకా ఎక్కువగా ఆనందంలో ఉన్నారు. “బ్రహ్మంగారు చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయి” అని కొందరు చెబుతున్నారు.
ఇక ఇది ఒక్క స్టేషన్ ఘన్‌పూర్‌లోనే కాదు… ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అక్కడ కూడా ఒక చింత మొక్క, చుట్టూ ఉన్న ఇతర మొక్కలు కదలకపోయినా, తానే ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. గాలి ఉంటే అన్ని మొక్కలూ కదలాలి. కానీ ఇక్కడ కదులుతున్నది మాత్రం ఒక్క చింత మొక్కే. అందుకే, ఈ వింతను చూసినవారు “దైవశక్తి” అని అంటుంటే, శాస్త్రవేత్తలు మాత్రం దీని వెనుక సహజమైన కారణం ఉందని చెబుతున్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించిన ప్రకారం
దీని వెనుక కారణం “వేరు పురుగు” (Root Weevil) కావొచ్చని చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా వేపమొక్కల్లో కనిపిస్తాయి. ఈ వేరు పురుగులు C ఆకారంలో ఉండి, మొక్క వేరును చుట్టుకుంటాయి. పురుగు కదలడం మొదలుపెట్టినప్పుడు, అది చుట్టుకున్న వేరును స్వల్పంగా తిప్పుతుంది. అలా వేరుతో పాటు మొక్క మొత్తం కదులుతుంది. ఇది బయటికి చూసినప్పుడు, మొక్క తనంతట తాను తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి, పురుగు కదలికే కారణం.
ఈ శాస్త్రీయ వివరణ ఉన్నా, ప్రజలలో మాత్రం ఈ ఘటనపై భక్తి, భయం, ఆశ్చర్యం అన్నీ కలిసిపోయి ఉన్నాయి. కొందరు దీన్ని శకునంగా భావిస్తుంటే, మరికొందరు అరుదైన ప్రకృతి అద్భుతంగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. “చింత చెట్టు కదులుతుందంటే ఇదేం మాయ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “దీని వెనుక ఉన్న శాస్త్రం అర్థం చేసుకోవాలి” అని చెబుతున్నారు. మొత్తానికి, చింత చెట్టు కదలిక వెనుక కారణం వేరు పురుగు అయినా… దీన్ని చూసిన ప్రజల మనసులో మాత్రం ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోతోంది.
కదులుతున్న చింత చెట్టు.. దేవుడి మహిమే అంటున్న స్థానికులు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని ముదిరాజ్ కాలనీలో వింత ఘటన
ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య ఇంటి ఆవరణలో మొలిచిన చింత చెట్టు
చింత చెట్టు మొక్క అటు ఇటు తిరగడం చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు
రాఖీ… pic.twitter.com/pXI4q56XKC
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2025