ప్రతి కొడుకు దృష్టిలో నిజమైన హీరో తండ్రి. పుట్టినప్పటి నుంచి తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాడు. మంచి చెడులు ఆయన నుంచే నేర్చుకుంటాడు. కష్టాలను తట్టుకోవడం, సంతోషాలను పంచుకోవడం.. అన్నీ తండ్రిని చూసే తెలుసుకుంటాడు. కొడుకు భవిష్యత్ కోసం తండ్రి ఎంతో శ్రమిస్తాడు. తన జీవితాన్ని కూడా పిల్లల రేపటి కోసం అంకితం చేస్తాడు. అలాంటి తండ్రి కళ్లముందే చనిపోతే? ఏ కొడుకూ తట్టుకోలేడు. యూపీలోనూ ఓ యువకుడు సైతం తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తండ్రి పాడె మోస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు పెద్దలు.
కళ్ల ముందే తండ్రి మృతి
యూపీలోని కాన్పూర్ కు చెందిన లైక్ అహ్మద్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. మనువలు, మనువరాళ్లతో లైక్ సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా ఆయనకు ఆనారోగ్యం ఏర్పడింది. చూస్తుండగానే పరిస్థితి మరింత దిగజారింది. వెంటనే ఇద్దరు కుమారులు, అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో లైక్ అహ్మద్ చనిపోయాడు. ఈ విషయాన్ని డాక్టర్లు లైక్ కొడుకులకు చెప్పారు. కానీ, అతడి చిన్న అబ్బాయి అతిక్ ఈ విషయాన్ని తట్టుకోలేకపోయారు. డాక్టర్లు అబద్దం చెప్తున్నారంటూ, వెంటనే లైక్ ను వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా అతడిని పరీక్షించారు. తను చనిపోయాడని ధృవీకరించారు. అతిక్ గుండె పగిలినంత పని అయ్యింది. నాన్న మృతిని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు. అంబులెన్స్ లో తండ్రి డెడ్ బాడీనికి ఎక్కించిన దగ్గరి నుంచి ఇంటికి తీసుకెళ్లే వరకు ఏడుస్తూనే ఉన్నాడు.
తండ్రి పాడె మోస్తూ కొడుకు మృతి
తండ్రిని ఇంటికి తీసుకొచ్చాక కూడా అతిక్ ఏడుపు ఆపలేదు. ఏడ్చీ, ఏడ్చీ గొంతులో తడి ఆరిపోయింది. పెద్దలంతా కలిసి లైక్ అహ్మద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్మశానానికి పాడెతో బయల్దేరారు. తండ్రి పాడెమోస్తూ అతిక్ ఏడుస్తూనే ఉన్నాడు. కాసేపటికే ఆయనకు గుండెపోటు వచ్చింది. తండ్రి పాడె వదిలి కుప్పకూలి పోయాడు. వెంటనే అతడిని లేపి పక్కన కూర్చోబెట్టి, నీళ్లు తాగించారు. కొద్ది సేపట్లోనే అతిక్ కూర్చుకున్న దగ్గరే ప్రాణాలు విడిచాడు. ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. కొద్ది గంటల తేడాతో తండ్రీకొడుకులు చనిపోవడంతో విషాదంలో మునిగిపోయారు.
తండ్రి పక్కనే కొడుకు సమాధి
ఇక తండ్రితో పాటు కొడుకు అంత్యక్రియలకు నిర్వహించారు పెద్దలు. తండ్రి పాడె ముందు తీసుకెళ్తుండగా, కొడుకు పాడె వెనుక నుంచి తీసుకెళ్లారు. తండ్రి సమాధి పక్కనే కొడుకును పూడ్చి పెట్టారు. ఒకేసారి తండ్రి కొడుకులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. చినప్పటి నుంచి అతిక్ కు తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉండేదని, చివరకు మరణంలోనూ వారిద్దరు కలిసే వెళ్లారంటూ గుర్తుచేసుకున్నారు.
Read Also: పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!