100 Snakes In House| అర్ధరాత్రి వేళ ఆ గ్రామంలో అందరూ నిద్రపోతుండగా.. ఒక్కసారిగా ఒక రైతు ఇంట్లో అరుపులు, కేకలు.. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరి చూడగా.. షాకింగ్ దృశ్యం. ఆ రైతు ఇంట్లో నుంచి డజన్ల కొద్దీ పాములు కనిపించాయి. ఆ పాములతో ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఆ గ్రామస్తులు వాటిని చంపడం మొదలుపెట్టారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం గ్రామస్తులు తప్పు చేశారని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మీరట్ సమీపంలోని సిమౌలి గ్రామంలో ఒక నిశ్శబ్ద రాత్రి ఒక్కసారిగా భయానక చిత్రంలా మారింది. రైతు మహ్ఫూజ్ సైఫీ ఇంటి ఆవరణలో నుంచి అకస్మాత్తుగా వందల పాములు బయటకు రావడంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామస్తులంతా భయంతో గందరగోళానికి గురయ్యారు. ఆ తరువాత తమ ప్రాణాలకు హాని ఉందని భావించి గ్రామస్తులు ఒక్కటై ఆ సర్పాలను చంపేయాలని నిశ్చయించుకున్నారు.
రాత్రి నిద్రపోయే సమయంలో మహ్ఫూజ్ సైఫీ తన ఇంటి గుమ్మం వద్ద ఒక సర్పాన్ని చూశాడు. వెంటనే దాన్ని అతను చంపేశాడు. కానీ కొద్ది సేపట్లో మరొకటి, ఆ తర్వాత మరొకటి బయటకు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇంటి గుమ్మం సమీపంలోని రాంపు కింద నుండి డజన్ల కొద్దీ పాములు బయటకు రావడం చూసి అతను భయపడిపోయారు. అతని కుటుంబ సభ్యులు ఇది చూసి అరుపులు, కేకలు వేశారు. దీంతో గ్రామం అంతా ఈ వార్త వేగంగా వ్యాపించింది. కర్రలు, రాళ్లతో గ్రామస్తులు పాములపై దాడి చేసేందుకు వచ్చారు. రాత్రంతా గంటలపాటు పోరాడి, 50 కంటే ఎక్కువ పాములను చంపి, వాటిని కాల్చేసి సమీపంలో ఒక గుంత తవ్వి పాతిపెట్టారు.
గ్రామస్తులు తప్పు చేశారు.. అటవీ శాఖ అధికారుల వార్నింగ్
పాముల నుంచి గ్రామస్తులు తమను తాము రక్షించుకున్నారని భావించినప్పటికీ, వారు చట్టపరమైన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. వందకు పైగా పాములను గ్రామస్తులు చంపేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ శాఖకు సమాచారం అందింది. వెంటనే అధికారులు ఒక బృందాన్ని సంఘటన స్థలానికి పంపారు.
డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సర్పాలు 1972 వన్యప్రాణి రక్షణ చట్టం కింద రక్షిత జీవులని తెలిపారు. “ఆ పాములను చంపి, అటవీ శాఖకు సమాచారం ఇవ్వకుండా గుంత తవ్వి పాతిపెట్టడం తెలిసింది. ఇవి రక్షిత జీవులు, ఏదైనా చర్య తీసుకునే ముందు అటవీ శాఖకు తెలియజేయాలి,” అని అన్నారు.
ప్రాథమిక విచారణలో ఈ సర్పాలు విషం లేని నీటి సర్పాలుగా తేలింది, ఇవి సాధారణంగా కాలువలు, తడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని అధికారులు వెల్లడించారు.
ఎక్కువ సంఖ్యలో ఉన్న పాములను గ్రామస్తులు చంపేశారని వీడియో బాగా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దీని గురించి నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. అటవీ అధికారులు ఇప్పుడు గ్రామస్తులను విచారణ చేస్తున్నారు. ఎన్ని సర్పాలు చంపబడ్డాయి, ఎక్కడ పాతిపెట్టారో తెలుసుకుంటున్నారు. “మా బృందం సంఘటన స్థలంలో ఉంది, గ్రామస్తులను ప్రశ్నిస్తోంది,” అని డిఎఫ్‌ఓ తెలిపారు.
పాములు ప్రకృతి నియంత్రణలో ఓ భాగం. అవి ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తాయి, కీటకాలను నియంత్రిస్తాయి. వాటిని ఇలా భారీ సంఖ్యలో చంపడం పర్యావరణంపై ప్రభావం చూపవచ్చు అని అధికారులు అభిప్రాయపడ్డారు.
Also Read: పోలీస్ ఉద్యోగ పరీక్షల్లో భారీ స్కామ్.. ఆధార్ కార్డ్‌తో గుట్టు రట్టు
పాములు దాడి చేయకుండానే వాటిని గ్రామస్తులు చంపేయడం తప్పు అని.. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే అటవీ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద తగిన చర్యలు చేపడతామని అన్నారు.
मेरठ के समौली गांव में एक भाईजान के घेर मे एक दो नहीं पूरे 52 सांप निकले। सभी सांप (चेकर्ड कीलबैक वाटर स्नैक) प्रजाति के प्रतीत हो रहें थे जो जहरीले नहीं होते। इसके बावजूद भाईजान ने सभी 52 सांपों को लाठी से पीट पीट कर मार दिया। pic.twitter.com/PSUVD1J4yt
— shalu agrawal (@shaluagrawal3) June 2, 2025