Viral Video : ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ రిక్షా పెట్రోల్ బంక్‌లో ఉంది. బంక్ ఆపరేటర్ ఆ రిక్షాకు ఆయిల్ కొడుతున్నాడు. అదేంటి? రిక్షాకు ఫ్యుయల్ పోయడమేంటని దూరం నుంచి చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. దగ్గరికెళ్లి చూశాక కానీ అసలు విషయం తెలీలేదు. అది రిక్షానే.. వాళ్లు పోస్తున్నది పెట్రోలే.. కాకపోతే…
రియల్ రిక్షావోడు..
రిక్షా తొక్కడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. చెమటలు కక్కాల్సిందే. అందులోనూ లగేజ్ రిక్షా అయితే మరీ కష్టం. అంతంత బరువులను లాక్కెళ్లాలంటే ఎంతో ఎనర్జీ ఉండాలి. అసలే రిక్షా బతుకులు. వచ్చే ఆదాయం కొద్దిగానే. బలంగా ఉండాలంటే పుష్టిగా తినేంత సొమ్ము కూడా కావాలి. ఆ డబ్బే ఉంటే అలా రిక్షా ఎందుకు తొక్కుతారు ఎవరైనా? అందుకే రిక్షావోడు సినిమా సూపర్ హిట్ అయినా.. రిక్షా తొక్కేవాళ్ల జీవితాల్లో మాత్రం ఎప్పుడూ కష్టాలు, నష్టాలే. అయినా, ఈ రోజుల్లో అంత శ్రమ పడే వాళ్లు ఉన్నారా? సుఖంగా చేసుకునే పనులు అనేకం ఉండగా రిక్షా తొక్కే వాళ్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. అందుకే, ఓ వ్యక్తి కాస్త క్రియేటివ్‌గా ఆలోచించాడు. రిక్షాకు మోపెడ్ మోటార్ బిగించాడు. అదే ఆ వీడియో….
ఆంధ్రా రిక్షావాలా..
రిక్షాకు అమర్చిన మోటార్‌కు పెట్రోల్ కొట్టిస్తున్నాడు ఆ వ్యక్తి. ఆయిల్ పోయించుకున్నాక.. ఎంచక్కా బైక్ కిక్ కొట్టినట్టే ఆ రిక్షా ఇంజిన్‌ను స్టార్ట్ చేశాడు. ఒక్క కిక్కుకే మోటార్ ఆన్ అయింది. సైలెన్సర్ కూడా బిగించి ఉంది. అది డుగ్ డుగ్ డుగ్ అంటూ పొగలు కక్కుతోంది. ఆ ఇంజిన్‌ను రిక్షా చైన్‌కు లింక్ చేశారు. అయితే ఎక్స్‌లేటర్ గట్రా లేనట్టుంది. ఒకే స్పీడ్‌తో వెళ్తుంది కాబోలు. రిక్షాకు ఉన్న బ్రేకులతోనే ఆ బండిని కంట్రోల్ చేస్తున్నాడు. చాలా ఈజీగా నడిపేస్తున్నాడు.
ఆ ఐడియా అతని జీవితాన్నే..
ఆ మోటార్ రిక్షాలో తాను బస్తాలు తీసుకెళ్తానని చెబుతున్నాడు రిక్షావాలా. మరి డబ్బులు గిట్టుబాటు అవుతున్నాయా? అని అడిగితే పర్లేదు అని చెబుతున్నాడు. XL బండి ఇంజిన్‌ను రిక్షాకు అమర్చానని అన్నాడు. ఇంతకీ మైలేజ్ ఎంతో తెలుసా.. లీటర్‌కు 35 కిలోమీటర్లు. ఒక ఐడియా ఆ రిక్షావాలా జీవితాన్ని మార్చేసింది. ఆ పేదవాడి జీవితం కష్టం లేకుండా సాఫీగా సాగిపోతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్ వేయండి….
పెట్రోల్ బంకులో రిక్షాకి ఆయిల్ కొడుతున్నారు ఏంటా అని ఇంట్రెస్టింగ్ గా చూస్తే .. ఆ రిక్షాకి మోటార్ బిగించారు.. రిక్షా తొక్కితొక్కి అలసిపోయిన ఆ పేదవాడి ఇలా మోటార్ బిగించుకుని నడుపుకుంటున్నారు pic.twitter.com/910R8cXmXM
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) June 12, 2025