1000 Days Menstruation| మహిళలకు సాధారణంగా ప్రతి నెలా అంటే 27 నుంచి 35 రోజుల మధ్య రుతుక్రమం అవుతుంది. ఇలా జరగడం ఆరోగ్యకరమేనని వైద్యులు చెబుతారు. అయితే కొన్ని మహిళలకు హార్మోన్ల సమస్యల కారణంగా రెండు నెలలకు ఒకసారి లేదా అస్థిరమైన (ఇర్‌రెగ్యులర్) రుతుక్రమం ఉంటుంది. ప్రస్తుత జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చాలా టీనేజర్లు మరియు మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ ఒక మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతర రక్తస్రావం (లాంగ్ పీరియడ్ సైకిల్) జరగడం వల్ల తీవ్రమైన శారీరక, మానసిక కష్టం ఎదురైంది. జీవితంలో ఒక్కరోజైనా ఆ ఎరుపు రంగు కనిపించని రోజు ఉంటుందా? అంటూ ఆమె కన్నీటిలో మునిగి విలపిస్తోంది.
అమెరికాకు చెందిన టిక్‌టాక్ యూజర్ పాపీ తన వెయ్యి రోజులకుపైగా కొనసాగిన అసాధారణమైన రుతుక్రమం గురించి తన అనుభవాన్ని పంచుకుంది. వైద్యులను సంప్రదించినప్పటికీ, అది మిస్టరీగానే మిగిలిందని ఆమె వాపోయింది. సాధారణంగా మహిళలకు ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతుక్రమం వస్తుంది. రక్తస్రావం రెండు నుంచి ఏడు రోజుల వరకే ఉంటుంది. కొంతమంది మహిళలకు సరైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో ఇర్‌రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి కానీ అలాంటి సమస్యలు ఉన్నా.. 15 నుంచి 20 రోజుల వరకే రక్తస్రావం అవుతుంది.
ఇది సాధారణమైన సమస్యే. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం అవసరం. అలాగే పాపీకి కూడా వెయ్యి రోజులకుపైగా రక్తస్రావం కొనసాగింది. అంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు పీరియడ్స్ ఆగకుండా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఆమె పరిస్థితిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.
Also Read: 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు.. చివరకు అతడో దొంగ డాక్టర్ అని తెలిసి..
సమస్య తెలుసుకోవడానికి పాపీ.. పలు వైద్యపరీక్షలు చేయించుకుంది. అండాశయంపై తిత్తులు (సిస్టులు) ఉన్నాయని వైద్యులు గుర్తించారు కానీ వాటికి చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తీవ్ర రక్తస్రావం సమస్యకు మూలం ఇది కాదని వైద్యులు చెప్పారు. దీనివల్ల పాపీ శరీరంలో ఐరన్ విటమిన్ భారీగా తగ్గిపోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల బలహీనత వంటి సమస్యలతో బాధపడుతోంది.
పాపీకి పీసీఓసీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) ఉన్నట్టు గుర్తించినప్పటికీ, ఇంత అధికంగా రక్తస్రావం జరగడానికి అసలు కారణం అది కూడా కాదని స్పష్టమైంది. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భనిరోధక ఐయూడీ (IUD) కూడా అమర్చారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. అనేక వైద్యపరీక్షలు, చికిత్సలు, మందులు తీసుకున్నా తీవ్ర రక్తస్రావం ఆగలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్‌ఐ స్కానింగ్‌లలో కూడా అసలు కారణం కనబడలేదు.
టిక్ టాక్ లో సమస్య ఏంటో గుర్తింపు
ఇలాంటి పరిస్థితిలో పాపీ తన టిక్‌టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు అసలు కారణం తెలుసుకుంది. వాస్తవానికి ఆమెకు “బైకార్న్యుయేట్ యుటరస్” అనే అరుదైన సమస్య ఉన్నట్లు తెలిసింది. దీనిని “గుండె ఆకారపు గర్భాశయం” అని కూడా అంటారు. ఈ సమస్యలో గర్భాశయం ఒకటిగా కాకుండా రెండు గదులుగా వేరుపడిపోతుంది. ఇది నూటికి ఒకరిలో మాత్రమే కనిపించే అరుదైన పరిస్థితి. ఈ పరిస్థితి ఉన్న మహిళల్లో రక్తస్రావం ఎలా ఉంటుందో ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటుంది అని పాపీకి ఫాలోవర్ వివరించడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది.
ఇన్నాళ్ల తర్వాత తన సమస్యకు అసలైన కారణం తెలిసిందని పాపీ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ మూడు సంవత్సరాల కాలంలో దాదాపు 950 రోజులు ప్యాడ్లకే డబ్బులు ఖర్చు చేసి విసుగొచ్చిందని తెలిపింది. ఇప్పుడు అసలు కారణం తెలిసినందుకు.. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసేందుకు శస్త్రచికిత్స (సర్జరీ) గురించి తెలుసుకునే పనిలో ఉంది. ఈ శస్త్రచికిత్స విజయవంతమైతే ఇక ఎరుపు రంగు కనిపించని, స్వర్గంలాంటి రోజులు తనకు లభిస్తాయని పాపీ ఆశాభావంగా చెప్పింది.