Uber Desert Ride Camel| యుఎఇ దేశంలో దుబాయ్ ని పర్యటించడానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దుబాయ్ అంటే ఆకాశాన్ని అంటే భవనాలు, అడ్వాన్సడ్ టెక్నాలజీ కట్టడాలు, ఎడారి సఫారీలో బెల్లి డాన్స్, విలాసవంతమైన జీవనశైలికి మారుపేరు. ఇన్ని ప్రత్యేకతలున్న దుబాయ్ లో కొత్తగా మరొకటి చేరింది. ఆ ప్రత్యేకత గురించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోకమానరు. వైరల్ వీడియోలో ఇద్దరు మహిళలు దుబాయ్ ఎడారి మధ్యలో దారితప్పిపోయినట్లు కనిపిస్తోంది. కానీ వారు అక్కడి నుంచి వెళ్లడానికి ఊబర్ యాప్ లో బుకింగ్ చేసుకున్నారు. దీంతో అక్కడికి ఒక ఊబర్ డ్రైవర్ వచ్చాడు. షాకింగ్ విషయం ఏంటంటే అతను కారు, బైక్ లాంటివి తీసుకరాలేదు. ఒక ఒంటె తీసుకువచ్చాడు.
ఎడారిలో ఒంటె సవారీ అదీ ఊబర్ లోనా?
దుబాయ్ అల్ హత్తా రోడ్ సమీపంలోని అల్ బదయేర్ ఎడారి ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లిన ఇద్దరు యువతులు దారితప్పిపోయారు. ఇద్దరి వద్ద అక్కడి నుంచి వెళ్లడానికి ఎటువంటి వాహనం లేదు. కానీ ఆ ప్రాంతంలో అదృష్టవశాత్తు ఫోన్ నెట్ వర్క్ ఉంది. దీంతో వారిద్దరిలో ఒక యువతి ఊబర్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఊబర్ యాప్ ఓపెన్ చేయగానే అక్కడి నుంచి రవాణా కోసం రెండు వాహనాల ఆప్షన్లు కనిపించాయి. ఒకటి ఎటివి బైక్, మరొకటి ఒంటె సవారి.
ఈ ఒంటె సవారీ, ఎటివి బైక్ చూసి ఆ యువతులిద్దరూ షాక్ కు గురయ్యారు. దీంతో వారు ఒకసారి ఒంటె సవారీ కోసం ఆర్డర్ చేశారు. ఆశ్చర్యంగా కాసేపు తరువాత ఒక యువకుడు ఒక ఒంటె తీసుకొని అక్కడికి చేరుకున్నాడు. అది చూసి ఈ సదుపాయాలు కూడా నిజంగా ఉన్నాయా? అని ఆశ్చర్యంగా ముఖాలు పెట్టారు.
Also Read: చిమ్నీలో చిక్కుకున్న క్రిస్మస్ శాంటా క్లాజ్.. పోలీసుల నుంచి తప్పించుకోబోయి..
వీడియోలో ఒక యువతి మాట్లాడుతూ.. “మేమిద్దిరం ఎడారిలో దారితప్పిపోయాం. అయితే నెట్ వర్క్ ఉండడంతో ఫోన్ లో ఊబర్ యాప్ ఓపెన్ చేసి చూశాం. ఆశ్చర్యంగా ఒంటె ని బుక్ చేసుకోవచ్చు అని కనిపించింది. ఒక కారు బుక్ చేసుకోవడం లాగే ఒంటెని బుక్ చేసుకున్నాం. కాసేపు తరువాత ఒక వ్యక్తి మా వద్దకు చేరుకున్నాడు. అతని వెంట ఒక ఒంటె ఉంది. అది చూసి నిజంగా నమ్మశక్యం కాలేదు.” అని చెప్పింది.
ఎడారిలో ఒంటె సవారీ చూసి సోషల్ మీడియాలో నెజిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇన్ స్టగ్రామ్ లో జెట్‌సెట్ దుబాయ్ అకౌంట్ లో ఉన్న వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. దీనిపై వేల సంఖ్యలో రియాక్షన్లు కనిపిస్తున్నాయి. ఇందులో కొందరైతే ఇదంతా నిజమా లేక వీడియో కోసం అలా ఫేక్ చేశారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఒక యూజర్ అయితే.. “ఊబర్ లో ఇక ఎగిరే కార్పెట్ (చాప) వస్తుందేమో సినిమాల్లో లాగా. నిజజీవితంలో ఇది చూస్తేనే నేను నమ్ముతాను. ఆ ఒంటె డ్రైవర్ కు కొన్ని ఖర్జురాలు టిప్స్ కింద ఇవ్వాల్సింది.” అని రాశాడు. ఇంకొక వ్యక్తి అయితే.. “ఇందుకే నాకు దుబాయ్ అంటే చాలా ఇష్టం. అక్కడ అన్ని ఆశ్చర్యపోయే విధంగానే ఉంటాయి.” అని కామెంట్ చేశారు.