Viral News: ప్రస్తుతం సోషల్ మీడియాలో గుర్తింపు కోసం.. యువత ఎలాంటి రిస్క్‌కైనా వెళ్తోంది. ముఖ్యంగా రీల్స్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే స్థితికి చేరింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. ప్రాణాలకే విలువ లేకుండా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది.. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. పాపులారిటీ సంపాదించేందుకు రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తున్నారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో రీల్స్ కోసం తీసే వీడియోలు, వాటిలో చేసే ప్రమాదకర స్టంట్స్, రోడ్లపై ప్రమాదాలు కలిగించే స్థాయికి చేరుకున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో.. ఏకంగా ఎనిమిది మంది యువకులు.. ఓ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ.. హెల్మెట్ లేకుండా వేగంగా బైక్ నడుపుతూ.. రీల్స్ కోసం స్టంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం అర్ధరాత్రి సమయంలో 1.30 గంటల సమయంలో.. ఎనిమిది మంది యువకులు.. శంషాబాద్ నుంచి అరాంఘర్ వైపు పయనమయ్యారు. బైక్ పై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు ప్రయాణంచేస్తూ రీల్స్ చేశారు. ప్రమాదభరితంగా స్టంట్‌లు చేశారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు వాహనదారులు.. యువకులు ప్రయాణిస్తున్న ప్రమాదకర రీతిని.. వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు వెళ్లే ఈ రోడ్డు.. నిత్యం రాత్రిసమయంలో రద్దీగా ఉంటుంది.
ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు..రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు.. సీసీకెమరాల ఆధారంగా నిందులను గుర్తించారు.
Also Read: గ్యాస్ సిలిండర్ లీక్.. భారీ పేలుడు, కుటుంబ సభ్యులు పరుగో పరుగు, వైరల్ వీడియో
ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన 8 మంది యువకులను.. అదుపులకు తీసుకొని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో కొంత మంది మైనర్‌లు ఉన్నట్లుగా.. రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిఐ రాజేంద్ర గౌడ్ పేర్కొన్నారు.