కొన్ని సరదా సరదా విషయాలే కొన్నిసార్లు ప్రాణాలు పోయేలా చేస్తాయి. ఎంతో ఇష్టపడే జంతువులే ప్రాణాలు తీస్తాయి. కావాలని చేయకపోయినా, పొరపాటుగా చేసే పనులు చివరికి తీవ్ర విషాదాన్ని మిగిల్చుతాయి. తాజాగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క పిల్ల కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కొత్తగూడెం పరిధిలోని ఏడూళ్ల బయ్యారానికి చెందిన సందీప్ అనే 25 ఏళ్ల యువకుడు 2 నెలల క్రితం ఓ చిన్న కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. దానిని మచ్చిక చేసుకుందామని, పాలు పోసి తాగించే ప్రయత్నం చేశాడు. తన తల్లి నుంచి దూరం చేశాడనే కోపంతో అది సందీప్ వాళ్ల నాన్నను కరిచింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కుక్క పిల్ల కాలి గోరు సందీప్ కు గుచ్చుకుంది.
కుక్క కరవడంతో సందీప్ వెంటనే అతడి తండ్రిని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. సమయం ప్రకారం ఇంజెక్షన్లు వేయించాడు. అయితే, తనకు కేవలం గోరే గుచ్చుకుంది కదా అని లైట్ తీసుకున్నాడు. తాజాగా అతడికి అనారోగ్యం కలగడంతో హాస్పిటల్ కు వెళ్లాడు. డాక్టర్లు అతడికి పరీక్షలు చేసి షాకింగ్ విషయాన్ని చెప్పారు. రేబిస్ వ్యాధి సోకిందన్నాఉ. బతకడం కష్టమని తేల్చేశారు. ఒక్కసారిగా సందీప్ కుప్పకూలిపోయాడు. డాక్టర్లు ఆయను హాస్పిటల్ లో చేర్చుకుని చికిత్స అందించడం మొదలు పెట్టాడు. చికిత్స పొందుతూనే సోమవారం నాడు హాస్పిటల్ లో చనిపోయాడు సందీప్. ప్రేమగా పెంచుకుందామని తెచ్చుకున్న కుక్కపిల్ల తన కొడుకు ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు రోదించడంతో హాస్పిట్ లోని వాళ్లంతా కంటతడి పెట్టారు.
Read Also: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?
కుక్కకాటు విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కుక్క దాడితో రక్తం రాకపోయినా రేబిస్ సోకే అవకాశం ఉందన్నారు. కుక్క ఏ రకంగా దాడి చేసినా, హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోవడం ఖాయం అంటున్నారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కచ్చితంగా టీకాలు వేయించాలని సూచిస్తున్నారు.
Read Also: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!