Vizag: విశాఖ సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. పీజీ మెడికల్ స్టూడెంట్ శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలియగానే వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ విచారణకు ఆదేశించారు. మృతురాలి సొంతూరు హైదరాబాద్. దీంతో స్టూడెంట్ ఆత్మహత్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
కారణాలు ఏమైనా కావచ్చు.. విశాఖ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న స్టూడెంట్ శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. చినవాల్తేరులో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ త్రీటౌన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల శ్రావణి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం రీత్యా కువైట్‌లో ఉంటున్నారు. ఆంధ్ర వైద్య కళాశాలలోని ఈఎన్టీ విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
చిన్నవాల్తేరులోని కోయవీధిలోని ఓ గది అద్దెకు తీసుకుని చదువుతోంది. ఆమె సోదరి దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. తనకు పీజీ చదవాలని లేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానని శ్రావణి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సర్టిఫికెట్లు ఇప్పించాలని శ్రావణి.. ప్రిన్సిపాల్‌ను కోరారు. సోమవారం సర్టిఫికెట్లు ఇస్తామని ప్రిన్సిపాల్ చెప్పారు. సర్టిఫికెట్లు తీసుకునేందుకు శ్రావణి సోమవారం కళాశాలకు రాలేదు. దీంతో ప్రిన్సిపాల్ మరొక విద్యార్థినిని శ్రావణి ఉన్న రూమ్‌కు పంపించారు. తోటి స్టూడెంట్ కిటికీలోంచి చూడగా శ్రావణి ఉరి వేసుకుని కనిపించింది.
వెంటనే ఈ విషయాన్ని కళాశాలకు చెప్పింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు ముందు శ్రావణి రాసినట్టు భావిస్తున్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. మరణానికి బలమైన కారణం ఉందని రాసుకొచ్చింది శ్రావణి. ఆ విషయం తనతో ఉంటుందని, ఎవరికీ తెలియనవసరం లేదని రాసినట్టు సమాచారం. మరోవైపు శ్రావణి మృతి చెందిన విషయం ఆమె తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం- పోలీసులు సమాచారం ఇచ్చారు.
ALSO READ: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య ఘటన తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్‌కు మంత్రి సత్యకుమార్ ఆదేశాలు ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.