
Vizag Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు వందకు పైగా మరబోట్లు దగ్ధమయయాయి. రాత్రి 12 గంటల ప్రాంతంలో జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. మొదట ఒక బోట్‌లో చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. ఇది ఎవరో కావాలనే చేసుంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్‌లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికిచేరాయి. లక్షల రూపాయలు విలువ చేసే మత్స్య సంపద ఆ బోట్లలోనే ఉంది. సోమవారం ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని బాధిత మత్స్యకారులు చెబుతున్నారు .
ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో మత్స్యకారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. అందుబాటులో ఉన్న ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. అనంతరం మరికొన్ని ఫైరింజన్లను రప్పించారు.
ఎగిసిపడుతున్న మంటలకు సముద్ర గాలులు మరింత ఆజ్యం పోసినట్లైంది. గాలులకు మంటలు మరింతగా ఎగిసిపడుతూ.. పక్కనున్న బోట్లకు విస్తరించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మత్సకారుల్లో కొంతమంది ధైర్యంగా వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంత మేర నష్టం తగ్గింది.
ఈ అగ్నిప్రమాదంలో సుమారు 30 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రాత్రి పూట బోట్లలో మత్స్యకారులు ఎవరూ ఉండరు.. కానీ ప్రమాద సమయంలో వాటిలో ఎవరైనా ఉండిపోయారా అనేది తెలియరావడం లేదు. కళ్లముందే తమ జీవనాధారమైన బోట్లన్నీ మంటల్లో కాలిపోవడంతో మత్స్యకారులు, వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
.
.
.