AP News : 11 ఏళ్ల చిన్నారి. చర్చిలో చనిపోయి ఉంది. ముఖానికి చున్నీ చుట్టి ఉంది. నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. ప్రార్థనల కోసం తీసుకెళ్లిన ఆ బాలికకు అసలేమైంది? ఎలా చనిపోయింది? ఎవరు చంపారు? బలి ఇచ్చారా? బలవంతం చేశారా? విశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది ఆ పాప మరణం.
అసలేం జరిగిందంటే..
విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన 11 ఏళ్ల పూర్ణచంద్రిక ఐదో తరగతి చదువుతోంది. బాలికకు గాలి సోకిందని.. తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సరస్వతి కలిసి జ్ఞానపురం చర్చికి తీసుకొచ్చారు. చిన్నారి మానసిక స్థితి బాగాలేదని.. ప్రత్యేక ప్రార్థన చేయాలని చర్చి సిబ్బంది తెలిపారు. కాసేపు ప్రార్థనలు చేసి.. మరో ప్రార్థనా మందిరానికి పంపించారు. అయితే, వారు అక్కడినుంచి తిరిగి వచ్చి జ్ఞానపురం చర్చిలోనే ప్రార్థనలు కొనసాగించారు. అందుకు ఆ చర్చి సిబ్బంది అంగీకరించలేదు. ప్రార్థనలు ముగించాలని సూచించినా.. తల్లి-అమ్మమ్మ పట్టించుకోలేదు. చర్చి వాచ్‌మెన్ మృతురాలి తల్లిని బెదిరించినట్టు తెలుస్తోంది. కట్ చేస్తే.. సాయంత్రం 6 గంటలకు బాలిక డెడ్ బాడీ చర్చి ప్రాంగణంలో కనిపించింది. బాలిక ముఖంపై గాయాలు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
చిన్నారిని కొట్టి చంపారా?
బాలికకు దెయ్యం పట్టిందని నమ్మిన తల్లి, అమ్మమ్మ బాలికను శారీరకంగా హింసించినట్టు తెలుస్తోంది. ఆమెను కొట్టినట్టు.. జుట్టు పట్టుకొని లాగినట్టు చెబుతున్నారు. ఆ దెబ్బలు తట్టుకోలేక చిన్నారి చనిపోయిందని అంటున్నారు. బలి ఇచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తనకు తెలియకుండా తన కూతురును చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నింస్తున్నారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి.. ఆమె స్వగ్రామం విజయనగరం జిల్లాకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.