Jagan Latest News: నవరత్నాల హామీలతో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అధికారం శాశ్వతమని కలలు గన్నారు. తీరా చూస్తే ఊహించని పరాజయం మూటగట్టుకుని.. పార్టీని స్థాపించిన నాటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా దక్కదని తెలిసి కూడా దాని కోసం మంకుపట్టు పడుతున్న జగన్ వైఖరితో విసిగిపోయి వైసీపీ నేతలు ఒకరొకరుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఏదేమైనా అయిదేళ్లు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన వైసీపీ అధ్యక్షుడికి ఈ ఏడాది పెద్ద పీడకలే మిగిల్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత జగన్‌కి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలిన సంవత్సరం 2024 అనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన వైసిపి 2024 లో కుప్ప కూలింది. వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు సిద్ధమంటూ వెళ్లిన జగన్ అండ్ కో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను సాధించలేకపోయింది. ఏడాది ముగుస్తూ.. కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నా ఇప్పటికీ కొందరు నేతలు ఆ షాక్ నుండి బయటపడలేకపోతున్నారు.
తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ తనను ముఖ్యమంత్రి చేయలేదని అలిగిన జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నారు. వైసీపీ స్థాపించాక జగన్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళొచ్చారు. 16 నెలలు బయట లేకపోయినా జగన్ పై పార్టీ కేడర్ విశ్వాసం కోల్పోలేదు. అప్పట్లో చెల్లెలు షర్మిల, అమ్మ విజయమ్మ జగన్‌కు అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైనా జగన్ ఢిలా పడలేదు.
అప్పట్లో ఆయన పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు టిడిపిలోకి జంప్ అయినా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. ఒక్క ఛాన్స్ నినాదంతో 2019లో విజయం సాధించారు. అయితే ఐదేళ్లు సంక్షేమం మీద మాత్రమే ఎక్కువ గా దృష్టి పెట్టి.. అభివృద్దిని పూర్తిగా విస్మరించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడంతో పాటు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా పోయి, సలహాదారుల పెత్తనం ఎక్కువైపోవడంతో జగన్‌ని ప్రజలకు దూరం చేశాయి.
Also Read: ప్లాన్ అట్టర్ ప్లాప్.. అయోమయంలో జగన్
జగన్ మెప్పు పొందడానికి కొంతమంది నేతలు వాడిన భాష ప్రజల్లో పార్టీని చులకన చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై మీడియా ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడటం, మూడు రాజధానుల ప్రహసనం వైసీపీ పట్ల ఓటర్లలో వ్యతిరేకత మరింత పెంచింది. దాంతో 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. అయితే తక్కువలో తక్కువ 90 నుంచి 100 సీట్లు వస్తాయని అంచనాలు వేసిన వైసీపీ పెద్దలను షాక్‌కు గురి చేస్తూ 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కకుండా పోయింది.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి నేతలు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారంటూ జగన్ పై తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఆయన బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి, సన్నిహితులు మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని సహా సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ లాంటి కీలక నేతలు వైసిపిని వదిలిపెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన చాలామంది కేసులు ఎదుర్కొంటుంటే మరి కొందరు వాటికి భయపడి పరారీలో ఉన్నారు.
ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వారు ఎదుర్కొంటున్న ఆరోపణలకు, కేసులకు ప్రజల నుండి సానుభూతి దక్కడం లేదు. జగన్ పాలనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ కూడా స్వయంగా జగనే ఇచ్చుకోవాల్సి వస్తుంది. వైసిపి ట్రబుల్ షూటర్ల గా పేరు కీలక నేతలు వారి వారి వ్యక్తిగత ఇబ్బందులతో, కేసులతో తమ పాట్లు తాము పడుతున్నారు. దీనితో ఎలా చూసినా 2024 వైసీపీ కి ఒక పీడకలే అని చెప్పాలి.
ప్రస్తుతం వైసీపీ ఆశలన్నీ 2025 పైనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిపోవడంతో వారు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రజలతో కలిసి పోరాటం చేయడానికి జగన్ పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో సంక్రాంతి తర్వాత ప్రజల్లో ఉండడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో సీట్ల పరంగా చాలా తక్కువే వచ్చినా ఓట్ షేర్ 40శాతం ఉండడం జగన్‌కు భరోసా ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ నమ్మకంతోనే ప్రభుత్వంపై పోరాటానికి ఆయన రెడీ అవుతున్నారు. మరి కొత్త ఏడాదిలో జనం బాట పడుతున్న ఆయనకు ఏ మాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి.