Vizag News: ఆ యువకుడి పుట్టినరోజే, చివరి రోజుగా మారింది. కోటి ఆశలతో తన లక్ష్యం వైపు అడుగులు వేసిన ఆ యువకుడు అవే చివరి అడుగులని గుర్తించలేక పోయాడు. ఓ వైపు తన లక్ష్యం ఆమడ దూరంలో ఉండగానే, స్పృహ తప్పాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. చివరికి పుట్టినరోజు నాడే తనువు చాలించాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖలో గురువారం జరిగింది.
విశాఖపట్నంలోని ఏఆర్ గ్రౌండ్స్ లో కానిస్టేబుల్ ఇంటికి ప్రక్రియ జరుగుతోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఎంపిక ప్రక్రియకు హాజరవుతున్నారు. అదేవిధంగా వైజాగ్ కు చెందిన శ్రవణ్ కుమార్ సైతం ఎంపిక ప్రక్రియకు హాజరయ్యాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త దుస్తులు ధరించి, తనకిష్టమైన దేవునికి మొక్కుకున్నాడు. కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో అంతా సవ్యంగా జరగాలని మొక్కుకున్న అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని సైతం పొందాడు. ఆ తర్వాత 1600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు.
పరుగు పందెంలో చివరి గీత వద్దకు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా శ్రవణ్ కుమార్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అంబులెన్స్ సహాయంతో శ్రవణ్ కుమార్ ను వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ శ్రవణ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీస్ కావాలన్న లక్ష్యంతో పుట్టినరోజు నాడు, ఎంపిక ప్రక్రియకు హాజరై తమ కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. అలాగే ఎంపిక ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు సైతం శ్రవణ్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: AP Schemes: ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఆ పథకాలకు గ్రీన్ సిగ్నల్?
పోలీస్ కావాలన్న కోరిక తమ కొడుకుకు ఉండేదని, అందుకే నిరంతరం సాధన చేసేవాడని శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులు తెలిపారు. ఏదిఏమైనా పుట్టినరోజు నాడే శ్రవణ్ కుమార్ మృతి చెందడంతో, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు శ్రవణ్ కుమార్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.