AP Schemes: ఏపీ కేబినెట్ సమావేశం వచ్చే నెల 6న జరగనుంది. ఈ సమావేశంలో కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో బిజీగా ఉండగా, రావడం రావడమే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిన సీఎం చంద్రబాబు వాటిలో దీపం 2.0 పథకాన్ని అమలు చేశారు. అలాగే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రహదారుల అభివృద్దికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండ ఉన్నత పాఠశాలల వరకు పరిమితమైన మధ్యాహ్న భోజనం స్కీమ్ ను ఇంటర్ కు పొడిగించారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లో నగదు జమ చేశారు. అంతేకాదు రూ. 6600 కోట్ల రూపాయల వివిధ బకాయిలను కూడ క్లియర్ చేసినట్లు ప్రభుత్వం తెలుపుతోంది.
ఈ దశలో సూపర్ సిక్స్ హామీల అమలుపై వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలకు పదును పెట్టాయి. దీనితో సాక్షాత్తు సీఎం చంద్రబాబు విమర్శలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, అందులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఓ వైపు రాష్ట్ర రాజధాని నిర్మాణం, మరోవైపు అభివృద్ది, ప్రజా సంక్షేమం కొనసాగిస్తామంటూ చంద్రబాబు అన్నారు. ఇటీవల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే ఈ పర్యటనలో ఎన్నో కోట్ల పెట్టుబడులను సాధించడమే కాక, ప్రపంచ స్థాయి కంపెనీలు ఏపీవైపు అడుగులు వేసేలా చర్చలు జరుపుకున్నారు.
Also Read: Train Journey: రైలులో కునుకు తీస్తున్నారా.. ఇలా చేయండి.. అలా చేయకండి!
విదేశీ పర్యటన ముగించుకున్న అనంతరం మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్, రైతులకు అందించే ప్రోత్సాహం, ఇలా ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. వాట్సాప్ ద్వార ఏకంగా 150 సేవలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈమేరకు ఇప్పటికే వాట్సప్ సంస్థతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం, ప్రజలకు అన్ని రకాల సేవలు మరింత చేరువ చేయనుంది. కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగకుండ, రెవిన్యూ, సచివాలయం ద్వార అందే సేవలను మొబైల్ ద్వారానే ప్రజలు పొందే అవకాశం దీని ద్వార కలుగుతుంది. ఈ కేబినెట్ భేటీలో మరిన్ని అభివృద్ది అంశాలతో పాటు సూపర్ స్కీమ్ పథకాల అమలుపై చర్చించి కీలక ప్రకటనను ప్రభుత్వం చేసే అవకాశం ఉందని సమాచారం.