Vidadala Rajini: మంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారం చెలాయించి, కలెక్షన్ క్వీన్ అనిపించుకున్న మాజీ మంత్రి విడదల రజినికి ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. అక్రమ వసూళ్లలో ఆమెకు సహకరించిన అధికారులు కూడా కేసుల చట్రంలో చిక్కుకుంటున్నారు. స్టోన్ క్రషర్ ఓనర్లను బెదిరించి కోట్లు వసూలు చేసినట్లు రజిని అండ్ టీమ్‌పై వారు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమె విచారణకు విచారణకు అనుమతి కోసం ఏసీబీ గవర్నర్‌కు లేఖ రాసింది. ఇప్పటికే ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో వారిలో త్వరలో కేసు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో అరెస్టుల పర్వంలో నెక్ట్స్ రజినినే అంటున్నారు
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. మాజీమంత్రి విడదల రజినిపై ACB అధికారులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయంలో రజిని ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల కారణంగా కేసు నమోదు చేశారు. బాధితుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిర్యాదు చేయడంతో.. విడదల రజినిని, అప్పటి రీజనల్ విజిలెన్స్ అధికారి జాషువాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ఏ1 గా రజిని, ఏ2 గా జాషువాను చేర్చారు.
ఈ అక్రమ వసూళ్లు సంబంధించి ఐఏఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడదల రజినిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం అది అక్కడ పెండింగ్‌లో ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశముందంటున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కేసు నమోదు చేయనున్నారు.
శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రూ.5కోట్లు డిమాండు చేసి.. రూ.2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజినికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా.. కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులు ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు.
2020 సెప్టెంబరు 4న అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ రామకృష్ణ… శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీచేశారంట. అప్పటికి రజినికి జగన్ ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేగానే దందాలు మొదలు పెట్టిన రజినిని క్రషర్ ఓనర్లు కలవగా.. క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశారంట. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్‌లో తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని, రూ.50కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు.
కొన్నాళ్ల తర్వాత జాషువా వారికి ఫోన్‌చేసి విడదల రజిని చెప్పినట్లు చేస్తారా? లేదా రూ.50 కోట్ల జరిమానా విధించి.. క్రషర్ సీజ్ చేసేయాలా? అని బెదిరించారంట. కొన్నాళ్ల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని, త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొంది .జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్‌క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందంట. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని బెదిరించారంట. ఆ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి నివేదించడంతో దాని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయనుంది.
Also Read: జగన్‌కి మోడీ ఝలక్..! ఏ క్షణమైనా బెయిల్ రద్దు
వైసీపీ హయంలో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి రాగానే ప్రకటించారు. అయితే గతంలోలా కక్షపూరిత చర్యలు ఉండవని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు కూడా సమన్వయం పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లు పదేపదే సూచిస్తూ వచ్చారు. అయితే నెలలు గడిచిపోతున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.
వారి అసంతృప్తికి చెక్ పెడుతూ కూటమి సర్కారు విచారణలు స్పీడప్ చేయించి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. వైసీపీ నేతల అరెస్టుల పర్వం స్టార్ట్ అయింది. పక్కా ఆధారాలతో కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. బూతులతో చెలరేగిపోయిన పోసాని కృష్ణమురళీని అరెస్ట్ చేసి విచారణలకు రాష్ట్రంలోని పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇక ఇప్పుడు విడదల రజిని వంతు వచ్చింది. ఆమె విచారణకు గవర్నర్ అనుమతి లభిస్తే అరెస్ట్ లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది.