
Akhila Priya Vs AV Subbareddy(Andhra Pradesh News Today) : భూమా కుటుంబానికి ఒకప్పుడు ఏవీ సుబ్బారెడ్డి అత్యంత ఆప్తుడు. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ప్రాణస్నేహితులుగా మెలిగారు. నాగిరెడ్డి బతికున్నంత వరకూ అన్నీ తానై ఏవీ వ్యవహరించారు. నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబంతో ఏవీ సుబ్బారెడ్డికి క్రమంగా దూరం పెరిగింది. ఆ దూరం వైరంగా మారింది. ఆ వైరం దాడులకు దారితీసింది.
ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టిన ఏవీ.. ఇక తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. నంద్యాల లేదా ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకూ ఈ రెండు వర్గాల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.
ఆధిపత్య పోరు పెరగడంతో ఏవీ సుబ్బారెడ్డిని అంతం చేయాలని అభిలప్రియ వర్గం ప్లాన్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. అఖిలప్రియ భర్త నేతృత్వంలో సుబ్బారెడ్డి హత్యకు ప్లాన్ చేయడాన్ని కడప జిల్లా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనమైంది. నాటి నుంచి రెండు వర్గాల మధ్య కక్షలు మరింత పెరిగాయి. ఎక్కడ ఎదురుపడినా బాహాబాహీకి దిగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకే కచ్చితంగా టికెట్ వస్తుందన్న ధీమాతో సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని లోకేష్ పాదయాత్ర ద్వారా అందరికీ తెలియజేయాలని భావించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఘర్షణ జరిగిన సమయంలో భూమా అఖిలప్రియ కూడా అక్కడే ఉన్నారు.
అఖిలప్రియకు టికెట్ దక్కదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ఏవీ సుబ్బారెడ్డి కూడా కారణమని ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలపై ఆధిపత్యం చెలాయించడానికి ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నించడంతో పరిస్థితి దాడుల వరకు వెళ్లింది. ఈ గొడవలు ఎన్నికల సమయానికి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం వారి మధ్య ఎలాంటి సయోధ్య కుదుర్చుతుందో చూడాలి మరి.