AP land pooling 2025: ఏపీ రాజధాని అమరావతి మరోసారి ప్రణాళికలతో చర్చల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా 45 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమైంది. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ జూలై నెలాఖరులోపు విడుదల కాబోతున్నట్టు సమాచారం. 2015 భూసేకరణ విధానాలే అమలులోకి రానున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
అమరావతి పునర్నిర్మాణంలో మరో పెద్ద అడుగు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని విస్తరణలో భాగంగా ప్రభుత్వం దాదాపు 45,000 ఎకరాల భూమిని పొల్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయానికి, 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్‌కి, అలాగే 2,500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించనున్నారు. మిగిలిన భూమిని రోడ్లు, హౌసింగ్, విద్యా సంస్థలు, ఆరోగ్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు.
ఈ భూసేకరణ ప్రక్రియలో 2015 నాటి భూసేకరణ నిబంధనలునే మళ్లీ అమలులోకి రానున్నాయి. రైతులకు 100% న్యాయమైన పరిహారంతో పాటు, ప్లాట్ రూపంలో అభివృద్ధి చెందిన స్థలాన్ని అందజేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 2015లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలుచేసిన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే సంబంధిత మండలాల్లో నివేదికలు సేకరించేందుకు పని ప్రారంభించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు అధికారుల బృందాలు భవిష్యత్ ప్రణాళికలపై అవగాహన కల్పిస్తున్నారు. అమరావతిని ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ అభివృద్ధి ప్రణాళికను వేగవంతం చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో నేరుగా విదేశీ పెట్టుబడులు, పర్యాటక ప్రోత్సాహం, ప్రపంచ వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయని అంచనా. ఎయిర్ కార్గో సేవలు, మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటుకు ఈ ప్లాన్ తోడ్పడుతుంది. ఇక స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టుతో ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అనేక కంపెనీలు రావడానికి వీలవుతుంది. దీనివల్ల స్థానికంగా వేలాది ఉద్యోగాలు కల్పించగలమని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.
స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుతో అంతర్జాతీయ క్రీడాకారులు, కోచింగ్ అకాడెమీలు, ప్రాక్టీస్ స్టేడియంలు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని కేంద్రంగా చేసుకుని క్రీడా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇది దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చెందవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే రాజధాని రైతులు, కొన్ని ప్రాంతీయ సంఘాలు ఈ అభివృద్ధి నిర్ణయంపై మిశ్రమంగా స్పందిస్తున్నాయి. కొందరు అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నా, మరికొందరు పునరావాసం, భూముల భద్రతపై ప్రశ్నలు వేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈసారి పూర్తి పారదర్శకంగా, చట్టబద్ధంగా భూసేకరణ జరుగుతుందని హామీ ఇస్తున్నారు.
ఈ ప్రాజెక్టుతో అమరావతి పునర్నిర్మాణానికి గాలి వేగం రానుంది. ముఖ్యంగా ఆర్ధికరంగ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పట్టణీకరణ మోతాదు పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. Amaravati 2.0గా అభివృద్ధి చెందే అవకాశం ఇదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.