Amaravati Relaunch: ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి(Amaravati) రూపుదిద్దుకుంటోంది. రాజధాని పనుల పునఃప్రారంభానికి సర్వం సిద్ధమయింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగే మోడీ పర్యటనకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
“ఈ నేపథ్యంలో సభావేదికవద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆర్షణీయంగా నిలిచాయి. బుద్దుడు, కాలచక్రం, ఎన్టీఆర్, ప్రధానీ మోదీ, విగ్రహాలతో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆకట్టుకున్నాయి. దీంతో పాటు అమరావతి అక్షరాలను రూపొందించారు. వీటిని ఐరన్ స్క్రాప్‌తో శిల్పి కాటూరి వెంకటేశ్వరావు తీర్చిదిద్దారు.”
కాగా.. ఇప్పటికే కేరళ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. దీంతో అమరావతిలో పూర్తి సందడి వాతావరణం నెలకొంది. వేలాది మంది ప్రజలు అమరావతికి చేరుకోగా.. లక్షల మంది అమరావతి బాటలో ఉన్నారు.
ఏపీ ప్రజల ఆశలు నెరవేరడానికి తొలి అడుగు పడుతుంది. 57 వేల కోట్లతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. అదే సమయంలో 20 అడుగుల ఎత్తైన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అమరావతి, ఏపీని సూచించేలా ఆంగ్ల అక్షరం A ఆకారంలో పైలాన్‌ను డిజైన్ చేశారు.
ఇక మోడీ ప్రసంగించే ప్రధాన వేదికపై కేవలం 14 మందికే అనుమతి ఇచ్చారు. 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరవుతున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరందరికి కోసం కావాల్సిన ఏర్పాట్లను చేశారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక మోడీ పర్యటన నేపథ్యంలో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
మద్యాహ్నం 2 గంటల 55 నిముషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లో సచివాలయం వద్ద హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇక 3 గంటల 20 నిముషాలకు ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు మోడీ. 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకూ అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోంటారు మోడీ.
Also Read: అమరావతిలో 20 అడుగుల పైలాన్.. ప్రత్యేకత ఇదే..
ఇదిలా ఉంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి, విజయవాడ ఏరియాలు నిఘా నీడలోకి వెళ్లిపోయాయి. మోడీ రాక కారణంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో అయితే భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ప్రధాని పర్యటన కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సర్వీసులను నిలిపివేశారు. టికెట్ ఉన్నవారిని మాత్రమే ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు. పిక్‌అప్ చేసుకునే వారికి కూడా పాస్‌లు తప్పనిసరి చేశారు.
ఇక ప్రకాశం బ్యారేజ్‌పై కూడా సామాన్యులకి అనుమతి నిరాకరించారు పోలీసులు. కేవలం ప్రధాని సభకు వెళ్లే వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు సెక్రటేరియట్ దారిని కూడా మూసివేశారు. ఉద్యోగులు ఉదయం 10 గంటల వరకు తమ వాహనాలలో వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత ఆ దారిని మూసివేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులను ఐడీ కార్డులు చూపించి నడుచుకుంటూ వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.