Drone Delivery: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేవలందించే దిశగా కీలక అడుగులు పడ్డాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ ‘ఎయిర్‌బౌండ్’ (Airbound), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి రాజధాని అంతటా డ్రోన్ల ద్వారా వస్తువుల రవాణా, డెలివరీ సేవలను ప్రారంభించనున్నారు.
దిల్లీలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు సమక్షంలో ఈ ఒప్పందానికి శ్రీకారం చుట్టారు. ఏపీడీసీ చైర్ పర్సన్ గీతాంజలి శర్మ, ఎయిర్ బౌండ్ సీఈఓ నమన్ పుష్ప్ ఈ మేరకు అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ప్రతిపాదిత ‘అమరావతి క్యాపిటల్ రీజియన్ డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్’లో భాగంగా అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ వైద్యారోగ్యం, ఈ-కామర్స్, ఇతర వాణిజ్య రంగాలకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అయితే ఈ డ్రోన్ డెలివరీల ప్రాజెక్టును విడతల వారీగా అమలు చేయనున్నారు. మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరులో ప్రారంభించనున్నారు. ఆపై అమరావతి రీజియన్, తర్వాత రాబోయే ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోజుకు ఏకంగా 10,000 డ్రోన్ సర్వీసులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ ఈ లక్ష్యం నెరవేరితే ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ డ్రోన్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది.
ఈ నెట్‌వర్క్ కోసం ఎయిర్‌బౌండ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ‘బ్లెండెడ్ వింగ్ బాడీ టెయిల్సిట్టర్’ డ్రోన్లను ఉపయోగించనున్నారు. కేవలం 1.5 కేజీల బరువుండే ఈ డ్రోన్లను తేలికపాటి కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. సాధారణ డ్రోన్లతో పోలిస్తే ఇవి ఎక్కువ బరువును మోసుకెళ్లగలవు. దీనివల్ల డెలివరీ ఖర్చులు 20 రెట్లు తగ్గుతాయని, రవాణా ఖర్చు కిలోమీటరుకు కేవలం 10 పైసల వరకే పరిమితం అవుతుందని సంస్థ తెలిపింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విమానయాన రంగంలో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎయిర్‌బౌండ్ ప్రస్థానమే నిదర్శనమని కొనియాడారు. ఇలాంటి అత్యాధునిక దేశీయ సాంకేతికత వల్ల నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఏపీడీసీ ఎండీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సరికొత్త లాజిస్టిక్స్ రంగానికి ఈ ఒప్పందం పునాది వేస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మౌలిక వసతులకు ఎయిర్‌బౌండ్ సాంకేతికత తోడైతే స్థానిక వ్యాపారాలు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె అన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ డ్రోన్ హబ్‌గా మార్చాలనే లక్ష్యం నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఎయిర్‌బౌండ్ సీఈఓ నమన్ పుష్ప్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు సరుకు రవాణా రంగంలో విఫ్లవాత్మక మార్పు తీసుకొస్తుందని అంచనా వేశారు. పెద్ద పెద్ద వాహనాలతో కూడిన పాత డెలివరీ పద్ధతులకు స్వస్తి చెప్పి.. 20 టన్నుల ట్రక్కుకు అయ్యే ఖర్చుతోనే చిన్న చిన్న పార్సిళ్లను డ్రోన్ల ద్వారా వేగంగా చేరవేస్తామన్నారు. ఇందుకోసం ఒక ఓపెన్ సోర్స్ గ్రిడ్‌ను నిర్మిస్తున్నామని వివరించారు.
Also Read: అమెజాన్ సూపర్ సేల్.. అత్యంత చౌకగా ఫ్రిజ్‌లు.. సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్!
కాగా, బెంగళూరులో ‘నారాయణ హెల్త్’ సంస్థ కోసం ఇప్పటికే 1,000కి పైగా మెడికల్ డ్రోన్ సర్వీసులను విజయవంతంగా నడిపిన అనుభవం ఎయిర్‌బౌండ్‌కు ఉంది. అదే అనుభవంతో అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక డ్రోన్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాపింగ్, నిబంధనల క్లియరెన్స్ వంటి పనులను సంస్థ త్వరలోనే ప్రారంభించనుంది.
Also Read: పెళ్లి వద్దని చెప్పడం కంటే.. హత్య చేయడమే తేలిక.. విచారణలో సియా గోయల్ వెల్లడి