Engineer Shortage: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంజనీర్ల కొరత వేధిస్తుంది. క్యూర్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించిన గత ఫిబ్రవరి 11వ తేదీ తర్వాత మూడు కార్పొరేషన్లకు కావల్సిన అధికారులు, సిబ్బంది వివరాలతో సర్కారుకు స్టాఫ్ ప్యాట్రన్ ప్రతిపాదనలు పంపినా, ఇంత వరకు సర్కారు ఆమోదించక పోవటంతో మూడు కార్పొరేషన్లు ఉన్న సిబ్బందితోనే సర్దిపెట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా ఇంజనీరింగ్ వింగ్‌లో మూడు కార్పొరేషన్లలో కొరత కొనసాగుతుంది. ఫలితంగా ఒక్కో ఇంజనీర్‌కు మూడు నుంచి నాలుగు బాధ్యతలు అప్పగించారు. దీంతో అసలు విధుల కన్నా అదనపు బాధ్యతలే ఎక్కువయ్యాయి. ఫలితంగా ఒకటి కన్నా ఎక్కువ ఇన్ ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇంజనీర్లు ఎపుడు ఆఫీసులో ఉంటారో? ఎపుడు ఫీల్డులో ఉంటారో? తెలియని పరిస్థితులు నెలకున్నాయి. ఇదే కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మరో మహిళా ఇంజనీర్ ప్రాజెక్టులు వింగ్‌కు సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా వ్యవహరించటంతో పాటు ఇన్ ఛార్జి చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సూపరింటెండెంట్ ఇంజనీరే లేరు. ఈ నెలాఖరున ఏకంగా ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు పదవీ విరమణ పొందనున్నారు.
అశోక్ రెడ్డి, మోహన్ రెడ్డి, పీవీ కృష్ణారావులు ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందిన తర్వాత ఇంజనీర్ల కొరత మరింత తీవ్ర రూపం దాల్చనుంది. వీరితో పాటు మరో ఇద్దరు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి.మోహన్ కుమార్, జి. హరికుమార్ లు, సెప్టెంబర్ నెలాఖరులో బీవీఎస్ పేర్రాజు, సంతోష్ బాబులు కూడా పదవీ విరమణలు పొందనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనులను గాడీన పెట్టిన చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ కూడా వచ్చే ఆగస్టు మాసంలో పదవీ విరమణ పొందనున్నట్లు తెలిసింది. ఆయన సీటు ఖాళీ అయిన తర్వాత సమర్థులైన అధికారులు ఆ సీటులోకి రాకుంటే హెచ్ సిటీ పనులు అయోమయంలో పడే అవకాశమున్నట్లు ఇంజనీరింగ్ విభాగంలో చర్చ లేకపోలేదు. మూడు కార్పొరేషన్లు ఏర్పాటు కాకముందే ఇంజనీర్లను కేటాయించాలని జీహెచ్ఎంసీ సర్కారుకు లేఖ రాసినా, ఎలాంటి స్పందన లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: హైడ్రోజన్ రైలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. త్వరలో పట్టాలపై పరుగులు!
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఏకంగా నాలుగు రకాల విధులు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులు వింగ్ లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గా సైబరాబాద్ కార్పొరేషన్ లో కొనసాగుతూనే, అదనపు బాధ్యతలుగా ఎలక్ట్రిక్ వింగ్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా, కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్ మెంట్ (కుడా)లో చీఫ్ ఇంజనీర్ గా, వీటికి తోడు ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక్కో సర్కిల్ లో ఏఈ, డీఈ, ఈఈలతో పాటు మొత్తం ఎనిమిది ఇంజనీరింగ్ స్థాయి అధికారులుండాలి, జీహెచ్ఎంసీలో మెయింటనెన్స్, ప్రాజెక్టు విభాగాలకు అన్ని క్యాటగిరీల ఇంజనీర్లు మొత్తం 210 మంది సేవలు అవసరం కాగా, ప్రస్తుతం వందలోపే అన్ని క్యాటగిరీల ఇంజనీర్లున్నట్లు సమాచారం. ఉన్నవారికే మూడు నుంచి నాలుగు అదనపు బాధ్యతలు అప్పగించటంతో అసలు విధులకు ఇంజనీర్లు న్యాయం చేయలేకపోతున్నారన్న వాదనలున్నాయి.
క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో మెయింటనెన్స్ విభాగం ఇంజనీర్లు లేక అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా జోన్ కు ఒకరు చొప్పున సూపరింటెండెంట్ ఇంజనీర్ మెయింటనెన్స్ విభాగానికి ఉండాలన్న నిబంధన ఉన్నా, అది ఏ మాత్రం అమలు కావటం లేదు. సర్కారు కూడా కొత్తగా ఇంజనీర్లను కేటాయించకపోవటంతో అభివృద్ది, మెయింటనెన్స్ పనులు ముందుకు సాగటం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా 2024 డిసెంబర్ లో కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ) రోడ్లకు మెరుగుగా నిర్వహణ చేపట్టేందుకు నియమించిన ఏజెన్సీల గడువు ముగిసింది.
ఆ తర్వాత జీహెచ్ఎంసీ మళ్లీ సుమారు 1050 కిలోమీటర్ల రోడ్డును రూ. 3145 కోట్ల వ్యయంతో ఏజెన్సీలకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినా, కనీసం ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ కూడా నిర్వహించలేదు. దీంతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మొత్తం 7 లక్షల 65 వేల స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్‌కు గత సంవత్సరం ఏప్రిల్ మాసంలోనే ఈఈఎస్ఎస్ సంస్థతో మెయింటనెన్స్ అగ్రిమెంట్ ముగిసింది. మెరుగైన మెయింటనెన్స్ విధానంతో ఏజెన్సీలను నియమించాలన్న రూ. 2828 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనకు సర్కారు అనుమతి తెలిపి, ఆరు నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు అతీగతీలేదు. ఫలితంగా అసలే వర్షాకాలం శివార్లలోని పలు రద్దీ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు సరిగ్గా వెలగటం లేదన్న ఫిర్యాదులున్నాయి. భారీ వర్షం కురిసి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
Also read: Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బీఎల్ఓల షాకింగ్ న్యూస్.. ఆ తేదిలోపు ఇవ్వాల్సిందే..?